
బొత్స అను నేను..
విజయనగరం : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రెక్కల కష్టాన్ని చివరకు ఇలా కుక్కలు చింపిన విస్తరిలా మార్చారు. రెండో సారీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వందరోజులకే ఆయన హఠాన్మరణం తరువాత రాష్ట్రం అథోగతిపాలైంది. జిల్లా ప్రగతి కునారిల్లింది.
వర్గరాజకీయలు, రాష్ట్ర విభజనకే పరిమితమైన మంత్రులు జిల్లాకు చేసింది ఏమైనా ఉంది అంటే విభజన బాధను మిగల్చడమే. అభివృద్ధి మాట అటుంచి జిల్లా ప్రజల మనోభావాలను కూడా కేంద్ర ప్రభుత్వానికి, తమ అధిష్టానానికి చెప్పడంలో విఫలమయ్యారు. 2009వ సంవత్సరంలో రాజశేఖరరెడ్డి పుణ్యమా అని గద్దెనెక్కిన వీరి పదవీకాలం రాష్ర్టపతి పాలనతో నిస్తేజంగా ముగిసింది.
చేజారిన పదవులు...
ప్రస్తుత 13వ అసెంబ్లీ కాలంలో శ్రీకాకుళం జిల్లా నుంచి ఒకరు, విజయనగరం జిల్లాకు చెందిన మరొకరు రాష్ట్ర మంత్రులుగా చేశారు. జిల్లా నుంచి బొత్స సత్యనారాయణ శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహించిన శత్రుచర్ల విజయరామరాజు మంత్రి పదవుల్లో కొనసాగినా జిల్లాకు ఒరగబెట్టింది ఏమీలేదు. రాష్ర్టపతి పాలనతో వీరి పదవులు చేజారిపోయాయి.
బొత్స...
జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించి న ఒకే ఒక్క మంత్రిగా బొత్స సత్యనారాయణ చాలా శాఖల బాధ్యతలు వహించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పరిశ్రమలు, గృహనిర్మాణ శాఖ, రోశయ్య హయాంలో పంచాయతీరాజ్, కిరణ్‌కుమార్ రెడ్డి హయాంలో రవాణాశాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. అయితే ఆయన సొంతలాభం చూసుకున్నారే తప్పా ప్రజలకు ఒరిగింది ఏమీలేదనే విమర్శలు జిల్లా ప్రజల నుంచి అధికంగా వచ్చాయి. మద్యం, భూ, ఇసుక మాఫియాలకు పాల్పడినట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి.
ముఖ్యంగా మద్యం సిండికేట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించి దాడులు చేయించింది. దీంతో జిల్లాలో చాలా మంది ఏసీబీ అధికారులకు చిక్కారు. బినామీలుగా ఉన్న పేదలు పోలీస్ స్టేష న్ల చుట్టూ తిరిగి నానా పాట్లు పడ్డారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జిల్లాలో పెద్ద ఎత్తున జరిగిన ఉద్యమాన్ని మంత్రి అణిచివేయించారని ఆరోపణలున్నాయి. ఆయన కారణంగానే పోలీసులు కర్ఫ్యూ అమలు చేసి, తమను నానా ఇబ్బందులకు గు రి చే శారని పట్టణ ప్రజలు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు.
శత్రుచర్ల....
ఇక జిల్లాలోని కురుపాం నియోజకవర్గం జియ్యమ్మవలస మండలం చినమేరంగికి చెందిన శత్రుచర్ల విజయరాజు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో రవాణాశాఖ మంత్రిగా, కిరణ్‌కుమార్ రెడ్డి హయాంలో అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహించినా, జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో కొంత మేలు జరుగుతుందని ఆశించిన ప్రజలకు నిరాశే ఎదురయింది.
సీఎం కిరణ్ రాజీనామా తర్వాత మంత్రుల హోదా కోల్పోయినప్పటికీ ఆపద్ధర్మంగా కొనసాగాలని గవర్నర్ కోరడంతో కొనసాగారు. అయితే, ఈలోపే కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని, ఎన్నికలు మరో ఆరు నెలలు పొడిగిస్తారని, కొత్త కేబినెట్ ఏర్పాటై మంత్రి పదవులు ఉంటాయని వారు ఆశించారు. ఒకానొక సమయంలో ఏకంగా సీఎం పీఠాన్ని అధిరోహించాలని బొత్స పావులు కదిపారు. అలాగే ఎమ్మెల్యేలు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
ఎన్నికల్లోపే కాంట్రాక్ట్‌లు దక్కించుకోవచ్చని, నిధుల పందేరానికి దిగొచ్చని, ఈలోగా ఎంతో కొంత వెనకేసుకోవచ్చని భావించా రు. అయితే, వారి ఆశలు ఆడియాశలయ్యాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు కేంద్రం నో చెప్పడంతో రాష్ట్రపతి పాలన అనివార్యమైంది. దీంతో మంత్రులు పదవులను కోల్పోగా, ఎమ్మెల్యేలు అధికారాన్ని కోల్పోయారు. నేతల జోరుకు బ్రేక్ వేసినట్లయింది.
డమ్మీలుగా ఎమ్మెల్యేలు
రాష్ర్టపతి పాలనతో అసెంబ్లీ స్తుప్తచేతనావస్థలో ఉంటుంది. దీంతో ఎమ్మెల్యేలందరూ డమ్మీలయిపోయారు. పదవి ఉన్నా వారంతా ఏమీ చేయలేని నిస్సహాయులు. ఇన్నాళ్లూ అధికారం చెలాయించిన నేతల చేతులు కట్టేసినట్లయింది. జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ స్థానాలు ఉండగా వైఎస్సార్‌సీపీలోకి చేరడంతో బొబ్బిలి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన ఆర్.వి.సుజయకృష్ణ రంగారావు ముందే మాజీ అయ్యారు. ఆ తర్వాత సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర వైఎస్సార్ సీపీలో చేరారు. మిగతా ఏడుగురిలో ఇద్దరు టీడీపీ తరఫున, ఐదుగురు కాంగ్రెస్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చివరి వరకు కాంగ్రెస్‌లో కొనసాగిన పలువురు ఎమ్మెల్యేలు చక్రం తిప్పారు. తమ అనుకూల వ్యక్తులకు కాంట్రాక్ట్‌లు ఇప్పించుకుని పెద్దఎత్తున వెనకేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
అన్ని వ్యవహారాల్లో చేతులు పెట్టి పెద్ద ఎత్తున దందా నడిపారు. అన్నీ తామై వ్యవహరించారు. దొరికిన కాడికి దోచుకున్నారు. ఎన్ని చేసినా ఐదేళ్ల తర్వాత పదవీకాలం ముగిసి, మళ్లీ ఎన్నికలకు సిద్ధం కావడం పరిపాటి. కానీ ఈసారి అనూహ్యంగా రాష్ట్ర విభజన నేపథ్యంలో ముందుగానే అధికారాన్ని కోల్పోతున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రపతి పాలనకు కేంద్రం తెరలేపడంతో ఊహించని విధంగా మిగిలిపోయారు. ఇప్పుడంతా సుప్త చేతనావస్థలోకి వెళ్లిపోయారు.