బిల్లును వ్యతిరేకించండిలా!
సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పీసీసీ చీఫ్ పత్రాల పంపిణీ
సాక్షి, హైదరాబాద్: విభజన బిల్లుపై చర్చ సందర్భంగా సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఏం మాట్లాడాలనే దానిపై పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రత్యేకంగా ఓ పత్రాన్ని రూపొందించారు. ప్రతి సభ్యుడూ మొదట ఏం మాట్లాడాలి? చివర్లో ఏం చెప్పాలనేది అందులో పొందుపరిచారు. సీమాంధ్ర కాంగ్రెస్ సభ్యులంతా తప్పనిసరిగా అందులోని అంశాలను చదవాలని కోరారు. తద్వారా సీమాంధ్ర నేతలంతా విభజనను వ్యతిరేకిస్తున్న విషయం కేంద్రం దృష్టికి వెళుతుందన్నారు. శనివారం అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడుతూ.. ఆ పత్రాన్ని తాను పీసీసీ అధ్యక్షుడి హోదాలో కాకుండా సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేగా మాత్రమే సహచరులకు పంపిస్తున్నానని చెప్పారు. తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు మాత్రం ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అసెంబ్లీలో మాట్లాడతారని తెలిపారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మంత్రి గంటాకు షోకాజ్ నోటీస్ ఇస్తారా అని అడగ్గా.. ‘‘పేర్లు అవసరం లేదు. కాంగ్రెస్‌ను, నాయకత్వాన్ని కించపర్చేలా మాట్లాడిన వారందరిపై క్రమశిక్షణ చర్యలుంటాయి. షోకాజ్ నోటీసులు జారీ చేస్తాం’’అని చెప్పారు.
పత్రాల్లో ఏముందంటే...
‘‘గౌరవనీయులైన రాష్ట్రపతి ద్వారా పంపబడిన ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు-2013కు సంబంధించిన ముసాయిదా బిల్లును గౌరవనీయులైన శాసనసభ సభాపతి సభ ముందుంచిన నేపథ్యంలో.. సమైక్య రాష్ట్ర స్ఫూర్తికి కట్టుబడి ఉన్న వ్యక్తిగా ఈ ముసాయిదా బిల్లును నేను వ్యతిరేకిస్తున్నాను. మా ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా, వ్యక్తిగతంగా రాష్ట్ర విభజన బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. 13వ శాసనసభలో నేను సభ్యుడిగా ఉన్న సమయంలో ఇలాంటి ముసాయిదా బిల్లు రావడం బాధాకరం. దురదృష్టకరం. ఈ బిల్లులో రాష్ట్ర ప్రజల మనుగడకు, అభివృద్ధికి ఆటంకం కలిగించే అంశాలున్న నేపథ్యంలో దీన్ని ఎంత మాత్రం సమర్ధించలేం. (ప్రసంగాన్ని ముగించే సమయంలో...) ఈ కారణాల వల్ల ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే యథాతథంగా కొనసాగించాలని కోరుతూ సమైక్యాంధ్రప్రదేశ్‌కు కట్టుబడి ఉంటూ ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాను. ఈ ముసాయిదా బిల్లుపై నా అభిప్రాయాలను గౌరవ సభాధ్యక్షుల వారికి రాతపూర్వకంగా కూడా తెలియజేస్తున్నాను. వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాను’’.