విజయవాడలో నిర్వహించిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభలో కృష్ణా జిల్లా మైలవరం నుంచి వచ్చిన అంధ ఉపాధ్యాయుడు గంగాధర్ సమైక్యాంధ్ర గీతాలు ఆలపించి సభికులను ఆకట్టుకున్నారు. ముందుగా ఆయన ప్రధాని మన్మోహన్ సింగ్, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖరరెడ్డిల గొంతును అనుకరిస్తూ.. సమైక్యాంధ్ర ఆవశ్యకతను వారి గొంతుతో వివరించారు. అలాగే, సమైక్య ఉద్యమానికి స్పందించి రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని తాము నిర్ణయించుకున్నట్లుగా మన్మోహన్, ప్రణబ్ ప్రకటించారన్నారు.
‘జై సమైక్యాంధ్ర.. జైజై సమైక్యాంధ్ర.. విభజించేదెవ్వరూ.. విడిపోయే దెవ్వరూ...’ అంటూ ఆయన పాడిన పాటకు సభికులు నృత్యం చేశారు. వన్స్‌మోర్.. అంటూ కేకలు వేయటంతో నిర్వాహకులు తిరిగి ఆయనతో మరో పాట పాడించారు. వేదికపైన స్టెప్పులు వేస్తూ సమైక్యాంధ్ర ఉద్యమకారుల్లో ఆయన సమరోత్సాహాన్ని నింపారు. ‘అశోక్‌బాబు చేస్తున్న ఉద్యమం గొప్పది, అది నా మనసును సైతం మార్చింది. నేను సమైక్యవాదిగా మారిపోయా..’ అని ప్రధాని మన్మోహన్‌సింగ్ గొంతును అనుకరించి హిందీలో మాట్లాడటంతో సభికులు కరతాళ ధ్వనులతో ఆయనను అభినందించారు. తన భార్య అంధురాలని, సమైక్యాంధ్ర కోసం రెండు రోజులపాటు నిరాహార దీక్ష చేశారని తెలిపారు.
గంగాధర్ అనుకరణలలో ఆయా నాయకులు చెప్పిన విషయాలు..
''ప్రజాభిప్రాయాన్ని గనక మన్నించకపోతే ప్రభుత్వాలకు ప్రజలు సెలవులచ్చిన సందర్భాలున్నాయి" - ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
''అశోక్ బాబు నాయకత్వంలో నడుస్తున్న ఉద్యమానికి స్పందించి. ఆంటోనీ కమిటీ, దిగ్విజయ్ సింగ్‌ల కమిటీలను రద్దు చేస్తున్నా'' -ప్రధాని మన్మోహన్ సింగ్
''తెలంగాణ బిల్లును తిరస్కరిస్తూ, సమైక్యాంధ్రనే కొనసాగిస్తున్నా. ఉద్యమానికి స్పందిస్తున్నా జై సమైక్యంధ్ర'' - రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
''తెలుగుజాతి శౌర్యాన్ని చూసి.. స్వర్గలోకంలో ఉన్న నేనే ఈ సభకు వచ్చి, దీన్ని దిగ్విజయం చేయాలనుకుంటున్నాను'' -ఎన్టీరామారావు
''రామారావు గారే కాదు.. నేను కూడా సమైక్యాంధ్రకే మద్దతిస్తున్నా. ప్రజలందరికీ తెలుసు. నా అక్కలకీ చెల్లెళ్లకీ అందరికీ చెబుతున్నా.. జై సమైక్యాంధ్ర'' - వైఎస్ రాజశేఖరరెడ్డి
సమైక్య సభలో అదరగొట్టిన అంధ ఉపాధ్యాయుడు
Published Sat, Sep 21 2013 4:09 PM | Last Updated on Wed, Apr 3 2019 4:10 PM
Advertisement
Advertisement