టెక్కలి రూరల్: తిత్లీ తుపాను ప్రభావంతో సర్వం కోల్పోయిన బాధితులను తక్షణమే ఆదుకోవడంతోపాటు.. ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టెక్కలిలోని తుపాను ప్రభావిత ప్రాంతమైన కండ్రవీధిలో బుధవారం అయన పర్యటించి బాధితులతో మాట్లాడారు. ప్రతి విషయంలో సాంకేతికత గురించి మాట్లాడే చంద్రబాబు తుపాను విషయంలో ఎందుకు దాన్ని వినియోగించుకోలేకపోయారన్నారు. ఇప్పటి వరకు బాధిత గ్రామాల్లో కనీస సౌకర్యాలు కూడా కల్పించలేక పోవడం సిగ్గుచేటన్నారు.
ప్రతి రంగంలోను మోసానికి పాల్పడుతున్న ప్రభుత్వం చివరకు తుపాను బాధితులకు అందించే నిత్యావసర సరుకుల్లో కూడా మోసం చేస్తుందన్నారు. చంద్రబాబు హెలీకాప్టర్‌పై తిరుగుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా గ్రామాల్లో అధికారులను తమవెంట తిప్పుకుంటూ బాధితులకు సాయం అందకుండా చేస్తున్నారన్నారు. తుపాను వచ్చి 8 రోజులు గడుస్తున్న టెక్కలి మేజర్ పంచాయతీకే ఇంతవరకు కరెంట్, తాగునీరు అందివ్వడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు వెళ్లి నష్టపోయిన ఇళ్లను చూశారు. బాధితులతో మాట్లాడి వారికష్టాలను అడిగి తెలుసుకున్నారు.
మంత్రి అచ్చెన్నాయుడు తన నియోజకవర్గ పరిధిలో ఉన్న గ్రామాల్లో పర్యటించకపోవడం దారణమన్నారు. కనీసం ట్యాంకుల ద్వారా నీటిని కూడా సరఫరా చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఇబ్బందులకు గురౌతుంటే తుపానుని అడ్డం పెట్టుకోని చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సహయక చర్యల్లో లోపాలపై తాము మాట్లాడితే అధికార పార్టీ నేతలు రాజకీయం చేస్తున్నామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మరోసారి తాను టెక్కలిలో పర్యటిస్తానని.. అప్పటికీ పరిస్థితుల్లో మార్పురాకపోతే ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తానన్నారు. పార్టీ పీఏసీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ ప్రభుత్వం తుపాను బాధితులకు సహాయ చర్యల్లో ఘోరంగా విఫలమైందన్నారు.
బాధితులను నేటివరకు ఆదుకోకపోవడం దారుణమన్నారు. కండ్రవీధిలో ఇళ్లు పోయి, గోడలు కూలి, కట్టుగుడ్డ కూడా లేకుండా పోయిన బాధితులను ఆదుకోవడం మానేసి అధికార పార్టీ నాయకులు తిరుగుతున్నారని వాఖ్యానించారు. శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయ కర్త దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి అదేశాల మేరకు తామంతా తుపాను ప్రభావిత గ్రామాల్లో పర్యటిస్తున్నామన్నారు. నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ మాట్లాడుతూ.. బాధితులకు తక్షణ సాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
టెక్కలి తహసీల్దార్ ఆర్.అప్పలరాజును పార్టీ శ్రేణులు కలిసి..మత్స్యకారులు పడుతున్న బాధలు, వారికి అందవలసిన రేషన్‌లో జరుగుతున్న అన్యాయంపై వివరించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి మామిడి శ్రీకాంత్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు చింతాడ మంజు, నందిగాం ఎంపీపీ ప్రతినిధి యర్ర చక్రవర్తి, మండల పార్టీ అ«ధ్యక్షుడు బెండి గౌరీపతి, తిర్లాగి జానకీరామయ్య, సత్తారు సత్యం, తమ్మన్నగారి కిరణ్, చింతాడ గణపతి, మధిన్, కుసుడు, శ్రీను, కార్తిక్, జంగం, మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు హీరంబో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment