సాక్షి, రాజమహేంద్రవరం/నెట్‌వర్క్: తూర్పుగోదావరి జిల్లా పశువుల్లంకలో పడవ ప్రమాదం జరిగి రోజున్నర గడిచినా గల్లంతైన తమ వారి జాడ కానరాక విద్యార్థుల తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. పాఠశాలకు వెళ్లి వస్తామని చెప్పిన తమ పిల్లలు తిరిగిరాకపోవడాన్ని ఆ కుటుంబాలు తట్టుకోలేకపోతున్నాయి. పడవ ప్రమాదం వార్త తెలిసినప్పటి నుంచి ఆ ఆరుగురు విద్యార్థినుల తల్లిదండ్రులు గోదావరి ఒడ్డునే ఉండి తమవారి కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.
తమ పిల్లలను తలచుకుంటూ నది ఒడ్డున కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. పడవ ప్రమాదంలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు గోదావరిని సహాయక బృందాలు జల్లెడ పడుతూనే ఉన్నాయి. భారీ వర్షం, నదిలో నీటి ఉధృతితో గాలింపు చర్యలకు ఆటకం కలుగుతున్నా నిరంతరాయంగా పనిచేస్తున్నాయి. ప్రమాద సమయంలో ఏడుగురు గల్లంతయ్యారని అధికారులు ధ్రువీకరించారు.
గల్లంతయిన మహిళ గల్లా నాగమణి మృతదేహం రాత్రి ఏడు గంటల సమయంలో లభ్యమైంది. ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి కిలోమీటర్ దూరంలోని కొమరిగిరి వద్ద నది ఒడ్డున మృతదేహాన్ని గుర్తించారు. మిగిలిన ఆరుగురు విద్యార్థుల కోసం రాత్రి కూడా గాలింపు కొనసాగిస్తున్నారు. ఆదివారం ఉదయం 7.30 గంటల నుంచే జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ విశాల్ గున్ని గాలింపు చర్యలను పర్యవేక్షించారు. యానం బేస్‌క్యాంప్ కేంద్రంగా జాతీయ విపత్తు నిర్వహణ దళం (ఎన్డీఆర్‌ఎఫ్), రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం (ఎస్డీఆర్‌ఎఫ్), నేవీ, కోస్ట్‌గార్డ్, అగ్నిమాపక దళం, నాటు పడవలతో స్థానిక మత్య్సకారులు గాలింపు చర్యల్లో పాల్గొన్నారు.
నదిని జల్లెడ పడుతున్న దళాలు..
పడవ బోల్తా పడిన పశువుల్లంక నుంచి యానం–ఎదరులంక బ్రిడ్జి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. ధవళేశ్వరం వద్ద గోదావరి పాయలుగా విడిపోయింది. ఐ.పోలవరం మండలం పశువుల్లంక వద్ద గౌతమి నుంచి వృద్ధ గౌతమి పాయ విడిపోయి తిరిగి తాళ్లరేవు మండలం గౌరవపాలెం వద్ద గౌతమిలో కలుస్తోంది. గౌతమి పాయ యానం మీదుగా వెళ్లి సముద్రంలో కలుస్తుంది. ప్రస్తుతం అధికార యంత్రాంగం యానం–ఎదుర్లంక బ్రిడ్జికి ఎగువన, సముద్రం వైపున గాలింపుపై దృష్టి సారించింది. 64 మందితో కూడిన రెండు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, 9 బోట్ల సహాయంతో కమాండెంట్ అజయ్‌మండల్ పర్యవేక్షణలో గాలిస్తున్నాయి.
మరోవైపు ఏపీఎస్డీఆర్‌ఎఫ్ చెందిన కమాండెంట్ జె.కోటేశ్వరరావు ఆధ్వర్యంలో 74 మంది సిబ్బంది, వీరికితోడుగా 34 మంది అగ్నిమాపక దళ సిబ్బంది, విశాఖ నుంచి వచ్చిన నావికాదళ సిబ్బంది, కోస్ట్ గార్డ్స్, గజ ఈతగాళ్లు, యానం సమీప ప్రాంతాల మత్య్సకారులు గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. హెలికాప్టర్‌నూ గాలింపు పనులకు వినియోగించారు. ఎన్డీఆర్‌ఎఫ్ శాటిలైట్ వ్యవస్థ ద్వారా యానంలోని రాజీవ్ బీచ్ నుంచి అధికారులు గాలింపు దళాలకు సూచనలు చేశారు. గల్లంతైన వారి ఆచూకీని కనుగొనేందుకు గోదావరి నదిలో నౌకాదళ బృందాలు శాయశక్తులా కృషి చేస్తున్నాయని విశాఖలోని ఈఎన్‌సీ కార్యాలయం వెల్లడించింది.
సాగర సంగమమే లక్ష్యంగా అన్వేషణ...
వర్షాలతో గోదావరిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. ధవశేశ్వరం బ్యారేజీ నుంచి దిగువకు భారీ ఎత్తున వరద నీరు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ నుంచి కోనసీమ మీదుగా ప్రవహించి గోదావరి పాయలు సముద్రంలో కలుస్తున్నాయి. వరద ప్రవాహంతో నదిలో వడి ఎక్కువగా ఉంది. దీంతో గల్లంతయిన వారు ఒకే చోట, ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే ఉండరన్న అంచనాతో గాలింపు బృందాలు ఉదయం నుంచి ప్రమాద స్థలం దిగువన, సాగర సంగమం లక్ష్యంగా అన్వేషణ సాగించాయి.
నాటు పడవలను అరికడతాం: చినరాజప్ప
గోదావరిలో పడవ ప్రమాదంలో గల్లంతైన బాలికలు, వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి చినరాజప్ప ఆదివారం తెలిపారు. బేస్ క్యాంపు వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మృతి చెందిన ఓ మహిళ కుటుంబానికి చంద్రన్న బీమా యోజన ద్వారా రూ.5 లక్షలు, ఆచూకీ దొరకని ఆరుగురు బాలికల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షలు చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించినట్లు తెలిపారు. లంక గ్రామాల్లో ప్రజలు నాటు పడవలను ఆశ్రయిస్తూ ఉంటారని, పలు ప్రాంతాల్లో నిర్మాణాల్లో ఉన్న వంతెనలు పూర్తయితే నాటు పడవలను రద్దు చేస్తామని తెలిపారు. పశువుల్లంక వద్ద వంతెన నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేస్తామన్నారు.
దుఃఖసాగరంలో లంక గ్రామాలు
అమలాపురం టౌన్/ముమ్మిడివరం: తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పశువుల్లంక–మొండిలంక వృద్ధ గౌతమి నదీ పాయలో శనివారం సంభవించిన పడవ ప్రమాదంలో గల్లంతైన ఆరుగురు విద్యార్థులు, ఓ వివాహిత కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి. ఈ దుర్ఘటనతో గోదావరి మధ్య దీవిలో ఉన్న సలాదివారిపాలెం, వలసలతిప్ప, పొట్టితిప్ప, శేరులంక, సీతారామపురం, కొత్తలంక గ్రామాల్లో విషాదం అలుముకుంది. గల్లంతైన వారి ఒక్కో కుటుంబానిదీ ఒక్కో కన్నీటి గాధ. వీరందరికీ పడవ ప్రమాదం కట్టలు తెగే దుఃఖాన్ని మిగిల్చింది. బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న ఆ లంక గ్రామాల్లో ‘సాక్షి’ బృందం ఆదివారం పర్యటించింది. బాధిత కుటుంబాలను పలకరించగా వారు కన్నీటి పర్యంతమయ్యారు.
ఒకే ఇంటిలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు..
సీతారామపురం లంకకు చెందిన పోలిశెట్టి మాచరరావు ఓ వ్యవసాయ కూలీ. ఆయనకు ముగ్గురు ఆడపిల్లలు. అనూష, సుచిత్ర, కనక మహాలక్ష్మి. అనూష (9వ తరగతి), సుచిత్ర (6వతరగతి) పశువుల్లంక జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. రోజూలాగే శనివారం అక్కాచెల్లెళ్లు పడవ ఎక్కి గోదావరి దాటి పాఠశాలకు వెళ్లారు. తిరుగు ముఖంలో ప్రమాదంలో చిక్కుకుని గల్లంతయ్యారు. వారి తల్లి వీరవేణిని ఓదార్చడం ఎవరితరం కావడంలేదు. ఏడాది కిందటే అనూష పుష్పవతి వేడుక చేశానని తండ్రి మాచరరావు తలుచుకుని కుమిలిపోతున్నాడు.
బాగా చదివి ఉద్యోగం చేస్తాననేది
మనీషా తండ్రి తాతాజీ ఆవేదన
‘నేను బాగా చదవి ఉద్యోగం చేస్తాను. అప్పుడు మీరు కష్టపడకుండా చూసుకుంటానని అనేది.. నా చిట్టితల్లి ఇప్పుడు గోదావరి పాలైపోయింది’.. అని పడవ ప్రమాదంలో గల్లంతైన పోలిశెట్టి మనీషా (10వ తరగతి) తండ్రి పోలిశెట్టి సూర్యనారాయణ (తాతాజీ) విలపిస్తూ చెప్పాడు. అనూష, సుచిత్రల తండ్రి మాచరరావు, తాతాజీ స్వయాన అన్నదమ్ములు. సీతారామపురం లంకలోనే ఇరుగుపొరుగు ఇళ్లు. ఆ ఇద్దరి అన్నదమ్ముల ఇళ్లలో ముగ్గురు ఆడపిల్లలను గోదావరి పొట్టన పెట్టుకుంది. గల్లంతైన తమ పిల్లల కోసం ఆ కుటుంబ సభ్యుల దు:ఖాన్ని ఆపడం ఎవరితరం కావడంలేదు. తాతాజీ సైకిల్‌పై కూరగాయలు అమ్ముకుంటూ జీవిస్తాడు.
వనమహోత్సవానికి వెళ్లి బలి
పడవ ప్రమాదంలో గల్లంతైన షేర్‌లంకకు చెందిన కొండేపూడి రమ్య (9వ తరగతి)కి చదువు, పాటలంటే ప్రాణం. బాగా చదవడమే కాదు బాగా పాడుతుంది కూడా. తండ్రి రవికుమార్ వ్యవసాయ కూలీ. ముగ్గురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి సంతానం. వీరంతా రోజూ పడవపై గోదావరి దాటి వెళ్లి చదువుకుంటున్నారు. రెండో శనివారం కావడంతో ముగ్గురు ఇంటి వద్దే ఉండిపోయారు. వన మహోత్సవం కార్యక్రమానికి పాఠశాల తెరవడంతో రమ్య వెళ్లి గోదావరికి బలైందని ఆమె కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది.
వర్షం వచ్చినా బడి మానని శ్రీజ
పడవ ప్రమాదంలో గల్లంతైన సలాదివారిపాలేనికి చెందిన సుంకర శ్రీజ (10వ తరగతి) వర్షం వచ్చినా బడికి మానేది కాదని చదువంటే అంత ఇష్టంగా చదివేదని కుటుంబీకులు ఆమె జ్ఞాపకాలను తలుచుకుని కుమిలిపోతున్నారు. శ్రీజ తండ్రి వెంకటేశ్వరరావు వ్యవసాయ కూలీ. అబ్బాయి శాంతికిరణ్ అమలాపురంలో డిగ్రీ చదువుతున్నాడు. తమ ఇంటి ఏకైక ఆడపిల్ల ప్రమాదంలో గల్లంతు కావడంతో ఆ కుటుంబం విలపిస్తున్న తీరు అందరినీ కలిచివేస్తోంది.
తల్లి పరలోకం.. తండ్రి పరదేశం..
పడవ ప్రమాదంలో గల్లంతైన వలసలతిప్ప లంక గ్రామానికి చెందిన తిరుకోటి ప్రియ (8వ తరగతి) తల్లి ఐదేళ్ల కిందటే మరణించింది. ఆమెకు అక్క ఉంది. ఇంటర్ చదువుతోంది. పిల్లలను తమ బంధువుల పర్యవేక్షణలో ఉంచి ఆమె తండ్రి ఏడాదిన్నర కిందట ఉపాధి కోసం కువైట్ వెళ్లాడు. అప్పటి నుంచి రాలేదు. పిల్లల చదువులకు అక్కడ నుంచే డబ్బులు పంపిస్తున్నాడు. తన కుమార్తె గోదావరిలో గల్లంతైందని తెలిసి తండ్రి శోకతప్త హృదయంతో ఇంటికి బయల్దేరాడు.
ఉంగరం విడిపించేందుకు వెళ్లి..
పడవ ప్రమాదంలో గల్లంతైన షేర్‌లంకకు చెందిన గెల్లా నాగమణి (30) గృహిణి. భర్త దుర్గారావు వ్యవసాయ కూలీ. ఇటీవల కుటుంబ అవసరాల కోసం తాకట్టు పెట్టిన ఉంగరాన్ని విడిపించేందుకు మురమళ్ల వెళ్లింది. తిరుగు ప్రయాణంలో పడవ ప్రమాదానికి గురైంది. పెళ్లై పదేళ్లవుతున్నా పిల్లలు పుట్టలేదని బాధపడుతున్న ఆమె.. తల్లి కాకుండానే గోదావరి తల్లి ఒడిలో కడతేరిపోయిందని ఆమె కుటుంబీకులు భోరున విలపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment