
ప్రియుడి ఇంటి ముందు నిరాహార దీక్ష
పగిడ్యాల (కర్నూలు) :
ప్రేమించి.. పెళ్లి చేసుకుని తనను వంచించిన వ్యక్తిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ మహిళ సోమవారం కర్నూలు జిల్లా పగిడ్యాల మండలంలోని పడమర ప్రాతకోట మైనార్టీ కాలనీలోని ప్రియుడి ఇంటి ముందు నిరాహారదీక్ష చేపట్టింది. బాధితురాలు భావన కథనం మేరకు.. పడమర ప్రాతకోట గ్రామానికి చెందిన షేక్ జబివుల్లా నాలుగేళ్ల క్రితం పని నిమిత్తం రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసరి మండలం బోడుప్పల్‌కు వెళ్లాడు.
అక్కడ హోటల్ నిర్వాహకుడి కుమార్తె భావనతో పరిచయమైంది. కొంతకాలానికి అతడు ప్రేమిస్తున్నానంటూ వెంటబడ్డాడు. తాను వివాహితనని, తనకు భర్త, పిల్లలు ఉన్నారని చెప్పినా జబివుల్లా చెప్పినా వినిపించుకోలేదు. జబివుల్లాతో భావనకు ఉన్న పరిచయాన్ని చూసి ఆమెను భర్త వదిలేశాడు. ఈ నేపథ్యంలో జబీవుల్లా, భావన 2011 ఏప్రిల్‌లో భువనగిరిలోని ఎల్లమ్మ దేవాలయంలో స్నేహితుల సమక్షంలో హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు.
హైదరాబాద్‌లో రెండున్నరేళ్లు కాపురం చేశారు. ఆ తర్వాత తన తల్లిదండ్రులను ఒప్పించి ఇంటికి తీసుకెళ్తానంటూ ఈ ఏడాది ఏప్రిల్‌లో జబివుల్లా ప్రాతకోటకు వెళ్లాడు. అయితే, ఆరు నెలలుగా ఫోన్‌లో అందుబాటులోకి రాకపోవడంతో అనుమానం వచ్చి భావన ప్రాతకోటలో ఆరా తీసింది. మరొక యువతిని జబివుల్లా పెళ్లి చేసుకున్నట్లు తెలుసుకుని నిర్ఘాంతపోయింది. తనకు న్యాయం చేయాలని ఆవాజ్ కమిటీ సభ్యుల వద్ద పంచాయితీ పెట్టింది.
అయితే, న్యాయం లభించకపోవడంతో జబివుల్లా ఇంటిముందు నిరాహారదీక్ష చేపట్టింది. తనను భార్యగా జబివుల్లా అంగీకరించకపోతే అతని ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటానని విలేకరులకు తెలిపింది. తాను ముస్లిం యువకుడిని వివాహం చేసుకున్నానని తన తల్లిదండ్రులు ఇంట్లోకి రానివ్వడం లేదని, మరోవైపు డబ్బుల కోసం వచ్చానని జబివుల్లా తల్లిదండ్రులు తనపై లేనిపోని నిందలు మోపుతున్నారని కన్నీటిపర్యంతమైంది. ఈ విషయమై ముచ్చుమర్రి ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌రెడ్డిని వివరణ కోరగా.. తన దృష్టికి కూడా ఈ సమస్య వచ్చిందని, అయితే బాధితురాలు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే నిందితుడిపై కేసు నమోదు చేస్తామన్నారు.