సాక్షి, బొబ్బిలి(విజయనగరం) : గ్రోత్ సెంటర్‌లోని బాలాజీ కెమికల్స్‌లో శుక్రవారం జరిగిన పేలుడు దాటికి మృతి చెందిన వారి మృతదేహాలు రోజంతా రియాక్టర్ల వద్దే ఉండిపోయాయి. శనివారం ఉదయం ఈ మృతదేహాలను మూడంతస్తుల నుంచి కిందికి దించారు. శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు మృతదేహాలను దించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర కలత చెందారు. రియాక్టర్ పేలి ఇద్దరు మృతి చెందడంతో ఆ పరిసరాల్లో తీవ్ర దుర్గంధం వస్తోంది. దుర్వాసనల మధ్యే వైద్యులు జి. శశిభూషణ రావు, జి. రామ్‌నగేష్ మృతదేహాలకు శనివారం పోస్ట్‌మార్టం చేశారు. అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించారు. ఇదిలా ఉంటే బాలాజీ కెమికల్స్‌లో సుమారు 52 మంది పనిచేస్తున్నా వారి పేరున పీఎఫ్ కానీ, ఈఎస్‌ఐ కానీ జమ చేయడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. అస్సలు కార్మిక చట్టాలేవీ అమలు కావడం లేదని వాపోతున్నారు. పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం ఉంటే శుక్రవారం మృతి చెందిన జగదీష్, సురేష్ కుటుంబాలకు కార్మిక శాఖ తరఫున రూ. పది వేల వరకు పింఛన్ వచ్చేదని కార్మికులు చెబుతున్నారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల కార్మికులు, టెక్నీషియన్లు ఇబ్బంది పడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే పలువురు టెక్నీషియన్లకు కొన్నాళ్లుగా వేతనాలు ఇవ్వడం లేదని..అవి అందేవరకైనా ఉండాలనే ఉద్దేశంతో కొంతమంది పనిచేస్తున్నారని కార్మికులు చెబుతున్నారు. సురేష్ కూడా అదేవిధంగా కొనసాగుతున్నాడని కార్మికులు తెలిపారు. కార్మిక చట్టాలు అమలు చేయని యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
దుర్వాసన మధ్యే పోస్టుమార్టం..
Published Sun, Jun 16 2019 9:55 AM | Last Updated on Sun, Jun 16 2019 9:56 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment