మైలవరం, న్యూస్‌లైన్ : తెలుగుతల్లి గుండె చీల్చిన చంద్రబాబుకు తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర చేసే అర్హత లేదని వైఎస్సార్‌సీపీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ తెలిపారు. చంద్రబాబు బస్సు యాత్ర ఆదివారం రెడ్డిగూడెం చేరుకుంటున్న నేపథ్యంలో బాబుకు నల్ల జెండాలు, సమైక్యాంధ్ర జెండాలతో నిరసన తెలిపేందుకు, సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటించిన తరువాతే నియోజకవర్గంలోకి ప్రవేశించమని తెలియజేస్తూ యాత్రను అడ్డుకునేందుకు ఆయన నాయకులు, కార్యకర్తలతో రెడ్డిగూడెం బయలుదేరారు.
మైలవరంలో ప్రధాన రహదారుల్లో బాబు యాత్రకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఆయన మాట్లాడుతూ 2008లో రాష్ట్ర విభజనకు అనుకూలంగా బాబు పార్టీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన లేఖ నేడు విభజనకు కారణమైందన్నారు. బాబు లేఖను ఆసరా చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగుతల్లి గుండెను రెండుగా చీల్చి రాష్ట్ర విభజనకు ప్రయత్నాలు చేసిందని విమర్శించారు. దీనికి చంద్రబాబే నైతిక బాధ్యత వహించాలన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మహిళలు ఉవ్వెత్తున ఉద్యమిస్తుంటే తొమ్మిదేళ్లు ప్రతిపక్ష నాయకునిగా ఉన్న చంద్రబాబు సీమాంధ్రలో పర్యటిస్తూ కపట ప్రేమ ఒలకబోస్తున్నారని మండిపడ్డారు.
వైఎస్సార్‌సీపీని, జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కోవడం కష్టమని భావించి అభూతకల్పనలతో చౌకబారు విమర్శలు చేయడానికి మాత్రమే సీమాంధ్రలో పర్యటిస్తున్నారని విమర్శించారు. సమైక్యాంధ్రపై బాబు అభిప్రాయాన్ని స్పష్టంగా ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. బాబు విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలన్నారు. ఈ డిమాండ్లతో కూడిన బహిరంగ లేఖను చంద్రబాబుకు ఇచ్చేందుకు బయలుదేరగా, పోలీసులు అడ్డుకుని ఆయన్ని హౌస్ అరెస్టు చేశారు. సీఐ విజయరావు, ఎస్సై నాగప్రసాద్‌లు సిబ్బందితో కలసి జోగి ఇంట్లోనే ఆయన్ని నిర్బంధించి పోలీసు సిబ్బందిని పర్యవేక్షణ కోసం ఏర్పాటుచేశారు.