తాడేపల్లిగూడెం : బియ్యం మార్కెట్ డీలా పడింది. బొండాలు, ఎంటీయూ-1010 రకాల బియ్యానికి డిమాండ్ పడిపోయింది.
తాడేపల్లిగూడెం : బియ్యం మార్కెట్ డీలా పడింది. బొండాలు, ఎంటీయూ-1010 రకాల బియ్యానికి డిమాండ్ పడిపోయింది. బొండాలు రకం బియ్యానికి కేరళలో అధిక డిమాండ్ ఉన్నప్పటికీ అక్కడి మార్కెట్‌లో కొనుగోళ్లు మందగిం చాయి. మరోవైపు దక్షిణాఫ్రికాకు 1010 రకం ఎగుమతులు నిలిచిపోయాయి. ఉభయగోదావరి జిల్లాల నుంచి కాకినాడ పోర్టు ద్వారా ఓడల్లో 1010 రకం బియ్యాన్ని కొన్నేళ్లుగా దక్షిణాఫ్రికాకు ఎగుమతి చేస్తున్నారు. మూడేళ్లుగా ఇదేరకం బియ్యాన్ని పాకిస్తాన్, థాయ్‌లాండ్, వియత్నాం దేశాలు తక్కువ ధరకే దక్షిణాఫ్రికాకు ఎగుమతి చేస్తున్నా యి. దీంతో ఎగుమతులు క్రమంగా క్షీణించాయి.
తొలి ఏడాది ఆ మూడు దేశాల నుంచి నామమాత్రంగానే పోటీ ఉండేది. ఇప్పుడు అది కాస్తా పెరిగి ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం 1010 రకం బియ్యం కాకినాడ పోర్టుకు చేరా క్వింటాల్ ధర రూ.1,950 రూ.2 వేల వరకు ఉంది. ఇదే బియ్యాన్ని పాకిస్తాన్, థాయ్‌లాండ్, వియత్నాం దేశాలు రూ.150 తక్కువకే ఎగుమతి చేస్తున్నాయి. ఆ దేశాల్లో సాగు ఖర్చులు తక్కువగా ఉండటంతో క్వింటాల్ బియ్యాన్ని రూ.1,800 నుంచి రూ.1,850కి ఇస్తున్నాయని కలసి వస్తున్నాయని బియ్యం ఎగుమతిదారు బి.శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.
పేరుకుపోతున్న బొండాలు నిల్వలు
ముందెన్నడూ లేనివిధంగా జిల్లాలో బొండాలు బియ్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. వ్యాపారులు ఊహించని విధంగా కేరళలో ఈ బియ్యం కొనుగోళ్లు తగ్గిపోయాయి. మరోవైపు ఏదోరకంగా బియ్యాన్ని ఎగుమతి చేసినా అక్కడి వ్యాపారులు సొమ్ములు చెల్లిం చడం లేదు. అక్కడ సరుకు అమ్ముడుకాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఫలితంగా గత ఏడాది ఇదే సీజన్‌లో బొండాలు రకం బియ్యం క్వింటాల్ ధర రూ.1,300 పలికితే.. ప్రస్తుతం ఆ ధర రూ.1,030కి పడిపోయింది. జిల్లాలో ఈసారి 20 శాతం పంట విస్తీర్ణంలో బొండాలు రకం వరిని రైతులు సాగు చేస్తున్నారు. మిగిలిన విస్తీర్ణంలో 1010 రకం పండిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే 80 శాతం విస్తీర్ణంలో బొండాలు రకం, 20 శాతం విస్తీర్ణంలో 1010 రకం వరి సాగు చేసే పరిస్థితి ఉంది. ఎన్నడూ లేనివిధంగా ఈ సీజన్‌లో బొండాలు, 1010 రకాలకు డిమాండ్ తగ్గడంతో వ్యాపారులు విలవిల్లాడుతున్నారు.