కొవ్వొత్తుల వెలుతురులో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగే పరశురాం, వైఎస్సార్‌సీపీ నాయకులు
అనంతపురం : రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ మంగళవారం ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపునిచ్చిన బ్లాక్‌డే(బిజిలీ బంద్) జిల్లాలో విజయవంతమైంది. రాత్రి 7 నుంచి 7.30 గంటల వరకు లైట్లు ఆర్పివేసి నిరసన తెలియజేశారు. అనంతపురం నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగే పరుశురాం, జిల్లా అధికార ప్రతినిధి ఆలుమూరు శ్రీనివాసరెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి కేఎల్ దేవి, విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు మారుతీప్రకాష్, 13, 14 డివిజన్ల కన్వీనర్లు హేమంత్, శ్రీకాంత్ పాల్గొన్నారు. లైట్లు ఆర్పేసి కొవ్వొత్తుల వెలుగులో గడిపారు.
ఈ సందర్భంగా రాగే పరుశురాం మాట్లాడుతూ రాష్ట్రానికి పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. వారిపై ఒత్తిడి తేవాల్సిన తెలుగుదేశం ప్రభుత్వం చేతులెత్తేసిందని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసుకు భయపడే ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగురాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పెద్దల వద్ద తాకట్టు పెట్టారన్నారు. రాష్ట్రంలో ఎవరైనా హోదా కోసం ఉద్యమిస్తే జైలుకు పంపుతామని హెచ్చరించి ఆయన ఇప్పుడు హోదా జపం చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
ఒక్క వైఎస్సార్‌సీపీ నాలుగేళ్లుగా హోదా కోసం అలుపెరగని పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు. ఈ విషయంపై తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను చైతన్యవంతం చేశారన్నారు. ఈరోజు ఉద్యమం ఉధృతం కావడంతో తమ పార్టీకి మనుగడ ఉండదని భయపడ్డ చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని టీడీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment