
బోల్తాపడిన పడవను బయటకు తీసున్న కూలీలు
నందివాడ (గుడివాడ) : చేపల చెరువులో రేకు పడవ బోల్తాపడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన మండలంలోని తమిరిశ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ మహిళ ప్రాణాలతో బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
గుడివాడకు చెందిన కత్తుల సత్యనారాయణ (40) తమిరిశలో సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో చేపల చెరువు సాగు చేస్తున్నాడు. చెరువులో మందు చల్లటం కోసం గురువారం రేకు పడవపై విజయనగరం జిల్లా కొమరాడ మండలం గున్ననపురం గ్రామానికి చెందిన వలస కూలీలు బొండుపల్లి ఆదినారాయణ (34), మంగమ్మ (32) లను తీసుకువెళ్లాడు.
చెరువు మధ్యలోకి వెళ్లగానే నీటితో కలిసిన మందు కావటంతో పడవ ఊగటం ప్రారంభమైంది. భయపడిన పడవలోని ముగ్గురూ అటూఇటూ కదలడంతో అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో పడవలో ఉన్న ముగ్గురు చెరువులో పడిపోయారు.
చెరువు యజమాని కత్తుల సత్యనారాయణ గల్లంతుకాగా, వలస కూలీ ఆదినారాయణ ఈదుకుంటూ మంగమ్మను కూడా రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చాడు. చాలా దూరం ఈదటం వల్ల ఆదినారాయణ ఊపిరి అందక ప్రాణాలు కోల్పోయాడు.
చుట్టుపక్కల చేపల చెరువులో పని చేసే కూలీలు వచ్చి గాలింపు చర్యలు చేపట్టడంతో సుమారు గంట తర్వాత పడవ బోల్తా పడిన ప్రాంతంలోనే కత్తుల సత్యనారాయణ మృతదేహం లభించింది. సమాచారం అందుకున్న నందివాడ ఎస్సై ఎ.మణికుమార్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమి త్తం గుడివాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడు సత్యనారాయణకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ప్రాణాలతో బయట పడిన మంగమ్మ

మృతుడు కత్తుల సత్యనారాయణ
Comments
Please login to add a commentAdd a comment