కుర్‌కురే ప్యాకెట్లు తింటున్న చార్లెస్
సాక్షి, ప్రకాశం: మనిషి బతకటానికి కావాల్సినవి గాలి, నీరు, ఆహారం. ప్రధానంగా ఆహారం తినకుండా వుంటే మనిషి మనుగడకే ప్రమాదం. మరి తొమ్మిదేళ్లుగా అన్నం మెతుకే ముట్టకపోతే.. వినడానికే వింతగా ఉంది కదూ. సంతమాగులూరు మండలం సజ్జాపురానికి చెందిన తొమ్మిదేళ్ల బాలుడు పుట్టినప్పటి నుంచి అన్న అనేది తినకుండా కేవలం కుర్‌కురే, లేస్ లాంటి ప్యాకేజ్డ్ పదార్ధాలు తిని కాలం నెట్టుకొస్తున్నాడు. అన్నం తినమంటే ఆమడ దూరం పరుగెడతాడు.
వివరాల్లోకెళితే.. సజ్జాపురం ఎస్సీ కాలనీకి చెందిన అనంతవరపు యాకోబు, ఏసమ్మ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు చార్లెస్. తొమ్మిదేళ్ల వయసుగల ఈ బాలుడు ప్రస్తుతం మూడో తరగతి చదువుతున్నాడు. ఈ బాలుడు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నం మెతుకు ముట్టలేదు. తల్లిపాలు ఇవ్వడం ఆపేసిన నాటి నుంచి కేవలం కుర్‌కురే ప్యాకెట్లు, బిస్కెట్లు వంటివి తింటూ మంచినీళ్లు తాగి సరిపెట్టుకుంటాడు. పండుగ వచ్చినా ఇంట్లో భోజనం పెడతామని తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా అన్నం పళ్లెం పక్కకు నెట్టివేయటం, కింద పడేయటం చేస్తుంటాడని తల్లిదండ్రులు చెబుతున్నారు.
నానమ్మ భోజనం పెట్టే ప్రయత్నం చేస్తుండగా తిరస్కరిస్తున్న చార్లెస్
తొమ్మిదేళ్లు ఎలా ..
మనిషి అనే వ్యక్తి ఒక పూట అన్నం లేకపోతే ఆకలికి తాళలేడు. కానీ చార్లెస్‌కు ఇన్ని సంవత్సరాలు పాటు ఎందుకు ఇలా చేస్తున్నాడో.. కేవలం ప్యాకెట్లు తిని ఎలా వుంటున్నాడో కాలనీ వాసులకు అర్థం కాని ప్రశ్నగా మిగిలింది. మళ్లీ అతను అందరిలాగే ఆడుకోవటం.. చురుగ్గానే ఉండటం గమనార్హం. ఆదివారం వస్తే చికెన్‌తో అయినా భోజనం పెట్టాలని తల్లిదండ్రులు ప్రయత్నిస్తే రెండు చికెన్ ముక్కలు తినేసి భోజనం మాత్రం వద్దంటాడు. ఇంట్లో వాళ్లు మందలించినా మారాం చేయడం మినహా మార్పు మాత్రం రాలేదు. చదవండి: మళ్లీ చిరుత పంజా, వీడియో వైరల్
పోషకాహార లోపం వచ్చే అవకాశం ఉంది
అనంతవరపు చార్లెస్ అనే బాలుడు అన్నం తినకుండా కేవలం ప్యాకేజ్డ్ ఫుడ్ తినటం వల్ల అతనికి భవిష్యత్‌లో పోషకాహార లోపం కలిగే ప్రమాదం ఉంటుంది. ఇదే పరిస్ధితి కాకుండా భవిష్యత్‌లో తల్లిదండ్రులు అతని ఆలోచన మారే విధంగా నడుచుకోని భోజనానికి అలవాటు చేస్తే మంచిది.
డాక్టర్ వెంకటనారాయణ, సంతమాగులూరు ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం
వాడికిదేం శాపమో
బిడ్డ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నం అంటే ఏదో విషాన్ని చూసినట్లుగా చూస్తున్నాడు. ఇదేమిటో అంతుపట్టడం లేదు. ఎక్కడైనా డాక్టర్లుకు చూపిద్దామని తీసుకెళ్తున్నా సహకరించడు. అన్నం తినకపోవడం అనేది వాడికి ఒక శాపంగా మారింది. కూలీనాలీ చేసుకుంటే తప్ప మాకు ముద్ద నోటిలోకి పోదు.. మరో పక్క కొడుకు ఇలా అన్నం తినకుండా ఇన్నాళ్లు నుంచి ఇబ్బంది పెడుతున్నా ఏం చేయలేకపోతున్నాం. -ఏసమ్మ, బాలుడి తల్లి
చూస్తే బాధేస్తుంది
మేం కడుపునిండా అన్నంతింటూ కొడుక్కి పెట్టలేకపోవడం బాధేస్తుంది. చిన్నతనం నుంచి ఇప్పటి వరకు అన్నంను తినకుండా కుర్‌కురే ప్యాకెట్లు, బిస్కెట్లు, మంచినీళ్లతోనే కడుపు నింపుకుంటుండు. న్నిసార్లు అన్నం పెట్టకొచ్చి ప్రయతి్నంచినా ప్రయోజనం మాత్రం లేదు. మా ఊళ్లో ఉన్న గవర్నమెంటు బడిలో మూడో తరగతి చదువుతున్నాడు. బళ్లో అన్నం పెట్టే సమయంలో కూడా ఆ ప్రాంతంలోనే ఉండకుండా వెళ్లిపోతుంటాడు. -యాకోబు, బాలుడి తండ్రి
నాకు అన్నం ఇష్టం లేదు
నేను ప్యాకెట్లు తింటానే తప్ప అన్నం నాకు పడదు. చిన్నప్పుడు నుంచి అమ్మానాన్న అన్నం పెట్టినా తినే వాడిని కాదు. ఎన్నిసార్లు పెట్టాలని చూసినా ఇష్టం లేనిది తినబుద్ది కాలేదు. ప్యాకెట్లు, తింటూ మంచినీళ్లు తాగుతూ ఇలాగే వుండటం నాకిష్టం. అన్నం పెట్టమని ఇంట్లో ఎవరినీ ఇబ్బంది పెట్టను. పెడతానంటే మాత్రం ఆ దరిదాపుల్లో లేకుండా పోతా. -చార్లెస్
Comments
Please login to add a commentAdd a comment