బ్లాంక్ చెక్.. పోస్టులు | Blank check .. posts | Sakshi
Sakshi News home page

బ్లాంక్ చెక్.. పోస్టులు

Published Wed, Oct 29 2014 2:11 AM | Last Updated on Wed, Apr 3 2019 3:52 PM

బ్లాంక్ చెక్.. పోస్టులు - Sakshi

బ్లాంక్ చెక్.. పోస్టులు

అక్రమ రవాణాకు అడ్డాగా మారిన చెక్‌పోస్టులు
మామూళ్ల మత్తులో జోగుతున్న సిబ్బంది
చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు
జిల్లాలో ఇదీ పరిస్థితి

 
చెక్‌పోస్టులో ఉద్యోగమంటే బ్లాంక్ చెక్కుచేతికిచ్చినట్టే. జిల్లాల్లో ఎన్నో చెక్ పోస్టులు న్నా అక్రమ రవాణా ఎలా జరుగుతోందంటారు.  బండి వచ్చిందంటే జేబుపైనే ధ్యాస.. చేయి తడిపితే చాలు.. ఏ సరుకైనా ఎస్కార్ట్‌గా వచ్చి సాగనంపేస్తారు.. నిఘా నీడలో ఉండాల్సిన తనిఖీ కేంద్రాలు బ్లాంక్ చెక్‌పోస్టులుగా మారిపోతున్నాయి. ఇక్కడ ఉద్యోగమంటే చాలామంది ఎగిరి గంతేస్తారు. ఆ ఉద్యోగం కోసం రాజకీయ నాయకుల్ని మొదలు... దేవుళ్ల వరకు చుట్టేస్తారు. లంచాలకూ పాలుమాలరు. ఆ ఒక్క ఉద్యోగముంటే చాలని లక్షలు కుమ్మరించేస్తారు.. ఉద్యోగమొస్తే బడా స్మగ్లర్లకు దాసోహమైపోతారు.
 
తిరుపతి(మంగళం): జిల్లాలోని చెక్ పోస్టులు అక్రమ వసూళ్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. మామూళ్లిస్తే చాలు చెక్‌పోస్టు సిబ్బందే బడాస్మగ్లర్లకు రెడ్‌కార్పెట్ పరిచేస్తారు. బీట్ ఆఫీసర్లే ఎస్కార్‌‌టగా వచ్చి ఎర్రచందనాన్నీ సాగనంపేస్తారు. ఇంటిదొంగలే సహకరిస్తున్నప్పుడు ఇక తమను పట్టుకునేవారెవరంటూ స్మగ్లర్లు చెలరేగిపోతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా తమ పనికానిచ్చేస్తున్నారు.

కలగా ఆధునికీకరణ పద్ధతులు

చెక్‌పోస్టుల్లో లంచగొండితనాన్ని అరికట్టేందుకు అటవీ శాఖ ఉన్నతాధికారులు నడుం బిగించారు. చెక్‌పోస్టులను ఆధునికీకరించి సిబ్బంది పని తీరును మెరుగుపరచాలని ప్రణాళిక సిద్ధం చేశారు. 2010 జనవరిలో తిరుపతిలో నిర్వహించిన ప్రాంతీయ సదస్సులో అప్పటి పీసీసీఎఫ్ మధుకర్‌రాజ్ నేతృత్వంలో చెక్‌పోస్టుల ఆధునికీకరణపై చర్చించారు. జిల్లాలోని 27 చెక్‌పోస్టుల పనితీరును మెరుగుపరచాలని నిర్ణయించారు. రహదారుల్లో నిర్వహిస్తున్న టోల్‌గేట్లు తరహాలో ఎలక్ట్రానిక్ చెక్‌పోస్ట్ విధానాన్ని అమలుపరిచి, తనిఖీ చేసే ప్రతి వాహనం వివరాలనూ కంప్యూటర్ ద్వారా పొందుపరచాలని భావించారు. ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వాహనాన్ని వీడియో కెమెరాల ద్వారా రికార్డ్‌చేసి, సిబ్బంది అవినీతికి పాల్పడే వీలులేకుండా చేయాలని భావించారు. అయితే ఏళ్లు గడిచినా ఇంతవరకు ఈ భావనలు అమలులోకి రాలేదు. ఈ నేపథ్యంలో చెక్‌పోస్టులు అవినీతి కేంద్రాలుగా, వసూళ్లకు అడ్డాగా మారిపోయాయి.
 
స్మగ్లర్లకు రాచమార్గం


శేషాచల అడవుల్లో నుంచి ఎర్రచందనాన్ని అక్రమంగా తరలించేందుకు చెక్‌పోస్టులు స్మగ్లర్లకు రాచమార్గాలుగా మారాయి. ఇక్కడ డ్యూటీ చేసేవారితో స్మగ్లర్లు ఒప్పందం కుదుర్చుకుంటారు. చేయి తడపగానే ఎర్రచందనం లోడు చేసుకునేటప్పుడు.. వెళ్లేటప్పుడు ఆ బీట్ ఆఫీసర్లే ఎస్కార్ట్‌గా వచ్చి సాగనంపేస్తారు. ఇంటి దొంగలే సహకరిస్తున్నప్పుడు తమను పట్టుకునేదెవ్వరని స్మగ్లర్లు కాలరెగరేస్తున్నారు.
 
 
చెక్‌పోస్టుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం

ఎర్రచందనం అక్రమంగా తరలిపోకుండా అటవీ శాఖ చెక్‌పోస్టుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. సీసీ కెమెరాలు కన్ను కప్పి ఎర్రచందనాన్ని చెక్‌పోస్టులు దాటిస్తే ఆ వాహనాలు మరోచోట పట్టుపడితే మొదటి చెక్‌పోస్టులో డ్యూటీ చేస్తున్న అధికారులు, సిబ్బందిని సస్పెండ్ చేస్తాం. ఎర్రచందనం స్మగ్లర్లకు అటవీ శాఖలో ఎవరైనా సహకరించినట్లు తెలిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు.        - జీ.శ్రీనివాసులు, వైల్డ్‌లైఫ్ డీఎఫ్‌వో
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement