మినిస్టర్ హోమ్ మినిస్టర్
*శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మంత్రి సతీమణి హల్‌చల్
*పట్టు కోసం పాకులాట
*వచ్చే ఎన్నికల్లో ఆమె అభ్యర్థి అంటూ ప్రచారం
ఆయన రాష్ట్ర అటవీశాఖ మంత్రి. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మాత్రం ఆయన సతీమణి బృందమ్మదే పెత్తనం. ఆమె అంటే అధికారులందరికీ హడల్. పంచాయితీలు.. ఆస్పత్రులు.. హాస్టళ్లు.. దేవస్థానం.. ఒక్కటని లేదు అన్నింటిలోనూ తలదూర్చుతూ హల్‌చల్ చేస్తున్నారు. ఆమెకు అడ్డొచ్చే అధికారులు.. పాలకులపై ‘పవర్’ పంచ్‌లేస్తూ పక్కనబెట్టిస్తున్నారు. ఒకప్పుడు గడపదాటి బయటకురాని ఆమె ఇటీవల తనిఖీల పేరుతో తడాఖా చూపిస్తున్నారు. ఈ ‘హోం’ మినిస్టర్ దూకుడు మరెంతకాడికి దారితీస్తుందో వేచిచూడాలి.
శ్రీకాళహస్తి : రాష్ట్ర అటవీ శాఖమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పవర్‌తో శ్రీకాళహస్తిలో ఆయన సతీమణి బృందమ్మ పరిపాలన సాగుతోంది. ఆలయంతో పాటు అన్ని శాఖల్లో పట్టుకోసం ఆమె పాకులాడుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో బృందమ్మే బరిలో ఉంటారని.. ఆమె సహచరులు బాహాటంగా చెబుతున్నారు. మంత్రి హైదరాబాద్‌లో బిజీబిజీగా ఉంటే, ఆయన సతీమణి ఇక్కడ పరిపాలనలో తలములకలవడం కనిపిస్తోంది. ఒకరోజు కూడా ఖాళీగా ఉండకుండా ఆలయంతో పాటు అన్ని విభాగాల్లో తనిఖీలు చేస్తున్నారు.
ఆయా శాఖల్లో ఆదాయ వ్యయూల వివరాలతో పాటు ఉద్యోగస్తుల వివరాలను సేకరిస్తూ.. ముందుకు సాగుతున్నారు. మంత్రికి అత్యంత సన్నిహితులుగా పేరొందిన పాల సొసైటీ చైర్మన్ రావిళ్ల మునిరాజానాయుడు.. మంత్రి మాజీ పీఏ రాంబాబునాయుడు ఆమె వెంటే నడుస్తున్నారు. శ్రీకాళహస్తి మండలంతో పాటు తొట్టంబేడు, ఏర్పేడు, రేణిగుంట మండలాల్లో చిన్నపాటి సమాచారాన్ని సైతం మేడమ్‌కు వారు చేరవేస్తున్నారు. సోమవారం శ్రీకాళహస్తిలో ప్రభుత్వాస్పత్రిలో తనిఖీలు చేశారు. ఆదాయ వ్యయాలతోపాటు ఎక్కడ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.. అనే సమాచారాన్ని ఎప్పటికప్పడు ఆమె దృష్టికి తీసుకెళుతున్నారు. ఆ ఖాళీల్లో ఆమె తమ అనుచరులను కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగులుగా నియమించేస్తున్నారు. తాజాగా ఆలయంలోని అన్నదానంతో పాటు ఉద్యానవనంలో 20మందికిపైగా టీడీపీ కార్యకర్తలను ఉద్యోగాల్లో నియమించినట్లు సమాచారం.
ఇటీవల మద్యం షాపుల వారు మామూళ్లు ఇస్తే సిండికేట్ రూపంలో ఇష్టం వచ్చిన ధరలకు విక్రయాలు చేసుకునే అవకాశం కల్పిస్తామని సంకేతాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. వారి అండదండలతోనే పలువురు ఎమ్మార్పీకి కాకుండా అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం. పెద్దల హస్తం ఉందని సంబంధిత అధికారులు ఉదాశీన ంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. బృందమ్మ ముందుగా పట్టు సంపాదించుకోవడం పదేపదే తనిఖీలు చేయడం... ఖాళీగా ఉన్న చోట కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగులను నియమించడం పరిపాటిగా మారిందనే విమర్శలున్నాయి.
రెండు రోజుల క్రితం ఆలయంలో తనిఖీలు చేసిన ఆమె ఇద్దరు ఉద్యోగస్తులను సస్పెండ్ చేయించినట్లు తెలుస్తోంది. అంతేకాదు శివరాత్రి ఉత్సవాలకు సంబంధించి చిన్న చిన్న పనులు (రంగులు, సున్నం, పందేళ్లు తదితర) సైతం రూ.1.5కోట్లతో టీడీపీ కార్యకర్తలకే దక్కేలా ఆమె సహకరించినట్లు తెలుస్తోంది. పట్టణంలోని ఏరియా ఆస్పత్రి.. స్కిట్ కళాశాల, హాస్టళ్లు తదితర ప్రాంతాల్లో బృందమ్మ తనిఖీలు జోరుగా సాగాయి. ఏ అధికారంతో ఆమె తనిఖీలు చేస్తున్నారు ? ఉద్యోగులను సస్పెండ్ చేరుుస్తున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నారుు. అయితే ఆమె అవేమీ పట్టించుకోవడంలేదు. బృందమ్మ ప్రధాన అనుచరుడుగా ఉన్న రావిళ్ల మునిరాజానాయుడు చెప్పిందే శాసనంగా పలుచోట్ల నడుస్తోంది. మరో అనుచరుడు రాంబాబు నాయుడు తాజాగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ఆయన బావమరిది చెంచయ్య నాయుడుకు ఆమె ఆశీస్సులతోనే కట్టబెట్టారు. మొత్తం మీద శ్రీకాళహస్తిలో పెత్తనం ఆమె గుప్పెట్లోకి వెళ్లిపోతోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు సైతం గోపాలన్న కన్నా బృందమ్మే మిన్న అంటూ.. ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు ఉపక్రమిస్తున్నారు.
పెద్దాస్పత్రిలో బృందమ్మ తనిఖీ
తొట్టంబేడు : శ్రీకాళహస్తి పట్టణంలోని పెద్దాస్పత్రిని వుంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సతీవుణి బొజ్జల బృందవ్ము సోవువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. ఆపరేషన్ థియేటర్ (ఓటీ), ల్యాబ్, రక్తపరీక్ష కేంద్రాలకు వెళ్లి పరిశీలించారు. ఆపరేషన్ థియేటర్‌లో పరికరాలు తుప్పు పట్టి ఉండటాన్ని గుర్తించి వైద్యులపై వుండిపడ్డారు. ఆస్పత్రిలో రోగుల తాగునీటి సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఆర్‌వో సిస్టమ్ పనిచేయుడం లేదని సిబ్బంది చెప్పడంతో వారం రోజుల్లో వురవ్ముతులు చేరుుంచాలని ఆదేశించారు. అనంతరం రక్తపరీక్ష కేంద్రానికి వెళ్లి తనిఖీలు చేశారు. షింక్ అధ్వానంగా ఉందని, గది శుభ్రంగా లేదని ల్యాబ్ టెక్నీషియున్‌పై వుండిపడ్డారు. ఆస్పత్రి నిర్వహణే సక్రవుంగా లేకుంటే ఇక రోగులకు ఎంతవూత్రం వైద్యం అందిస్తారో అర్థవువుతోందని ఆర్‌ఎంవో, సూపరింటెండెంట్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఆలయపరిపాలన గాడిలో పెట్టడం కోసమే
శ్రీకాళహస్తి దేవస్థానం పరిపాలనను గాడిలో పెట్టడం కోసమే బొజ్జల బృందమ్మ ఆలయాన్ని పరిశీలన చేసి.. తగు సూచనలు ఇచ్చారు. ఆమె కాదు ఎవరైనా ఆలయంలో తనిఖీలు చేసి సూచనలు ఇవ్వవచ్చు. ప్రధానంగా కాంట్రాక్టర్లు ఇస్తున్న సరుకుల్లో మోసాలు జరుగుతుంటాయి. భక్తులను మోసం చేసి సిబ్బంది దోచుకుంటుంటారు. దీనికితోడు శివరాత్రి ఉత్సవాలు వస్తున్నాయి. ఆలయంతో పాటు పట్టణంలోని ఏరియా ఆస్పత్రి, హస్టళ్లు, పాఠశాలలను ఆమె తనిఖీలు చేస్తున్నారు. అందులో తప్పేముంది.
- బొజ్జల గోపాలకృష్ణారెడ్డి,
రాష్ట్ర అటవీశాఖమంత్రి
పెత్తనం కోసమే పాకులాట
టీడీపీ నాయకులు పెత్తనం కోసమే పాకులాట. అంతేతప్ప ఆలయాన్ని గాడిలో పెట్టడం కోసంకాదు. ఆమెతో(బృందమ్మ) పాటు వారి అనుచరులను తీసుకుని పోయి మనవాళ్లు అయితే ఓకే.. లేదంటే మిగిలిన వారికి హెచ్చరికలు జారీ చేయడం.. ఆలయంతో పాటు పలుకీలకమైన శాఖలను ఆమె గుప్పిట్లోకి తెచ్చుకోవడం కోసం పాకులాడుతున్నారు. మంత్రి హైదరాబాద్‌లో ఉంటే స్థానికంగా ఆమె పట్టుసంపాదించుకోవడం కోసం జోరు తనిఖీలు చేస్తున్నారు. అయినా అధికారం వారిది నాలుగేళ్లు భరించాల్సిందే.
- సత్రవాడ మునిరామయ్య, మాజీ ఎమ్మెల్యే
పరిపాలించడానికి మంత్రి ఉన్నారు కదా.. ఆమెందుకో?
పరిపాలించడానికి ప్రజలు మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని ఎంచుకున్నారు. మళ్లీ పరిపాలనను గాడిలో పెట్టడానికి ఆయన సతీమణి బృందమ్మ ఎందుకో అర్థం కావడంలేదు. తనిఖీలు చేసి టెండర్లు.. ఉద్యోగాలు టీడీపీ వాళ్లకు అప్పగించడమే తప్ప ఆలయాన్ని గాడిలో పెట్టడానికి కాదు. ఇప్పటికే అనేకమందికి ఉద్యోగాలు ఇప్పించారు. టెండర్ల కోసం ప్రయత్నం చేస్తున్నారు. అంతేగాని ఒరగబెట్టేది ఏమీలేదు. - డాక్టర్ బత్తెయ్యనాయుడు, పీసీసీ సభ్యుడు, కాంగ్రెస్‌పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్‌చార్జి