సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి కల్యాణకట్ట సేవకులకు శుభవార్త. ప్రస్తుతం కల్యాణ కట్టలో ఉచితంగా సేవలందించే వారికి ఏప్రిల్ 1 నుంచి ఒక్కొక్కరికి రోజుకు కనీసం రూ.400కు తగ్గకుండా బహుమానం ఇవ్వాలని టీటీడీ ఈవో సాంబశివరావు నిర్ణయించారు. తలనీలాలు సమర్పించే భక్తుల నుంచి డబ్బులు తీసుకోవడం.. వారివద్ద నుంచి కొందరు అధికారులు మామూళ్లు తీసుకోవడం.. వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం కల్యాణకట్టల్లో పనిచేసే 280 మంది శాశ్వత ఉద్యోగుల్లో ఒక్కొక్కరికి రూ.30వేల దాకా జీతభత్యాలు వస్తున్నాయి. 300 మంది కాంట్రాక్టు కార్మికులు (పీసురేటు క్షురకులు)కు ఒక్కో గుండుకు రూ.7, కత్తిరింపులకు రూ.3 టీటీడీ అందజేస్తోంది.
ఉచిత సేవచేసే సుమారు వెయ్యిమందికి ఎలాంటి ఉపాధి లేదు. పైగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం భక్తుల నుంచి క్షురకులు చేయిచాచి నగదు అడగరాదు. క్షౌర వృత్తి సాగించేవారు పేద వర్గానికి చెందినవారే. ‘మానవసేవే మాధవ సేవ’గా సేవలందించే ధార్మిక సంస్థ అయిన టీటీడీ కల్యాణకట్టల్లో మూడు విభాగాలు (శాశ్వత ఉద్యోగులు, పీసురేటు కార్మికులు, ఉచిత సేవకులు) అన్న తారతమ్యాలున్నాయి.
ఉచిత సేవ చేసేవారు, వారిపై ఆధారపడ్డ కుటుంబాల జీవనం కోసం కాంట్రాక్టు కార్మికుల తరహాలోనే బహుమానం ఇవ్వడం సముచితమని టీటీడీ ఈవో సాంబశివరావు భావించారు. ఈనేపథ్యంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి బహుమానం ఇవ్వాలని నిర్ణయించారు. కనీసం ఒక్కొక్కరికి రోజుకు రూ.400 నుంచి రూ.500 వరకు బహుమానం ఇచ్చే విషయంపై లెక్కలు వేస్తున్నారు.
జీవనం కోసం క్షురకులకు బహుమానం : ఈవో
కల్యాణకట్టల్లో ఉచిత సేవ చేసే క్షురకులు దాదాపుగా పేదవర్గానికి చెందినవారేనని, అలాంటి వారి జీవనం సాఫీగా సాగేందుకు బహుమానం అందజేస్తామని టీటీడీ ఈవో సాంబశివరావు గురువారం రాత్రి సాక్షికి తెలిపారు. కల్యాణకట్టల్లో ఉచిత సేవచేస్తూ భక్తుల నుంచి డబ్బులు డిమాండ్ చేయడంలో ధార్మిక సంస్థ ప్రతిష్ట ఇమిడి ఉంటుందన్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే పీసురేటు కార్మికుల తరహాలోనే కల్యాణకట్ట సేవకులకూ ఏప్రిల్ నుంచి బహుమానం అందజేస్తామన్నారు.
‘సేవ’కు వెంకన్న వరం
Published Fri, Mar 27 2015 3:33 AM | Last Updated on Sat, Aug 25 2018 7:22 PM
Advertisement
Advertisement