తాళ్లపూడి మండలంలో ఇటుకల బట్టీలో కాల్చిన ఇటుక
పశ్చిమగోదావరి ,తాళ్లపూడి : మట్టి ఇటుక ధరలు చుక్కలనంటాయి. దీంతో గృహ నిర్మాణ యజమానులు గగ్గోలు పెడుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం వెయ్యి ఇటుకలు రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు విక్రయిస్తున్నారు. రెండు నెలల క్రితం ఈ ధర రూ.5 వేలుగా ఉండేది. ఇటుకల బట్టీ యజమానులు రోజుకు రూ.100, రూ.200 చొప్పున పెంచుతూ పోతున్నారు. దీంతో ధర చుక్కలనంటింది. పెరిగిన ఇటుక ధరలతో నిర్మాణ రంగంపై అదనపు భారం పడుతుంది.
మరోవైపు ముడి సరుకుల ధరలు పెరగడంతో బట్టీ యజమానులు పూర్తిస్థాయిలో ఇటుకను తయారు చేయడం లేదు. దీంతో క్రమేపీ ధర పెరిగింది. జిల్లాలో తాళ్లపూడి మండలంలో తయారయ్యే ఇటుకలకు ఇతర ప్రాంతాల్లో కూడా మంచి డిమాండ్ ఉంది. ఇక్కడి నుంచి జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు, ఇతర జిల్లాలకు, హైదరాబాద్‌కు నిత్యం ఇటుకలను ఎగుమతి చేస్తున్నారు. ఈ ప్రాంతంలో తయారయ్యే ఇటుకలు నల్లరేగడి, జిగురుమట్టితో తయారు చేస్తుంటారు. పచ్చి ఇటుక ఎండలో ఆరిన తరువాత బట్టీపై పేర్చి వంటచెరకు, బొగ్గు, ఊకతో కాలుస్తారు. అందువల్ల ఇవి మరింత ధృడంగా తయారవుతాయి.
జిల్లాలో 400 పైగా బట్టీలు
జిల్లాలో 400కు పైగా ఇటుకల తయారీ బట్టీలు ఉన్నాయి. ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి. బట్టీ యజమానులు శ్రీకాకుళం, విజయనగరం, ఒడిశా నుంచి కార్మికులను తీసుకువచ్చి వారి వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసి ఇటుకల తయారీని చేపడుతున్నారు. ఒక్కో బట్టీలో సుమారు 10 నుంచి 20 మంది ఉపాధి పొందుతున్నారు. బట్టీ యజమానులు ఒక్కో కుటుంబానికి అడ్వాన్సు కింద భారీగా ఇచ్చి వారికి ఇక్కడకు తీసుకువస్తున్నారు. ఇటీవల కాలంలో వంట చెరకు, ఊక, మట్టి ధరలు భారీగా పెరిగాయి. దీంతో ధరలు పెంచాల్సి వచ్చిందని బట్టీ యజమానులు చెబుతున్నారు. ధర పెరగడంతో కొన్ని బట్టీల యజమానులు నాసిరకంగా ఇటుకలు తయారు చేస్తున్నారని గృహనిర్మాణదారులు ఆరోపిస్తున్నారు.
సిండికేట్‌గా మారిన యజమానులు
ఏటా నవంబర్ నుంచి జూన్ వరకు ఇటుకను ముమ్మరంగా తీయడం జరుగుతుంది. ఈ సమయంలో ఇటుక ధరలు అందుబాటులోకి వచ్చేవి. అయితే ఈ ఏడాది మాత్రం ప్రారంభం నుంచి అ«ధిక ధరలకు అమ్ముతున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో గృహాలకు ఇబ్బడి ముబ్బడిగా అనుమతులు ఇవ్వడంతో పాటు గ్రామాల్లో పాత ఇళ్లను పడగొట్టి కొత్తగా గృహాలను నిర్మిస్తున్నారు. ఇదే అదునుగా
బట్టీల యజమానులు సిండికేట్‌గా మారి ఇటుక ధరలు మరింత పెంచేశారు. ఫిబ్రవరి, మార్చిలో 1,000 ఇటుక పెద్ద సైజ్ రూ.5,000 నుంచి రూ.5,500 వరకు విక్రయించారు. ప్రస్తుతం సైజు, నాణ్యతను బట్టి రూ.7,500 పైగా విక్రయిస్తున్నారు. ఇటుక తయారీలో ఒక్కో విడతకు పెద్ద సైజువి అయితే 20 వేల నుంచి 30 వేల వరకు తయారు చేసి కాల్చుతారు. ఒక్కో బట్టి తయారీకి రూ.2.25 లక్షల వరకు ఖర్చవుతుంది.
సిమెంట్ ఇటుకల వైపు మొగ్గు
మట్టి ఇటుకల ధరలు పెరగడంతో చాలా మంది సిమెంట్ ఇటుకల వైపు మొగ్గు చూపుతున్నారు. నాలుగు మట్టి ఇటుకల స్థానంలో ఒక సిమెంట్ ఇటుక పెడితే సరిపోతుంది. కూలీల ఖర్చు కూడా తగ్గుతుందని నిర్మాణ దారులు చెబుతున్నారు.
అదనపు భారం
ఇటుక ధరలు అమాంతం పెరగడంతో నిర్మాణంపై భారం పడింది. గతంలో వెయ్యి ఇటుక రూ.4,500 నుంచి రూ. 5,000 ఉంటేది. ప్రస్తుతం రూ.7,500లకు చేరింది. పేద, మధ్యతరగతి ప్రజలు ఎలా కొనుగోలుచేయాలి. ఎలా ఇల్లు కట్టుకోవాలి.– పి.సత్యనారాయణ, వేగేశ్వరపురం
Comments
Please login to add a commentAdd a comment