
నరసాపురం: నరసాపురంలో ఇద్దరు మైనర్లు ఘాతుకానికి ఒడికట్టారు. ఏదో సందర్భంలో తన గర్ల్ ఫ్రెండ్‌ను కామెంట్ చేశాడనే అక్కసుతో ఓ మైనర్ బాలుడు, తన స్నేహితుడైన మరో మైనర్‌తో కలసి పట్టణంలోని ప్రకాశం రోడ్డులో ఉన్న గడ్డియ్య టీ సెంటర్‌లో పనిచేసే దండు గంగరాజు (30)ను మెడకు తాడు బిగించి హత్య చేసి శవాన్ని గోదావరిలో పడేశారు. నిందితులిద్దరూ అదే టీకొట్టులో పని చేస్తున్నారు. మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు ఘటన జరిగిన దాదాపు 50 రోజుల తర్వాత హత్యాఘాతుకాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. నరసాపురం డీఎస్పీ టీటీ ప్రభాకర్‌బాబు గురువారం తన కార్యాలయంలో వివరాలను వెల్లడించారు.
పట్టణంలోని పీచుపాలెం దాటిన తర్వాత రూరల్ పరిధిలో గోదావరిలో శవాన్ని గత అక్టోబర్ 12న కనుగొన్నారు. మృతుడు పట్టణంలోని టీకొట్టులో పనిచేసే గంగరాజుగా గుర్తించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన గంగరాజు కుటుంబం 15 ఏళ్ల నుంచి నరసాపురం మండలంలోని దర్బరేవు గ్రామంలో స్థిరపడింది. అదే కొట్టులో పనిచేసే ఓ మైనర్‌కు గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఏదో సందర్భంలో తన గర్ల్‌ఫ్రెండ్‌ను గంగరాజు కామెంట్ చేశాడని కోపం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో మరో స్నేహితుడితో కలసి పార్టీ ఇస్తానంటూ అక్టోబర్ 10న గోదావరి గట్టుకు తీసుకెళ్లి హత్యచేశారు. ఒకరు చేతులు వెనక్కి పట్టుకోగా, మరొకరు మెడకు తాడు గట్టిగా బిగించి చంపేశారు. శవాన్ని గోదావరిలో పడేసి, మరుసటి రోజు నుంచి మామూలుగా టీకొట్టులో పని చేస్తున్నారు.
హత్య జరిగిన రెండు రోజుల తర్వాత శవం దొరకడంతో రూరల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. ఈ మైనర్లను కూడా విచారించగా నేరం ఒప్పుకున్నారు. గంగరాజు మృతితో భార్య కవిత, రెండేళ్ల కుమారుడు, మూడు నెలల పాప అనాథలయ్యారు. హత్యకు పాల్పడ్డ ఇద్దరు మైనర్లు కూడా 18 సంవత్సరాలు నిండటానికి దగ్గర్లో ఉన్నట్లు డీఎస్పీ వివరించారు. నిందితులిద్దరినీ ఏలూరు జువైనల్ కోర్టులో హాజరు పరిచినట్లు చెప్పారు. సమావేశంలో సీఐ ఎం.సుబ్బారావు, రూరల్ ఎస్సై కె.సతీష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment