సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో అధికార పార్టీకి ఆత్మకూరు నియోజకవర్గంలో పరిస్థితి మింగుడుపడని విధంగా మారింది. జిల్లాలో మంత్రుల మధ్య ఉన్న గ్రూప్ రాజకీయాలకు ఇక్కడ యథాతథంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అక్కడి నేతలు గ్రూప్‌లుగా విడిపోయి స్థానికంగా మంత్రులు అండతో ఇన్‌చార్జి పదవి దానితో పాటు టికెట్ దక్కించుకోవటానికి పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ఆనం రామనారాయణరెడ్డి పార్టీకి దూరంగా వెళ్లిన క్రమంలో 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన కన్నబాబు మళ్లీ తెరపైకి వచ్చారు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సహకారంతో ఆత్మకూరు ఇన్‌చార్జిని దక్కించుకోవటానికి తీవ్రంగా కృషి చేశారు. పార్టీ పెద్దల్ని కలిసి కొద్ది రోజులు హడావుడి చేశారు.
మరోవైపు డీసీసీ బ్యాంక్ చైర్మన్ మెట్టకూరు ధనుంజయ్‌రెడ్డి కూడా ఇన్‌చార్జి కోసం మంత్రి నారాయణ, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ద్వారా పావులు కదిపారు. చివరికి ప్రయత్నాలు ఫలించలేదు. పార్టీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో నేతలు చర్చించి ఇన్‌చార్జిని నియమించే వరకు ఆదాలనే పర్యవేక్షించాలని సూచించారు. దీంతో కన్నబాబు పార్టీ కార్యాలయంలో నిరసన దీక్షకు దిగడం తర్వాత పార్టీ ముఖ్యుల జోక్యంతో మంత్రి నారాయణ విరమింపజేశారు. ఈ పరిణమాల క్రమంలో గందరగోళంగా మారిన ఆత్మకూరు వ్యవహారంలో ఎవరికి వారుగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. తాజాగా కాంట్రాక్టర్ బొల్లినేని కృష్ణయ్య తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది.
ఆదాలతో కలసి సీఎంను కలిసిన కృష్ణయ్య
ఇన్‌చార్జి కోసం తీవ్రంగా యత్నిస్తున్న కన్నబాబు, ధనుంజయరెడ్డికి పోటీగా బొల్లినేనిని పార్టీలోకి తీసుకొచ్చేందకు ఆదాల యత్నాలను ముమ్మరం చేశారు. అందులో భాగంగా ఈ నెల 16వ తేదీన సీఎం వద్దకు ఆదాల, బొల్లినేని వెళ్లి నియోజకవర్గ విషయాలను చర్చించారు. దీని కొనసాగింపుగా నియోజకవర్గంలో బొల్లినేని తన సొంత మనుషులతో చర్చలు మొదలుపెట్టారు. మరోవైపు రాజకీయంగా వైరం ఉన్న కొమ్మి లక్ష్మయ్యనాయుడుతో వేర్వేరు సందర్భాల్లో రెండు సార్లు కలిశారు. రాజకీయ ప్రత్యర్థులు అయి ఇరువురూ శనివారం ఓ ప్రైవేటు కార్యక్రమంలో కలిశారు కూడా. ఇక బొల్లినేని కూడా పార్టీలో చేరటానికి ఆసక్తి చూపుతూ రెండు రోజుల్లో ప్రకటన చేస్తానని ముఖ్యుల వద్ద వెల్లడించినట్లు సమాచారం. మొత్తం మీద ఆత్మకూరులో మరో కృష్ణుడు రాకతో సరికొత్త వివాదాలకు తెర లేచినట్లయింది.
Comments
Please login to add a commentAdd a comment