
బ్రహ్మోత్సవాలకు పటిష్ట బందోబస్తు
హైదరాబాద్‌లో శాంతిభద్రతలు భేష్: గవర్నర్
తిరుమల : తిరుమలలో సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్న బ్రహ్మోత్సవాల బందోబస్తుకు ఎటువంటి ఇబ్బందీ లేదని రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. సోమవారం ఆయన తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని, తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం గవర్నర్ నరసింహన్ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు ఎటువంటి ఆటంకం లేదన్నారు. వినాయక నిమజ్జనానికి పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటి వరకూ ఏమైనా అనుకోని ఘటనలు జరిగాయా..? ఎందుకు భయపడాలి..? అంటూ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు సంతోషంగా జీవించవచ్చునని ఓ ప్రశ్నకు బదిలిచ్చారు.
ఎటువంటి భయాందోళనలు అవసరం లేదని, ఈ విషయంపై తాను హామీ ఇస్తున్నానని చెప్పారు. శ్రీవారి ఆలయంలో ప్రవేశపెట్టిన మూడు వరసల క్యూ విధానంతో సామాన్య భక్తులకు సంతృప్తికరమైన దర్శనం లభిస్తోందంటూ ఆయన ఈ పద్ధతి ప్రవేశపెట్టిన టీటీడీ అధికారులను అభినందించారు. వీఐపీలు వచ్చినప్పటికీ సామాన్యులకు ఎటువంటి ఇబ్బందిలేదని తెలిపారు. అంతకుముందు వార్షిక బ్రహ్మోత్సవాల వాల్‌పోస్టర్లను ఆలయం ముందు ఆవిష్కరించారు.