postumartam
-
బెజవాడ గ్యాంగ్‌వార్ కేసు.. పోలీసుల హైఅలర్ట్
సాక్షి, విజయవాడ: పటమటలో జరిగిన గ్యాంగ్ వార్‌లో మృతిచెందిన రౌడీషీటర్ సందీప్ మృతదేహానికి వైద్యులు సోమవారం పోస్టుమార్టం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాసుపత్రి వద్ద పోలీసులు అలర్ట్ ప్రకటించారు. అలర్లు జరగకుండా ముందుస్తుగా ఆసుపత్రి ఆవరణలో భారీ గేట్లు ఏర్పాటు చేశారు. మార్చురీ వద్దకు ఎవరిని కూడా పోలీసులు అనుమతించడం లేదు. ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. (సందీప్‌కు టీడీపీ నేతల అండదండలు..) రూ.2 కోట్ల విలువైన స్థలం విషయంలో ఆదివారం ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన సందీప్ చికిత్స పొందుతూ మృతిచెందారు. మరణాయుధాలతో ఇరువర్గాలు దాడులు చేసుకోగా, ఆసుపత్రిలో మరో ఐదుగురు చికిత్స పొందుతున్నారు. ఘర్షణకు పాల్పడిన వ్యక్తుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆరు ప్రత్యేక బృందాలను విజయవాడ సీపీ ఏర్పాటు చేశారు. పండు గ్యాంగ్‌లో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బతికున్న మనిషిని చంపేశారు.. కానీ
రాంచీ : కరెంట్ షాక్‌కు గురైన వ్యక్తిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకురాగా అక్కడి వైద్యులు అతన్ని పరీక్షించి చనిపోయాడని నిర్థారించారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఆ వ్యక్తికి పోస్టుమార్టం నిర్వహిస్తుండగా అతను బతికే ఉన్నట్లు తెలియడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ వింత ఘటన జార్ఖండ్ రాజధాని రాంచీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లోహర్దాగా జిల్లాకు చెందిన వ్యక్తి మంగళవారం కరెంట్ షాక్‌కు గురవ్వడంతో రాంచీలోని చానాహో కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అక్కడి వైద్యులు ఆ వ్యక్తిని పరీక్షించి చనిపోయాడని నిర్థారించారు. పోస్టుమార్టం కొరకు రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌కు సిఫార్సు చేశారు. కాగా రిమ్స్ అధికారులు వ్యక్తి శరీరానికి పోస్టుమార్టం నిర్వహిస్తుండగా అతను బతికే ఉన్నట్లు తెలిసింది. దీంతో వెంటనే అతన్ని ఎమర్జెన్సీ వార్డుకి తరలించారు. అయితే ఆ తర్వాత అతడికి చికిత్స అందిస్తున్న సమయంలో చనిపోవడం గమనార్హం. ఈ ఘటనపై జార్ఖండ్ ఆరోగ్య శాఖ మంత్రి బన్నా గుప్తా సీరియస్ అయ్యారు. బతికున్న మనిషిని చచ్చిపోయాడంటూ తప్పుడు రిపోర్టు ఇచ్చిన చానాహో కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌పై సీరియస్ యాక్షన్ తీసుకోనున్నట్లు తెలిపారు. -
దుర్వాసన మధ్యే పోస్టుమార్టం..
సాక్షి, బొబ్బిలి(విజయనగరం) : గ్రోత్ సెంటర్లోని బాలాజీ కెమికల్స్‌లో శుక్రవారం జరిగిన పేలుడు దాటికి మృతి చెందిన వారి మృతదేహాలు రోజంతా రియాక్టర్ల వద్దే ఉండిపోయాయి. శనివారం ఉదయం ఈ మృతదేహాలను మూడంతస్తుల నుంచి కిందికి దించారు. శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు మృతదేహాలను దించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర కలత చెందారు. రియాక్టర్ పేలి ఇద్దరు మృతి చెందడంతో ఆ పరిసరాల్లో తీవ్ర దుర్గంధం వస్తోంది. దుర్వాసనల మధ్యే వైద్యులు జి. శశిభూషణ రావు, జి. రామ్‌నగేష్ మృతదేహాలకు శనివారం పోస్ట్‌మార్టం చేశారు. అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించారు. ఇదిలా ఉంటే బాలాజీ కెమికల్స్‌లో సుమారు 52 మంది పనిచేస్తున్నా వారి పేరున పీఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ జమ చేయడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. అస్సలు కార్మిక చట్టాలేవీ అమలు కావడం లేదని వాపోతున్నారు. పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం ఉంటే శుక్రవారం మృతి చెందిన జగదీష్, సురేష్ కుటుంబాలకు కార్మిక శాఖ తరఫున రూ. పది వేల వరకు పింఛన్ వచ్చేదని కార్మికులు చెబుతున్నారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల కార్మికులు, టెక్నీషియన్లు ఇబ్బంది పడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే పలువురు టెక్నీషియన్లకు కొన్నాళ్లుగా వేతనాలు ఇవ్వడం లేదని..అవి అందేవరకైనా ఉండాలనే ఉద్దేశంతో కొంతమంది పనిచేస్తున్నారని కార్మికులు చెబుతున్నారు. సురేష్ కూడా అదేవిధంగా కొనసాగుతున్నాడని కార్మికులు తెలిపారు. కార్మిక చట్టాలు అమలు చేయని యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. -
వివాహేతర బంధమే ప్రాణం తీసింది
సాక్షి, చిత్తూరు రూరల్ : వివాహేతర సంబంధం దారుణ హత్యకు దారితీసింది. చేసిన తప్పును తెలుసుకుని భర్త వద్దకు తిరిగి చేరుకోవాలన్న మహిళ చివరకు ప్రియుడి చేతిలో హత్యకు గురైంది. ప్రియుడు అతి దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. ఈ ఘటన చిత్తూరు నగరం చెన్నమ్మగుడిపల్లిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. చిత్తూరు నగరం చెన్నమ్మగుడిపల్లికి చెందిన హరికృష్ణ, కనకదుర్గ(36)లకు 18 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరి కాపురం కొంతకాలం సజావుగా సాగింది. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే ఇటీవల అదే గ్రామానికి చెందిన త్యాగరాజు అనే వ్యక్తితో కనకదుర్గకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో భర్త హరికృష్ణ భార్యపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఇరువురి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ కారణంతో ఇద్దరూ విడిపోయారు. కనకదుర్గ పుట్టింటికి వెళ్లిపోయింది. పిల్లలు ఇద్దరు హరికృష్ణ దగ్గరే ఉంటున్నారు. కాగా, చివరకు చేసిన తప్పును తెలుసుకున్న కనకదుర్గ భర్తకు దగ్గర కావాలనుకుంది. గత మూడు రోజులుగా తన పిల్లలతో పాటు భర్తను కలుసుకుని కాపురం కాపురం చేస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ప్రియుడు త్యాగరాజు జీర్ణించుకోలేకపోయాడు. శనివారం కనకదుర్గ పుట్టింట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెపై దాడి చేశాడు. ఈ విషయాన్ని స్థానికులు 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని త్యాగరాజుని మందలించారు. దీంతో కనకదుర్గపై కక్ష పెంచుకున్న త్యాగరాజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై మరోమారు దాడికి దిగాడు. చీరతో గొంతు నులిమి హత్య చేసి పరారయ్యాడు. స్థానికులు సమాచారంతో డీఎస్పీ రామాంజనేయులు, సీఐ శ్రీధర్, ఎస్ఐ పురుషోత్తంరెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదివారం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సోమవారం పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఆత్మహత్య కాదు.. హత్యే..
సిరిసిల్ల టౌన్: సిరిసిల్లలో మంగళవారం నవవధువు లక్ష్మి(22) ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. భర్త, అత్తింటివారే లక్ష్మిని హత్యచేశారని బుధవారం బంధువులు ఆరోపించారు. ఏరియా ఆస్పత్రిలోని పోస్టుమార్టమ్ గది వద్ద ఆందోళకు దిగారు. వివరాలు బంధువుల కథనం మేరకు... పట్టణంలోని సాయినగర్‌కు చెందిన శాగల తిరుపతి మున్సిపల్లో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈయనకు ఆరు నెలల క్రితం నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలం పోచానిపల్లికి చెందిన లక్ష్మితో వివాహం అయింది. పెళ్లి సమయంలో లక్ష్మి తల్లిదండ్రులు నాలుగు తులాల బంగారం, 20 తులాల వెండి ఇచ్చారు. కామారెడ్డిలోని సగం ఇల్లును ఇస్తామని ఒప్పుకున్నారు. పెళ్లయిన తర్వాత అవసరానికి రూ.50 వేలతో పాటు బైక్‌ను కొనిచ్చారు. తరుచూ..తిరుపతి తమ కుటుంబ సభ్యులతో కలిసి డబ్బులకోసం లక్ష్మిని వేధించాడు. ఈవిషయంలో గతంలో కొంత డబ్బు ఇచ్చి కలిసి ఉండాలని కోరినట్లు బంధువులు తెలిపారు. అయినా తిరుపతిలో మార్పు రాలేదు. మంగళవారం తిరుపతి డ్యూటీకి వెళ్లి వచ్చే సరికి ఇంట్లో ఫ్యానుకు చున్నితో లక్ష్మి ఉరేసుకుంది అసత్యమని, భర్తే చంపి ఫ్యానుకు ఉరేసుకున్నట్లు చిత్రీకరించాడని బంధువులు ఆరోపించారు. పోలీసుల తీరుపై బంధువుల ఆగ్రహం మంగళవారం రాత్రి పోలీస్‌స్టేషన్‌లో కేసును నమోదు చేయడానికి వెళ్లిన లక్ష్మి బంధువుల పట్ల పోలీసులు అనుమానాస్పదంగా వ్యవహరించారని ఆరోపించారు. స్టేషన్‌లోని ఓ పోలీస్ అధికారి నిందితుడు తిరుపతికి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. హత్య కేసును నమోదు చేయాలని తాము కోరగా సదరు అధికారి ఆత్మహత్యగా ఫిర్యాదు చేయమని కోరినట్లు తెలిపారు. చివరకు సీఐ విజయ్‌కుమార్ కలగజేసుకుని బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకున్నట్లు వెల్లడించారు. డీఎస్పీ దామెర నర్సయ్య చొరవ చూపి లక్ష్మి మృతిచెందిన ఇంటిని పరిశీలించారు. మృతురాలి బంధువులు, పెద్దమనుషులను జరిగిన సంఘటనపై తహశీల్దార్ మన్నె ప్రభాకర్ ముందు పూర్వాపరాలు తెలుసుకున్నారు.దోషులను పట్టుకుని శిక్షపడేలా చేస్తామని పోలీసులు ఎవరికీ అతీతులు కాదని లక్ష్మి బంధువులకు నచ్చజెప్పారు. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తామని డీఎస్పీ తెలిపారు.