
వైభవంగా ముగిసిన వెంకన్న బ్రహ్మోత్సవాలు
ధ్వజావరోహణంతో వీడ్కోలు, చక్రస్నానంలో సేదతీరిన శ్రీవారు
8 రోజుల్లో 5.4 లక్షల మందికి శ్రీవారి దర్శనం, రూ.17.3 కోట్ల హుండీ కానుకలు
తిరుమల: తిరుమలలో తొమ్మిది రోజులపాటు వైభవంగా సాగిన వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. వైదిక ఉపచారాలతో ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగి శాయి. గతనెల 26న మీన లగ్నంలో ధ్వజస్తంభంపై ధ్వజపటాన్ని ఎగురవేసి ముక్కోటి దేవతలను ఆహ్వానించి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. తిరిగి శనివారం రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య వైదిక ఉపచారంతో ధ్వజపటాన్ని అవరోహణం చేసి బ్రహ్మోత్సవాలను ముగిస్తూ దేవతలకు వీడ్కోలు పలికారు. బ్రహ్మోత్సవాలు ముగియడంతో ఆదివారం నుంచి ఆలయంలో ఆర్జిత సేవల్ని పునఃప్రారంభించనున్నారు. భక్తుల రద్దీ తగ్గిన తర్వాతే తిరుమలలో ఇచ్చే రూ.300 టికెట్లను పునరుద్ధరించనున్నారు. 8వ రోజు శుక్రవారం ఉదయం శ్రీమన్నారాయణుడు మహారథం (తేరు)పై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన రథోత్సవం 9.30 గంటల వరకు వేడుకగా సాగింది. రథం ముందు జీయర్లు, పండితుల వేదగోష్టితో సప్తగిరులు పులకించాయి.
రథయానానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంతో మహారథం నిరాటంకంగా ముందుకు సాగింది. తిరిగి రాత్రి మలయప్పస్వామి చల్లటి వెన్నెలలో ఒక చేతిలో చెర్నాకోలు, మరో చేత బంగారు పగ్గం పట్టుకుని అశ్వవాహనంపై భక్తులను పరవశింపజేశారు. అఖరి రోజు శనివారం ఉదయం శ్రీ వేంకటేశ్వరస్వామి అర్చామూర్తిగా ఆవిర్భవించిన శ్రవణా నక్షత్రం పవిత్రముహూర్తాన చక్రస్నానం శాస్రోక్తంగా నిర్వహించారు. 8 రోజుల పాటు పూటకో వాహనంపై ఊరేగుతూ అలసిన స్వామి సేదతీరడం కోసం తొమ్మిదో రోజు ఉదయం చక్రస్నానం నిర్వహిస్తారు. పుష్కరిణి ఒడ్డున ఉన్న వరాహస్వామి ఆలయం ఆవరణలో ఉభయ దేవేరులతో ఆశీనుడైన మలయప్ప స్వామికి సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం (అభిషేకం) చేశారు. అనంతరం మంగళధ్వనులు, అశేష భక్తజనుల గోవింద నామస్మరణల మధ్య గర్భాయలయంలోని మూలమూర్తి అంశమైన సుదర్శన చక్రతాళ్వార్‌కు పుష్కరిణిలో పవిత్ర స్నానం చేయించారు. చక్రతాళ్వార్ స్నానమాచరించే సమయం నుంచి సూర్యాస్తమయం వరకు పుష్కరిణిలో పుణ్యస్నానం చేస్తే సకల పాపాలు నశించి, కష్టాలు తొలగుతాయని పురాణాల చెబుతున్నాయి. దీంతో శనివారం వేలాది భక్తులు దేవదేవుడి పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేశారు. ఈ సందర్భంగా భక్తుల మధ్య స్వల్పతోపులాట జరిగింది.
5.4 లక్షల మంది భక్తులకు శ్రీవారి దర్శనం: ఈవో
శ్రీవారి బ్రహ్మోత్సవాలు అందరి సహకారంతో వైభవంగా ముగిశాయని టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్ తెలిపారు. భవిష్యత్‌లో బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ముందుగానే రిజర్వేషన్, ఇతర ఏర్పాట్లు చేసుకొనే వెసులుబాటు కలుగుతుందన్నారు. బ్రహ్మోత్సవాల్లో 5,40,278 మంది భక్తులు శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నట్లు తెలిపారు. గత ఏడాది హుండీద్వారా రూ.12 కోట్లు రాగా ఈసారి 41.81 శాతం ఎక్కువగా రూ.17.03 కోట్ల మేర కానుకలు అందాయని చెప్పారు.
పోటెత్తిన భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 34 గంటలు
దసరా సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తులు పోటెత్తారు. శనివారం సాయంత్రం 6 గంటల వరకు 48,115 మంది స్వామిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో నిండి వెలుపల క్యూ కట్టారు. వీరికి 34 గంటల తర్వాత దర్శనం లభిస్తుందని శనివారం రాత్రి టీటీడీ ప్రకటించింది.