కన్నవారికి కడుపుకోత
కన్నవారికి కడుపుకోత
Published Mon, Oct 21 2013 3:59 AM | Last Updated on Tue, Aug 14 2018 3:22 PM
రాజానగరం/సీతానగరం/ పెరవలి (పశ్చిమ గోదావరి), న్యూస్‌లైన్ : స్నేహితులతో కలిసి అన్నవరం పుణ్యక్షేత్రానికి వెళ్లి వస్తానంటే సరేనన్న వారి తల్లిదండ్రులకు తీరని శోకమే మిగిలింది. సీతానగరం మండలం బొబ్బిల్లంక-మిర్తిపాడు వద్ద తొర్రిగడ్డ కాలువలో ముగ్గురు విద్యార్థులు దుర్మరణం చెందిన సంఘటన తీవ్ర సంచలనం కలిగించింది. మృతులను పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం నల్లాకులవారి పాలేనికి చెందిన దిడ్ల సందీప్(19); తూర్పు గోదావరి జిల్లా కడియపులంకకు చెందిన పాటంశెట్టి రామయ్య (19), సీతానగరం మండలం రఘుదేవపురానికి చెందిన పిండి వీరజయకృష్ణ(19)గా గుర్తించారు.
డ్రైవర్ లేకుండా..
ఈ ముగ్గురు విద్యార్థులూ రాజమండ్రి నారాయణ కళాశాలలో ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతున్నారు. దసరా సెలవులు కావడంతో ఈ నెల 11న అన్నవరం వెళ్లాలని ముగ్గురూ నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో అదే రోజు నల్లాకులవారిపాలెంలోని తన ఇంటి నుంచి దిడ్ల సందీప్ అద్దె టాక్సీలో బయలుదేరాడు. కారు సొంతంగా నడుపుతూ రాజమండ్రిలోని నారాయణ కాలేజి హాస్టల్ వద్దకు వెళ్లాడు. అక్కడ తన స్నేహితులైన రామయ్య, జయకృష్ణలను ఎక్కించుకుని బయలుదేరాడు. రఘుదేవపురంలోని తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఇంటికి వస్తున్నామని జయకృష్ణ చెప్పాడు. అయితే వీరు ప్రయాణిస్తున్న కారు బొబ్బిల్లంక సమీపంలో ఓ బైక్‌ను ఢీకొంది. దీంతో ఆందోళన చెందిన వీరు రాజమండ్రి-సీతానగరం ప్రధాన రోడ్డులో కాకుండా అడ్డదారిలో రఘుదేవపురం పయనమయ్యారు. మార్గమధ్యంలో శిథిలమైన వంతెన వద్ద కారు ప్రమాదానికి గురైంది. పై-లీన్ తుపాను కారణంగా కాలువ ఉధృతంగా ఉండడంతో కారు కొట్టుకుపోయింది. కారు నుంచి వారి మృతదేహాలు సుమారు అర కిలోమీటరు దూరం కొట్టుకుపోయాయి.
మత్స్యకారుల వలతో వెలుగులోకి..
బొబ్బిల్లంక సమీపంలోని తొర్రిగడ్డ కాలువలో నిత్యం చేపలు పట్టే మత్స్యకారుల వలకు ఆదివారం కారు చిక్కుకోవడంతో ఈ ప్రమాద విషయం వెలుగు చూసింది. కాలువలో బయటపడ్డ కారులో ఈ మృతదేహాలను కనుగొన్న స్థానికులు.. సీతానగరం పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ జి.మురళీకృష్ణ, సీఐ వైవీ రమణ తమ సిబ్బంది, స్థానికుల సహకారంతో కారును బయటకు లాగి, మృతదేహాలను వెలికితీశారు. కారు ఉన్న ప్రదేశానికి అర కిలోమీటరు దూరంలో తొర్రిగడ్డ స్లూయిజ్ వద్ద ఈ ముగ్గురి మృతదేహాలు కనిపించాయి. నంబరును బట్టి కారును పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన ప్రైవేట్ టాక్సీగా గుర్తించారు. దానిని సందీప్ అద్దెకు తీసుకున్నట్టు తెలిసిందని, కారులో ఉన్న నారాయణ కాలేజికి సంబంధించిన పేపర్లను బట్టి వారు ఆ కాలేజి విద్యార్థులుగా గుర్తించామని సీఐ వైవీ రమణ తెలిపారు. వారం రోజులు పైగా కాలువ నీటిలో నానిపోయి, కుళ్లిపోయిన ఆ మృతదేహాలను చూసి స్థానికులు సైతం తల్లడిల్లిపోయారు. అన్నవరం వెళ్లి వస్తామంటూ బయలు దేరిన ఈ ముగ్గురూ మరణంలో కూడా స్నేహాన్ని వీడలేదంటూ సహ విద్యార్థులు క న్నీటి పర్యంతమయ్యారు.
అన్నవరం వెళ్తున్నానని..
కడియం : మండలంలోని బుర్రిలంకకు చెందిన పాటంశెట్టి రామయ్య కుటుంబం వ్యాపారం నిమిత్తం కడియం శ్రీనగర్ కాలనీలో అద్దెకుంటున్నారు. 11న కాలేజి హాస్టల్ నుంచి ఇంటికి వచ్చిన రామయ్య అదే రోజు సాయంత్రం ఇద్దరు స్నేహితులతో పాటు అన్నవరం వెళుతున్నట్టు చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. అప్పటి నుంచి సెల్‌ఫోన్ పనిచేయకపోవడం, ఆచూకీ తెలియకపోవడంతో కడియం పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే రామయ్య తండ్రి శ్రీనివాసు, తల్లి కుమారి, బంధువులంతా సంఘటన స్థలానికి తరలివెళ్లారు. శ్రీనివాసరావుకు రామయ్యతో పాటు టెన్త్ చదువుతున్న చిన్న కుమారుడు అఖిలేష్ ఉన్నాడు. సందీప్ తండ్రి మిలట్రీలో ఉద్యోగం చేస్తూ మరణించగా, మిలట్రీ కోటాలో తల్లి సారమ్మకు గ్యాస్ ఏజెన్సీ మంజూరైంది. పెరవలిలో రెండేళ్ల క్రితం ఏజెన్సీని ఏర్పాటు చేశారు. సారమ్మకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. భోజనానికి వెళ్తున్నానని చెప్పిన కుమారుడు మరణించడంతో రఘుదేవపురంలో జయకృష్ణ బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Advertisement
Advertisement