atmagaurava Yathara
-
బాబూ...యాత్రెందుకు : ఉదయభాను
విజయవాడ, న్యూస్‌లైన్ : తెలుగుదేశం అధినేత జిల్లాలో చేసిన ఆత్మగౌరవ యాత్ర ఉద్దేశం ఏమిటో ప్రజలకు అర్థం కాలేదని... ఆయన ఎందుకు యాత్ర చేశారో స్పష్టం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను డిమాండ్ చేశారు. సీతారాంపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు యాత్రలోదివంగత మహానేత వైఎస్.రాజశేఖర్‌రెడ్డి కుటుంబాన్ని, పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను, అధినేత జగన్మోహన్రెడ్డిని విమర్శించటం తప్ప చేసిందేమి లేదన్నారు. జస్టిస్చౌదరిలాగా ఉండాలని సూచిస్తున్న చంద్రబాబు ఆయన ఎలా ఉన్నారో చెప్పాలన్నారు. 1998లో బీజేపీ ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని తీర్మానం చేశారని, దానికి ఆకర్షితుడైన బాబు 1999లో బీజేపీతో పొత్తుపెట్టుకున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే 2008లో రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చారని తెలిపారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే రాష్ట్ర విభజనకు అనుకూలమో లేదో స్పష్టం చేయాలన్నారు. లేనిపక్షంలో ధైర్యం లేదని ఒప్పుకోవాలని కోరారు. మీ ఎమ్మెల్యేలను, ఎంపీలను రాజీనామాలు చేయించకుండా ఎందుకు యాత్రను ముగిస్తున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల నుంచి నిరసనల సెగ తగలటంతో అర్ధాంతరంగా యాత్రను ముగిస్తున్నారని తెలిపారు. జగన్ సీఎం, రాహుల్ పీఎం అవుతారని చంద్రబాబే డిక్లరేషన్ ఇస్తున్నారని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగితే ఎలా ఉంటుందో అనేక సర్వేలు చెబుతున్నాయన్నారు. ఇరుప్రాంతాల్లో టీడీపీ అంతరించిపోతుందని సర్వేలు తేల్చాయని చెప్పారు. పామర్రు నియోజకవర్గం సమన్వకర్త ఉప్పులేటి కల్పన మాట్లాడుతూ బుధవారంతో ముగియనున్న చంద్రబాబు ఆత్మగౌరవ యాత్రలో ఎక్కడా సమైక్యాంధ్ర పేరు కూడా ప్రస్తావించలేదన్నారు. ఆయన యాత్రను ఆత్మస్తుతి యాత్రగా పేరు మార్చుకోవాలని విమర్శించారు. తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నానని ప్రగల్భాలు పలకడం, మసిబూసి మారేడుకాయ రాజకీయాలు చేయడం మినహా.. నలభైరోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమాల గురించి ఏనాడూ పట్టించుకోలేదని చెప్పారు. సమైక్యవాదులు అడ్డగిస్తుంటే వారిని వైఎస్సార్ సీపీ కార్యకర్తలుగా వర్ల రామయ్య, ఇతర నాయకులు చిత్రీకరిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు యాత్రను అడ్డుకోవాల్సిన అవసరం తమ పార్టీ కార్యకర్తలకు లేదన్నారు. మిట్టగూడెంలో టీడీపీలోని మరో గ్రూపుగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అడ్డుకున్న విషయాన్ని గమనించాలన్నారు. విభజన ప్రక్రియ ఆపడానికి టీడీపీ ఏ చర్యలు తీసుకుంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రచారకమిటీ సభ్యుడు లంకా బాబు, కార్యాలయ కో-ఆర్డినేటర్ టి.ఆర్. అశోక్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు సూరపనేని రామారావు, పార్టీ నాయకులు ప్రభల శ్రీనివాస్, ఇంజినీరింగ్‌విద్యార్థి జేఏసీ నాయకుడు దొడ్డా అంజిరెడ్డి పాల్గొన్నారు. -
బస్సు యాత్రకు బ్రేకులు
సాక్షి, హైదరాబాద్/విజయవాడ: ‘తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్ర’ అంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆర్భాటంగా ప్రారంభించిన బస్సుయాత్రకు బ్రేకులు పడ్డాయి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న సీమాంధ్ర ఉద్యమం తీవ్రమవుతున్న నేపథ్యంలో గురువారం నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో తలపెట్టిన యాత్రను అర్ధంతరంగా వాయిదా వేసుకున్నారు. ఈ నెల 1న గుంటూరు జిల్లాలో ప్రారంభమైన బస్సుయాత్ర కృష్ణా జిల్లాలో పూర్తయిన తరువాత పశ్చిమగోదావరి జిల్లాకు వెళ్లాల్సి ఉంది. అయితే ఆయన సభలకు ఆశించిన స్థాయిలో కార్యకర్తలు, ప్రజలు హాజరు కాకపోగా... పలు ప్రాంతాల్లో సమైక్యవాదులు నిరసన తెలిపారు. విభజనపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలంటూ నిలదీశారు. దీంతో పదిరోజులకే ఆయన యాత్రను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. గురువారం నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో బాబు బస్సుయాత్ర ఉంటుందని ఆ జిల్లాకు చెందిన పార్టీ నేతలు ప్రకటించారు. అయితే, ఉద్యమకారుల నుంచి నిరసనలు తీవ్రస్థాయిలో ఉన్నాయని, తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి సీమాంధ్రలో పర్యటన చేయడమేమిటన్న వ్యతిరేకత సర్వత్రా వ్యక్తమవుతోందని జిల్లా పార్టీ నేతలు తాజా పరిస్థితిని వివరించారు. తాము కూడా సహకరించే పరిస్థితులు లేవని స్పష్టంచేయడంతో చేసేదిలేక బాబు తన యాత్రను వాయిదా వేసుకున్నట్టు పార్టీ వర్గాలు చెప్పాయి. అయితే, గురువారం హైదరాబాద్‌లో పార్టీ నేతలతో బాబు అత్యవసర సమావేశం కానున్నారన్న కారణంగానే యాత్రకు విరామం ప్రకటించినట్టు పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నప్పటికీ గతంలో యాత్ర కొనసాగుతున్న ప్రాంతంలోనే సమావేశాలు నిర్వహించిన విషయాన్ని మరికొందరు నేతలు చెబుతున్నారు. నేడు, రేపు నేతలతో సమావేశాలు చంద్రబాబు తనయడు లోకేష్ బుధవారం పార్టీ నేతలతో హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు. దాదాపు 40 మంది నేతలకు ఫోనుచేసి సమావేశంలో తప్పక పాల్గొనాల్సిందిగా ఆయన ఆహ్వానించారు. సమైక్య ఉద్యమం నేపథ్యంలో ఏం చేయాలో పాలుపోక ఈ సమావేశం ఏర్పాటుచేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. బస్సుయాత్రను విజయవంతం చేయడంపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం. చంద్రబాబు కూడా గురువారం ఈ నేతలతో హైదరాబాద్‌లో సమావేశమవుతారు. -
అర్హత బాబుకు లేదు
మైలవరం, న్యూస్‌లైన్ : తెలుగుతల్లి గుండె చీల్చిన చంద్రబాబుకు తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర చేసే అర్హత లేదని వైఎస్సార్సీపీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ తెలిపారు. చంద్రబాబు బస్సు యాత్ర ఆదివారం రెడ్డిగూడెం చేరుకుంటున్న నేపథ్యంలో బాబుకు నల్ల జెండాలు, సమైక్యాంధ్ర జెండాలతో నిరసన తెలిపేందుకు, సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటించిన తరువాతే నియోజకవర్గంలోకి ప్రవేశించమని తెలియజేస్తూ యాత్రను అడ్డుకునేందుకు ఆయన నాయకులు, కార్యకర్తలతో రెడ్డిగూడెం బయలుదేరారు. మైలవరంలో ప్రధాన రహదారుల్లో బాబు యాత్రకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఆయన మాట్లాడుతూ 2008లో రాష్ట్ర విభజనకు అనుకూలంగా బాబు పార్టీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన లేఖ నేడు విభజనకు కారణమైందన్నారు. బాబు లేఖను ఆసరా చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగుతల్లి గుండెను రెండుగా చీల్చి రాష్ట్ర విభజనకు ప్రయత్నాలు చేసిందని విమర్శించారు. దీనికి చంద్రబాబే నైతిక బాధ్యత వహించాలన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మహిళలు ఉవ్వెత్తున ఉద్యమిస్తుంటే తొమ్మిదేళ్లు ప్రతిపక్ష నాయకునిగా ఉన్న చంద్రబాబు సీమాంధ్రలో పర్యటిస్తూ కపట ప్రేమ ఒలకబోస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీని, జగన్మోహన్రెడ్డిని ఎదుర్కోవడం కష్టమని భావించి అభూతకల్పనలతో చౌకబారు విమర్శలు చేయడానికి మాత్రమే సీమాంధ్రలో పర్యటిస్తున్నారని విమర్శించారు. సమైక్యాంధ్రపై బాబు అభిప్రాయాన్ని స్పష్టంగా ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. బాబు విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలన్నారు. ఈ డిమాండ్లతో కూడిన బహిరంగ లేఖను చంద్రబాబుకు ఇచ్చేందుకు బయలుదేరగా, పోలీసులు అడ్డుకుని ఆయన్ని హౌస్ అరెస్టు చేశారు. సీఐ విజయరావు, ఎస్సై నాగప్రసాద్‌లు సిబ్బందితో కలసి జోగి ఇంట్లోనే ఆయన్ని నిర్బంధించి పోలీసు సిబ్బందిని పర్యవేక్షణ కోసం ఏర్పాటుచేశారు.