బొటానికల్ గార్డెన్ ప్రైవేట్ కంపెనీలకా?
సాక్షి, హైదరాబాద్: జంటనగరాల్లో బొటానికల్ గార్డెన్ స్థలాన్ని ఎకో టూరిజం పేరిట ప్రైవేట్ సంస్థలకు కేటాయించటంపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరామ్ డిమాండ్ చేశారు. లేదంటే ప్రజా ఉద్యమానికి వెనకాడబోమని హెచ్చరించారు. బొటానికల్ గార్డెన్ వాకర్స్ అసొసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఆదివారమిక్కడ కొత్తగూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి బొటానికల్ గార్డెన్‌లో మీడియా టూర్ నిర్వహించింది.
డెలారా టూరిజం, ట్రాక్ ఇండియా సంస్థలకు కేటాయించిన స్థలాలను పరిశీలించింది. మల్టిప్లెక్స్‌లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, బార్ అండ్ రెస్టారెంట్ల నిర్మాణం కోసం చెట్లను నరికి ప్రకృతి విధ్వంసానికి పాల్పడ్డారని కోదండరామ్ దుయ్యబట్టారు. వీటికి సంబంధించిన ఫైల్ కాలుష్య నియంత్రణ మండలి పరిధిలో ఉందని, ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పార్క్‌ల నిర్మాణాన్ని విదేశాల్లో ప్రభుత్వాలు విధిగా భావిస్తాయని మాజీ ఎమ్మెల్సీ చుక్కారామయ్య చెప్పారు. బొటానికల్ గార్డెన్‌లో నిర్మాణాలు ప్రకృతి విధ్వంసానికి దారి తీస్తాయని ప్రొఫెసర్ హరగోపాల్ పేర్కొన్నారు. కార్యక్రమంలో టీజేఏసీ నాయకుడు అద్దంకి దయాకర్, గాయకుడు దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.