
రాష్ట్రంలో బోగస్ ఓట్లపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. 59 లక్షలకు పైగా బోగస్ ఓట్లపై చర్యలు తీసుకోవాలని హైకోర్టును ...
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో బోగస్ ఓట్లపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. 59 లక్షలకు పైగా బోగస్ ఓట్లపై చర్యలు తీసుకోవాలని హైకోర్టును ఆశ్రయించినట్లు ఆ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. ఆయన సోమవారమిక‍్కడ మాట్లాడుతూ... బోగస్ ఓట్లపై హైకోర్టులో వాదనలు జరిగాయి. బోగస్ ఓట్లపై విచారణ జరుపుతున్నామని ఎలక్షన్ కమిషన్ తరపు న్యాయవాది న్యాయస్థానానికి వివరణ ఇచ్చారు. ఈ నెల 20లోపు బోగస్ ఓట్లను తొలగించడంపై చర్యలు తీసుకుంటామని అధికారులు హైకోర్టు సాక్షిగా హామీ ఇచ్చారు. దీనిపై పూర్తి సమాచారం అందచేస్తామని హైకోర్టుకు వారు విన్నవించారు.
ఇక బోగస్ ఓట్లపై నాలుగు దశల్లో మేము ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకువచ్చాం. మొదటి దశలో మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. రెండో దశలో హైకోర్టును ఆశ్రయించాం. మూడో దశలో నియోజకవర్గాల వారీగా బోగస్ ఓట్లపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చాం. నాలుగో దశలో ప్రజలను కూడా తమ ఓటుహక్కుపై అవగాహన పెంచి ఓటరు జాబితాలో పేరు ఉందా, లేదా అనేది పరిశీలించుకునేలా అవగాహన కల్పిస్తున్నాం.’ అని తెలిపారు.