సాక్షి, అమరావతిబ్యూరో : రికార్డులు చూడలేదు.. సర్వే చేయలేదు.. భూమికి సంబంధించిన పత్రాలున్నాయో లేదో అసలే పట్టించుకోలేదు.. అయినా రాజధాని ప్రాంతంలో ప్లాట్లు కేటాయించేశారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో రాజధానిలో మరో భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సాధారణ రైతులకు ప్లాట్లు కేటాయించేటప్పుడు సవాలక్ష నిబంధనలను పాటించే అధికారులు.. అధికార పార్టీ నాయకుల బినామీలకు మాత్రం ఆగమేఘాల మీద.. పత్రాలు ఏవీ పరిశీలించకుండానే ప్లాట్లు కేటాయించారు. అంతేకాకుండా నాలుగేళ్లుగా కౌలు చెక్కులు కూడా చెల్లిస్తున్నారు.
9.14 అగ్రిమెంట్ చేసుకోకుండానే ప్లాట్లు
గుంటూరు జిల్లా రాజధాని గ్రామమైన మందడానికి చెందిన బేతపూడి సురేష్‌బాబు అనే వ్యక్తి ల్యాండ్ పూలింగ్‌లో భాగంగా మంగళగిరి మండలం కురగల్లు గ్రామంలో తనకు భూమి లేకపోయినా ఉందని పేర్కొంటూ, ఎకరం భూమిని సీఆర్‌డీఏకు ఇస్తున్నట్లు అంగీకార పత్రం అందజేశారు. భూములు తీసుకునే సమయంలో రైతుల నుంచి సీఆర్‌డీఏ అధికారులు తప్పనిసరిగా 9.14 కింద అగ్రిమెంట్ చేసుకుంటారు. రైతుకు సంబంధించిన భూ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, సర్వే చేసిన అనంతరం అవి నిజమని నిర్ధారించుకున్న తర్వాత 9.18ఏ కింద ప్లాట్లను ఎంచుకోవాలని సంబంధిత రైతులకు సూచించిన అనంతరం సదరు రైతుకు పరిహారం కింద వచ్చే ప్లాట్లను కేటాయిస్తారు. ఇక్కడ సురేష్ బాబుతో 9.14 అగ్రిమెంట్ చేయించుకోకుండానే అధికారులు అతనికి ప్లాట్లు కేటాయించారు. భూమి సర్వే చేయకుండానే అఫిడవిట్ ఆధారంగా ప్లాట్లు కేటాయించడం వెనక అధికార పార్టీ నేతల హస్తం ఉన్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. అఫిడవిట్‌ను ఆధారంగా చేసుకుని సురేష్‌బాబుకు 27–797–3779–3–బి1, 27–797–3779– 23– బి1 నంబర్‌లలో 250 గజాల నివాస, 24–762–3766– 39– సి2 నంబర్‌లో 500 గజాల విల్లా, 24–764–3777– 19– ఐ2 నంబర్‌లో 250 గజాల కమర్షియల్ ప్లాట్లను కేటాయించారు. నాలుగేళ్లుగా అతనికి కౌలు చెక్కులు చెల్లిస్తున్నారు.
గతంలోనూ ఇలాంటి సంఘటనే...
ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. మందడం గ్రామ రెవెన్యూ పరిధిలో 207/1లో ఎకరం 70 సెంట్ల భూమి కృష్ణా నదిలో కలిసిపోయింది. అయితే ఈ సర్వే నంబర్‌లో గుంటూరు జిల్లాకు చెందిన పఠాన్ గౌస్‌కు భూమి ఉందని సీఆర్‌డీఏ అధికారులు డాక్యుమెంట్లు పుట్టించారు. భూమి లేకుండానే అతనికి 1,450 గజాల ప్లాట్లు కేటాయించారు. అందులో 250 గజాల ప్లాట్‌ను కూడా నిందితుడు విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. రెండో ప్లాట్‌ను విక్రయించే సమయంలో కొనుగోలుదారులకు అనుమానం వచ్చి డాక్యుమెంట్లను పరిశీలించగా పత్రాలన్నీ నకిలీవని తేలింది. ఈ ఘటనలో ప్రధాన నిందితులను ఇప్పటివరకు పోలీసులు అరెస్ట్ చేయలేదు. అధికార పార్టీ నాయకులు గౌస్‌ను ఇరికించారని అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
నేతలకు బినామీయేనా?
సాధారణంగా సీఆర్‌డీఏ అధికారులు 9.14 అగ్రిమెంట్ చేసుకోకుండా ఎలాంటి పరిస్థితుల్లో ప్లాట్లు కేటాయించరు. అలాంటిది భూమి పత్రాలు కూడా ఇవ్వకుండా కేవలం అంగీకార పత్రంతో ప్లాట్లు కేటాయించడం వెనక అధికార పార్టీకి చెందిన బడా నాయకుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. సురేష్‌బాబుకు కేటాయించిన 1,250 గజాల స్థలం విలువ దాదాపు రూ. మూడు కోట్లు పలుకుతోంది. అధికార పార్టీ నేతలు సీఆర్‌డీఏ అధికారులతో కుమ్మక్కై బినామీ పేర్లతో ప్లాట్లను కేటాయించుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూమి ఇచ్చిన రైతుల వివరాలను సర్వే నంబర్లతో సహా సీఆర్‌డీఏ అధికారులు వెబ్‌సైట్‌లో ఉంచుతారు. సీఆర్‌డీఏ వెబ్‌సెట్‌లో బేతపూడి సురేష్‌బాబు.. ప్రభుత్వానికి భూమి ఇచ్చినట్లు ఎక్కడా చూపించడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment