జహీరాబాద్, న్యూస్‌లైన్:
ఆలుగడ్డ సాగుకు వర్షాలు అడ్డంకిగా మారాయి. పక్షం రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో ఆలు సాగుకు వాతావరణం అనుకూలించడం లేదు. వచ్చిన విత్తనాలు దెబ్బతింటున్నాయం టూ రైతులు ఆందోళన చెందుతున్నారు. నియోజకవర్గంలోని జహీరాబాద్, కోహీ ర్, ఝరాసంగం, న్యాల్‌కల్ మండలాల్లో రైతులు ఆలుగడ్డ పంటను విస్తారంగా సాగు చేస్తుంటారు. నాలుగు దశాబ్దాలుగా ఈ పంటను సంప్రదాయకంగా పండిస్తున్నారు. ఏటా సెప్టెంబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు రైతులు ఈ పంటను సాగు చేస్తుంటారు. ఈ ఏడాది మాత్రం ఇప్పటివరకు ఆలు సాగుకు నోచుకోలేక పోయింది. ఇప్పటికీ వర్షాలు కురుస్తుండడమే ఇందుకు కారణం. మరో పక్షం రోజుల వరకు కూడా పంట సాగుకు భూములు అనుకూలించే పరిస్థితి లేదు. ఇప్పటికీ పొలాల్లో అధిక తేమ కన్పిస్తుంది. రేగడి భూముల్లో అయితే మరో 20 రోజుల వరకు కూడా పంటను సాగుచేసే పరిస్థితి కనిపించడం లేదని రైతులు పేర్కొంటున్నారు.
తుపాన్ ప్రభావం కూడా...
పై-లీన్ తుపాన్ ప్రభావం కూడా జహీరాబాద్ ప్రాంతంపై ఉంటే పంట సాగును మరింత ముందుకు పొడిగించుకోక తప్పదని రైతులు భావిస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ 15వరకు సగం పంటను సాగు చేసిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆలుగడ్డ సాగుకు వాతావరణం అనుకూలంగా లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ సాగు చేసినా దిగుబడులు రాని పరిస్థితి ఉంటుంది. ఇప్పటికీ వర్షాలు వీడకపోవడంతో పంటను సాగు చేసుకునే విషయంలో కొంత మంది రైతులు ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. ఈ ఏడాది కూరగాయల ధరలు అధికంగా ఉండడంతో రైతులు ఆలు సాగుపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. వాతావరణం అనుకూలంగా లేనట్లయితే రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు ఆసక్తి చూపే అవకాశం లేక పోలేదంటున్నారు.
దెబ్బతింటున్న విత్తనం
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా ప్రాంతం నుంచి రైతులు ఆలుగడ్డ విత్తనాన్ని తెచ్చుకుంటున్నారు. కొందరు రైతులు మాత్రం దళారుల వద్ద కొనుగోలు చేస్తున్నారు. పక్షం రోజుల క్రితం ఆలుగడ్డ విత్తనాన్ని కొనుగోలు చేసుకుని వచ్చిన రైతులకు సంబంధించిన విత్తనం దెబ్బతింటోంది. కోల్డ్ స్టోరేజీల నుంచి తెచ్చిన విత్తనాన్ని పక్షం రోజుల్లోపే సాగు చేసుకోవాలి. లేకపోతే విత్తనం నిల్వ ఉంచిన ప్రాంతంలోనే మొలకెత్తి దెబ్బతినే ప్రమాదం ఉంది. దెబ్బతిన్న విత్తనాన్ని సాగు చేసుకుంటే పంట దిగుబడులు పడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇంతటితో వర్షాలు ఆగిపోతే పంటను సాగు చేసుకున్నా కొంత ఉపయోగకరంగా ఉంటుందని రైతులు అంటున్నారు. లేనట్లయితే నష్టాల పాలవుతామని ఆందోళన చెందుతున్నారు.
మండుతున్న విత్తనం ధర
ఆలుగడ్డ విత్తనం ధర మండుతోంది. క్వింటాల్ విత్తనం ధర రూ.2,000 నుంచి రూ.2,400 వరకు పలుకుతోంది. దళారులు విత్తనాన్ని ఆగ్రాలో కొనుగోలు చేసి ఇక్కడ విక్రయిస్తున్నారు. నేరుగా కొనుగోలు చేసుకునే రైతులకు మాత్రం క్వింటాల్ విత్తనం ధర రూ.1,800 అవుతోంది. వాతావరణం పొడిబారితే దళారులు విత్తనం ధరను మరింత పెంచే అవకాశాలున్నాయి. ప్రభుత్వ పరంగా ఎలాంటి సహకారం లేక పోవడంతో రైతులు ఆలుగడ్డ విత్తనాన్ని దళారుల వద్ద కొనుగోలు చేసుకోక తప్పడం లేదు. ఇదే అదునుగా భావిస్తున్న దళారులు రైతులకు అధిక ధరలకు విత్తనాన్ని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు
ఆలు సాగుకు బ్రేక్
Published Sun, Oct 13 2013 12:10 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement