telugu mother
-
చీలిక కలతతో ఆగిన గుండె
పద్మనాభం, న్యూసల్ : తెలుగు తల్లిని రెండుగా చీల్చారన్న వార్త అతని హృదయాన్ని కదిలించింది. రాష్ట్ర విభజన వల్ల మనకు తీరని నష్టం కలుగుతుందన్న ఆవేదనతో గుండె ఆగి మరణించాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పెంట గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త రొంగలి రాము (55) కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రాన్ని విభజిస్తామని ప్రకటించటాన్ని మొదటి నుంచి జీర్ణించుకోలేకపోయాడు. సీమాంధ్రలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు రావని స్థానికులకు వివరిస్తూ కలత చెందేవాడు. విభజించడం వల్ల హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్న తన కుమారుడు చిట్టినాయుడు ఇంటికి వచ్చేస్తాడని రాము అంటుండేవాడు. సాయంత్రం పొలానికి వె ళ్లి వచ్చిన రాము తెలంగాణ బిల్లును లోక్‌సభ ఆమోదించిందని తెలియడంతో అధిక రక్తపోటుకు గురయ్యాడు. చికిత్సకు కుటుంబ సభ్యులు ఆటోలో విజయనగరం తీసుకువెళుతుండగా మార్గమధ్యంలో గుండె ఆగి మృతి చెందాడు. మృతుడు రాముకు భార్య ముత్యాలమ్మ, కుమార్తె లక్ష్మి, కుమారులు శ్రీనివాసరావు, చిట్టినాయుడు ఉన్నారు. -
అర్హత బాబుకు లేదు
మైలవరం, న్యూస్‌లైన్ : తెలుగుతల్లి గుండె చీల్చిన చంద్రబాబుకు తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర చేసే అర్హత లేదని వైఎస్సార్సీపీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ తెలిపారు. చంద్రబాబు బస్సు యాత్ర ఆదివారం రెడ్డిగూడెం చేరుకుంటున్న నేపథ్యంలో బాబుకు నల్ల జెండాలు, సమైక్యాంధ్ర జెండాలతో నిరసన తెలిపేందుకు, సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటించిన తరువాతే నియోజకవర్గంలోకి ప్రవేశించమని తెలియజేస్తూ యాత్రను అడ్డుకునేందుకు ఆయన నాయకులు, కార్యకర్తలతో రెడ్డిగూడెం బయలుదేరారు. మైలవరంలో ప్రధాన రహదారుల్లో బాబు యాత్రకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఆయన మాట్లాడుతూ 2008లో రాష్ట్ర విభజనకు అనుకూలంగా బాబు పార్టీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన లేఖ నేడు విభజనకు కారణమైందన్నారు. బాబు లేఖను ఆసరా చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగుతల్లి గుండెను రెండుగా చీల్చి రాష్ట్ర విభజనకు ప్రయత్నాలు చేసిందని విమర్శించారు. దీనికి చంద్రబాబే నైతిక బాధ్యత వహించాలన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మహిళలు ఉవ్వెత్తున ఉద్యమిస్తుంటే తొమ్మిదేళ్లు ప్రతిపక్ష నాయకునిగా ఉన్న చంద్రబాబు సీమాంధ్రలో పర్యటిస్తూ కపట ప్రేమ ఒలకబోస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీని, జగన్మోహన్రెడ్డిని ఎదుర్కోవడం కష్టమని భావించి అభూతకల్పనలతో చౌకబారు విమర్శలు చేయడానికి మాత్రమే సీమాంధ్రలో పర్యటిస్తున్నారని విమర్శించారు. సమైక్యాంధ్రపై బాబు అభిప్రాయాన్ని స్పష్టంగా ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. బాబు విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలన్నారు. ఈ డిమాండ్లతో కూడిన బహిరంగ లేఖను చంద్రబాబుకు ఇచ్చేందుకు బయలుదేరగా, పోలీసులు అడ్డుకుని ఆయన్ని హౌస్ అరెస్టు చేశారు. సీఐ విజయరావు, ఎస్సై నాగప్రసాద్‌లు సిబ్బందితో కలసి జోగి ఇంట్లోనే ఆయన్ని నిర్బంధించి పోలీసు సిబ్బందిని పర్యవేక్షణ కోసం ఏర్పాటుచేశారు. -
పట్టు సడలని పోరు
తిరుపతి, న్యూస్‌లైన్: జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమ సెగలు మిన్నంటుతున్నాయి. ఉద్యమం 39వ రోజుకు చేరింది. ఊరూవాడా సమైక్య నినాదాలు హోరెత్తుతున్నాయి. ర్యాలీలు, ధర్నాలు, నిరసనలతో రహదారులను దిగ్బంధిస్తున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమంలో భాగస్వాములవుతున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు మద్దతుగా పీలేరులో శని వారం సంపూర్ణ బంద్ జరిగింది. వ్యాపార సంస్థలు, ప్రభుత్వ, పైవేట్ విద్యాసంస్థలు. ప్రభుత్వ కార్యాలయాలు స్వచ్ఛందంగా మూ తపడ్డాయి. హైదరాబాద్‌లో సీమాంధ్ర న్యాయవాదులపై తెలంగాణ న్యాయవాదుల దాడిని నిరసిస్తూ పీలేరులో న్యాయవాదులు నాలుగు రోడ్ల కూడలిలో మానవహారం నిర్వహించారు. రాజీవ్ విద్యామిషన్ ఇంజనీరింగ్ సిబ్బంది రిలే నిరాహార దీక్షలు 31వ రోజుకు చేరాయి. జిల్లా భట్రాజుల సంఘం ఆధర్యంలో సుమారు 5 వేలమంది భారీ ర్యాలీ నిర్వహించి వంటావార్పు చేపట్టారు. సమైక్యాంధ్ర నాటికను ప్రదర్శించారు. హైదరాబాద్‌లో సీమాంధ్రవాసులపై దాడిని నిరసిస్తూ తిరుపతిలో తెలుగుతల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. చిత్తూరులో జేఏసీ నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. ట్రాన్స్‌కో ఉద్యోగులు ఈ నెల 12 నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నట్లు ప్రకటించి రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. హైదరాబాద్‌లో సీమాంధ్ర న్యాయవాదులపై దాడిని నిరసిస్తూ న్యాయవాదులు రాస్తారోకో నిర్వహించారు. చంద్రగిరిలో ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ రిలే నిరాహార దీక్షలు 39వ రోజుకు చేరుకున్నాయి. వ్యవసాయ శాఖ సిబ్బంది రోడ్డుపై మట్టిపోసి వరినాట్లు వేసి వినూత్న తరహాలో నిరసన తెలి పారు. శ్రీకాళహస్తిలో స్కిట్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఏపీ సీడ్స్ కూడలిలో ధర్నా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. పెండ్లిమండపం కూడలి వద్ద రెవెన్యూ సిబ్బంది, బేరివారిమండపం వద్ద ఐకేపీ సంఘాల మహిళల రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. బాబూ అగ్రహారం వద్ద ఉపాధ్యాయులు రోడ్డుపై ఆటపాట కార్యక్రమం నిర్వహించారు. పుత్తూరులో ఆర్టీసీ కార్మికులు చెవిలో పూలు పెట్టుకొని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పుత్తూరు, నగరిలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ రిలే దీక్షలు కొనసాగాయి. హైదరాబాద్‌లో సీమాంధ్ర న్యాయవాదులపై తెలంగాణ న్యాయవాదుల దాడిని నిరసిస్తూ పుంగనూరులో న్యాయవాదులు భారీ ర్యాలీ నిర్వహించి గోకుల్ సర్కిల్లో మానవహారం ఏర్పాటుచేసి రాస్తారోకో చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన సిబ్బంది నిరసన ప్రదర్శన నిర్వహించారు. మున్సిపల్ సిబ్బంది, జేఏసీ రిలే దీక్షలు కొనసాగాయి. ఉపాధ్యాయులు ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. విద్యార్థులు ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. మదనపల్లెలో జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి మల్లికార్జున సర్కిల్లో మానవహారం ఏర్పాటు చేశారు. విద్యార్థి జేఏసీ నాయకులు రెండు సినిమా థియేటర్ల వద్ద తుఫాన్ సినిమా వాల్‌పోస్టర్లను ధ్వంసం చేశారు. జేఏసీ రిలే దీక్షలు యథావిధిగా కొనసాగాయి. పలమనేరులో విద్యార్థులు రోడ్డుపై చదువులు సాగించి, సమైక్య నినాదాన్ని రామకోటి తరహాలో రాసి నిరసన తెలిపారు. న్యాయవాదులు ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. టీడీ పీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి మానవహారం ఏర్పాటు చేశారు. జేఏసీ దీక్షలు కొనసాగాయి. వి.కోటలో 48 గంటల బంద్ కొనసాగింది. ఎలక్ట్రికల్,డిష్ యాంటెన్నా వ్యాపారులు ర్యాలీ నిర్వహించి, మానవహారం ఏర్పాటు చేశారు. గంగవరంలో ఉపాధ్యాయులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. బెరైడ్డిపల్లెలో ఉపాధ్యాయ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు కొనసాగాయి. కుప్పం నియోజకవర గం శాంతిపురంలో ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. హైస్కూల్ విద్యార్థులు మానవహారం ఏర్పాటుచేశారు. కుప్పం, శాంతిపురంలో జేఏసీ నిరాహార దీక్షలు కొనసాగాయి. మదనపల్లె రూర ల్, తంబళ్లపల్లె, పూతలపట్టు నియోజకవర్గాల్లో నిరసన కార ్యక్రమాలు జరిగాయి. -
‘మా తెలుగు తల్లికి’ లక్ష గళార్చన
బాపులపాడు (పెదపాడు), న్యూస్‌లైన్ : బాపులపాడు హైస్కూల్లో గురువారం తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రైవేట్ పాఠశాలల సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులతో మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీత లక్షగళార్చన నిర్వహించారు. మండలంలోని అప్పనవీడు, ఏపూరు, బాపులపాడు, వీరవల్లి గ్రామాలకు చెందిన 10 వేల మంది విద్యార్థులు పదిసార్లు గీతాన్ని ఆలపించి తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటారు. అనంతరం విశాలాంధ్ర మహాసభ నాయకుడు వాసిరెడ్డి వెంకటకృష్టారెడ్డి మాట్లాడుతూ సమైక్య రాష్ట్రం కోసం అందరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. దేశంలో హిందీ తరువాత అత్యధికులు మాట్లాడే భాష తెలుగేనని, ఒకే భాష.. ఒకే రాష్ట్రంగా ఉండాలని ఆకాంక్షించారు. ఎంఈవో లూథర్‌పాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థుల తెలుగుతల్లి నృత్యరూపకం ఆకట్టుకుంది.