మాట్లాడుతున్న మంత్రి బొత్స సత్యనారాయణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పట్టణాభివృద్ధిలో విశేష అనుభవం ఉన్న ఆరుగురితో కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ఈ కమిటీ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తుందని చెప్పారు. శుక్రవారం విజయవాడలో మున్సిపల్ కమిషనర్ల వర్క్‌షాపు ముగింపు కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ఇటీవల నియమితులైన వార్డు వలంటీర్లు, రానున్న సచివాలయ వ్యవస్థను వాడుకుని పట్టణ ప్రజలకు మరిన్ని సేవలు అందించడానికి కమిషనర్లు కృషి చేయాలన్నారు.
ముఖ్యంగా పేదలకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలన్నారు. పురపాలక విభాగాల్లో అధికారులతో సమన్వయం చేసుకుని ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. మున్సిపల్ స్కూళ్లలో విద్యాప్రమాణాల పెంపునకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా మంచినీటి కుళాయిల ఏర్పాటు, రక్షిత మంచినీటి సరఫరా, వీధిలైట్ల నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్పందన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. సమీక్షల్లో వాస్తవాలనే అధికారులు వివరించాలని, అవాస్తవ గణాంకాలతో మభ్యపరిచే ప్రయత్నం చేయొద్దన్నారు.
మున్సిపల్ శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు మాట్లాడుతూ పాఠశాలల అభివృద్ధికి స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలని సూచించారు. అందుబాటులో ఉన్న మున్సిపల్ నిధులతో పాఠశాలల మరమ్మతులు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడదామన్నారు. మున్సిపల్ శాఖ కమిషనర్, డైరెక్టర్ విజయకుమార్ మాట్లాడుతూ విద్యాప్రమాణాల మెరుగుకు ప్రత్యేక కార్యాచరణను అమల్లోకి తీసుకువస్తామని చెప్పారు. వర్క్‌షాపులో మున్సిపల్ కమిషనర్లు, ఆర్‌డీఎంఏలు, మెప్మా పీడీలు, ఇంజనీర్లు, మధ్యాహ్నం జరిగిన సమావేశంలో ఏపీటిడ్కో ఎండీ దివాన్, ఈఎన్‌సీ చంద్రయ్య, డీటీసీపీ రాముడు, స్వచ్ఛ ఆంధ్రా కార్పొరేషన్ ఎండీ సంపత్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment