బస్సు యాత్రకు బ్రేకులు
Published Wed, Sep 11 2013 5:00 AM | Last Updated on Fri, Sep 1 2017 10:36 PM
సాక్షి, హైదరాబాద్/విజయవాడ: ‘తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్ర’ అంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆర్భాటంగా ప్రారంభించిన బస్సుయాత్రకు బ్రేకులు పడ్డాయి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న సీమాంధ్ర ఉద్యమం తీవ్రమవుతున్న నేపథ్యంలో గురువారం నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో తలపెట్టిన యాత్రను అర్ధంతరంగా వాయిదా వేసుకున్నారు. ఈ నెల 1న గుంటూరు జిల్లాలో ప్రారంభమైన బస్సుయాత్ర కృష్ణా జిల్లాలో పూర్తయిన తరువాత పశ్చిమగోదావరి జిల్లాకు వెళ్లాల్సి ఉంది. అయితే ఆయన సభలకు ఆశించిన స్థాయిలో కార్యకర్తలు, ప్రజలు హాజరు కాకపోగా... పలు ప్రాంతాల్లో సమైక్యవాదులు నిరసన తెలిపారు. విభజనపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలంటూ నిలదీశారు.
దీంతో పదిరోజులకే ఆయన యాత్రను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. గురువారం నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో బాబు బస్సుయాత్ర ఉంటుందని ఆ జిల్లాకు చెందిన పార్టీ నేతలు ప్రకటించారు. అయితే, ఉద్యమకారుల నుంచి నిరసనలు తీవ్రస్థాయిలో ఉన్నాయని, తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి సీమాంధ్రలో పర్యటన చేయడమేమిటన్న వ్యతిరేకత సర్వత్రా వ్యక్తమవుతోందని జిల్లా పార్టీ నేతలు తాజా పరిస్థితిని వివరించారు. తాము కూడా సహకరించే పరిస్థితులు లేవని స్పష్టంచేయడంతో చేసేదిలేక బాబు తన యాత్రను వాయిదా వేసుకున్నట్టు పార్టీ వర్గాలు చెప్పాయి. అయితే, గురువారం హైదరాబాద్‌లో పార్టీ నేతలతో బాబు అత్యవసర సమావేశం కానున్నారన్న కారణంగానే యాత్రకు విరామం ప్రకటించినట్టు పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నప్పటికీ గతంలో యాత్ర కొనసాగుతున్న ప్రాంతంలోనే సమావేశాలు నిర్వహించిన విషయాన్ని మరికొందరు నేతలు చెబుతున్నారు.
నేడు, రేపు నేతలతో సమావేశాలు
చంద్రబాబు తనయడు లోకేష్ బుధవారం పార్టీ నేతలతో హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు. దాదాపు 40 మంది నేతలకు ఫోనుచేసి సమావేశంలో తప్పక పాల్గొనాల్సిందిగా ఆయన ఆహ్వానించారు. సమైక్య ఉద్యమం నేపథ్యంలో ఏం చేయాలో పాలుపోక ఈ సమావేశం ఏర్పాటుచేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. బస్సుయాత్రను విజయవంతం చేయడంపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం. చంద్రబాబు కూడా గురువారం ఈ నేతలతో హైదరాబాద్‌లో సమావేశమవుతారు.
Advertisement
Advertisement