వైఎస్‌ఆర్‌సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డికీ, తనకు ఒకే ఆలోచనలు ఉన్నాయని ఆ పార్టీ నేత, ఎంపీ ఎస్పీవెరైడ్డి అన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఇరువురం కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పారు
నంద్యాల, న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్‌సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డికీ, తనకు ఒకే ఆలోచనలు ఉన్నాయని ఆ పార్టీ నేత, ఎంపీ ఎస్పీవెరైడ్డి అన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఇరువురం కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పారు. ఆదివారం నంద్యాల పట్టణంలోని సత్యసాయిసేవా సమితిలో డాక్టర్ జూపల్లె రాకేష్‌రెడ్డి అమలు చేస్తున్న వైఎస్‌ఆర్ అభయ బీమా పథకాన్ని భూమా నాగిరెడ్డి, ఎస్పీవెరైడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రైతులు, పేదప్రజలపై భూమాకు ఎంతో అభిమానం ఉందన్నారు. వారి సమస్యల పరిష్కారానికి ఆయన ఎనలేని కృషి చేస్తున్నారని కొనియాడారు. తనకు కూడా ఇలాంటి ఆలోచనలే ఉన్నాయని పేర్కొన్నారు. తామిద్దరి కలయికతో నంద్యాలలో నూతన రాజకీయ శకం ఆరంభమైందన్నారు.
జూపల్లె సేవా సమితి నిర్వహిస్తున్న బీమా పథకం తనకెంతో ఆనందం కలిగిస్తున్నదన్నారు. ఈ పథకాన్ని సంపూర్ణంగా రాకేష్‌రెడ్డి అమలు చేయగలరనే ఆశాభావాన్ని ఎస్పీవై రెడ్డి వ్యక్తం చేశారు. కష్టాల నుంచి విముక్తి అయ్యే రోజు త్వరలో రానున్నదని భూమానాగిరెడ్డి అన్నారు. పేదల సమస్యలు తెలిసిన తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ముందుకొచ్చే ప్రతి ఒక్కరినీ భుజంతట్టి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. సమాజ నిర్మాణంలో కార్మికులు, పేదల పాత్ర అనిర్వచనీయమైందన్నారు. పనుల్లో ఉన్నప్పుడు ప్రమాదాలకు గురై వారు మృత్యువాతకు గురవుతున్నారని.. అలాంటి వారికి బీమా ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
నంద్యాల పట్టణంలో ఎలాంటి స్వార్థం లేకుండా ఎంతో మంది సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలను ఆదుకుంటున్నారని.. వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. బీమా పథకం నిర్వహకుడు డాక్టర్ రాకేష్‌రెడ్డి మాట్లాడుతూ..మొదటి విడతలో వెయ్యి మందికి ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కొక్కరికి లక్ష రూపాయల ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. దశలవారీగా దీనిని అమలు చేస్తామని వివరించారు. సమావేశంలో గురురాఘవేంద్ర కోచంగ్ సెంటర్ అధినేత దస్తగిరి రెడ్డి, తెలుగుగంగ డీఈ చిన్నపురెడ్డి, నవనంది రోటరీక్లబ్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, జూపల్లె సేవా సంస్థ గౌరవాధ్యక్షుడు స్వామిరెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.