బోగస్ ఓటర్లు 2.52. లక్షలు
సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో పెద్ద ఎత్తున బోగస్ ఓటర్లను అధికారులు గుర్తించారు. జిల్లా జనాభా 42,90,589 మంది కాగా 34,31,822 ఓటర్లు ఉన్నారు. ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం పూర్తయిన 66 శాతంలో 2,52,418 బోగస్ ఓటర్లు ఉన్నట్టు తేల్చారు. వీరు జిల్లాలో వేర్వేరు చోట్ల రెండు కంటే ఎక్కువ ఓట్లు కలిగి ఉన్నట్టుగా గుర్తించారు. చనిపోయిన ఓటర్లు 57,846 మంది, అనర్హులైన ఓటర్లు 3136 మంది ఉన్నారు. వలస వెళ్లిన వారు (5,16,747), సర్వే సమయంలో డోర్‌లాక్డ్(4,64,365)గా గుర్తించిన ఓటర్లు ఏకంగా 9,81,112 మంది ఉన్నారు. అంటే డూప్లికేట్, డోర్ లాక్డ్, షిఫ్టెడ్, ఇన్‌ఎలిజబుల్, డెత్ ఓటర్లు కలిపి ఏకంగా 12,94,512 మంది ఉన్నారు.
వీరి విషయంలో ఈ నెల 20వ తేదీలోగా క్షేత్ర స్థాయి విచారణ జరిపి తుది నివేదికలు ఇవ్వాల్సిందిగా తహశీల్దార్లకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. డూప్లికేట్ (డబుల్ ఎంట్రీ)విషయంలో ప్రస్తుతం ఎక్కడ నివాసం ఉంటున్నారో అక్కడ ఓటు హక్కును ఉంచి మిగిలిన చోట్ల జాబితాల నుంచి వారి పేర్లను తొలగించనున్నారు. ఇక చనిపోయిన ఓటర్లను వారి డెత్ సర్టిఫికెట్స్‌ను ఆధారంగా తొలగిస్తారు. ఇన్‌ఎలిజబుల్, షిఫ్టెడ్, డోర్‌లాక్డ్ జాబితాలో ఉన్న ఓటర్ల విషయంలో మాత్రం నోటీసులు.. విచారణాలనంతరమే నిర్ధారణకు వస్తారు. ఏది ఏమైనప్పటికీ ఓటర్ల జాబితాలో భారీగా కోతపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. 20లోగా విచారణ పూర్తి చేసి ఆ తర్వాత నోటీసులు జారీ చేస్తారు. చివరగా క్షేత్ర స్థాయిలో విచారణ అనంతరం తుది జాబితాలను సిద్ధం చేస్తారు. మరొకపక్క తుది ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రచురించేందుకు ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ ప్రక్రియను కూడా చేపట్టింది. ఇందు కోసం ఈనెల 19న అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు.