
ఏం తప్పు చేశానని పోలీసులు వచ్చారు?
గుంటూరు: రాజధాని భూసమీకరణపై ప్రశ్నించిన తన ఇంటికి పోలీసులు రావడంపై మహిళా రైతు బోయపాటి సుధారాణి శనివారం గుంటూరులో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఇంట్లో లేనప్పుడు ఓ పోలీసు వచ్చి తన మామగారితో మాట్లాడారని చెప్పారు. ''నేను ఏం తప్పు చేశానని పోలీసులు వచ్చారు? నాకు వాక్ స్వాతంత్ర్యం లేదా ? ఇది ప్రజాస్వామ్యం కాదా ? నియంతల ప్రభుత్వంలో ఉన్నామా'' అని ప్రశ్నించారు. అంగ్లంలో ఉన్న సీఆర్డీఏ బిల్లును తెలుగులోకి అనువదించి రాజధాని గ్రామాల్లో ప్రతులు గోడలపైన అతికించమనాలని ప్రభుత్వానికి సూచించారు. వంతెనలు కట్టడానికో, ఆనకట్టలు కట్టడానికో భూములు అడిగితే అందుకు ఏ రైతూ అడ్డు చెప్పరన్నారు.
స్థానికంగా పండే పంటలను వేరే చోట పండించి చూపించగలరా అని ప్రభుత్వ పెద్దలకు సుధారాణి సవాల్ విసిరారు. ఇప్పటివరకు రుణమాఫీ చేయలేదని గుర్తు చేశారు. భూములకు పరిహారంగా ఏడాదికి ఇచ్చే రూ. 30 వేలు కరెంటు బిల్లులకు కూడా సరిపోవన్నారు. తన కుమార్తె సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతోందని, కొడుకు పదోతరగతి చదువుతున్నాడని... వాళ్లిద్దరికీ ఉద్యోగాలు ఇవ్వగలరా అంటూ సర్కారును నిలదీశారు. భూములిచ్చేవారిలో చాలా మంది వ్యవసాయం చేసేవాళ్లు కాదన్నారు. వైద్యవృత్తి చేసే డాక్టర్ను... ఆ వృత్తి మానుకోండి, నెలకు ఇంత ఇస్తామంటే మానుకుంటారా అని ఆమె అడిగారు. చంద్రబాబు నిజంగా రైతు పక్షపాతి అయితే... సీఆర్డీఏను ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు.