tallapudi
-
తాడిపూడి అబ్బాయికి తైవాన్ అమ్మాయితో పెళ్లి
సాక్షి, తాళ్లపూడి: దేశాలు వేరైనా వారిని వివాహ బంధం ఒక్కటి చేసింది.. ప్రేమ వారిని కలిపింది.. తాడిపూడి అబ్బాయికి తైవాన్ అమ్మాయితో వివాహం జరిగింది. భారతీయ వివాహ వ్యవస్థకు ఎల్లలు లేవని చాటి చెప్పింది. తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యుడు గంటా సూర్యచంద్రం కుమారుడు రంగబాబు ఐఐటీ చదివి తైవాన్ టీఎస్ఎంసీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. అదే కంపెనీలో పనిచేస్తున్న తైవాన్ అమ్మాయి చెల్సీతో ప్రేమలో పడ్డాడు. ఈ విషయం తమ తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించడంతో పెళ్లి నిశ్చయించారు. బుధవారం బల్లిపాడులోని ఫంక్షన్ హాలులో క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. తైవాన్ అమ్మాయి చెల్సీ చీర కట్టులో ఆకట్టుకున్నారు. దీవించడానికి వచ్చిన పెద్దలకు ఆమె రెండు చేతులతో నమస్కరించడం అందరినీ ఆకట్టుకుంది. మన సంప్రదాయం అంటే తనకు ఎనలేని గౌరవమని ఆమె పేర్కొన్నారు. మండల జనసేన పార్టీ అధ్యక్షుడు గంటా కృష్ణ, పలువురు సర్పంచులు, ఆయా పార్టీల నాయకులు నూతన వధూవరులను ఆశీర్వదించారు. చదవండి: (దుగ్గిరాల ఎంపీపీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి ఏకగ్రీవ ఎన్నిక) -
పేదింటి విద్యార్థినికి ప్రకాష్‌రాజ్ చేయూత
తాళ్లపూడి: పేదింటి పిల్ల విదేశాల్లో ఉన్నత చదువులు చదివేందుకు సాయపడి సినీనటుడు ప్రకాష్‌రాజ్ తన ఉదారత చాటుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామానికి చెందిన తిరిగిపల్లి సిరిచందన ఇటీవల బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తి చేసింది. ఆన్లైన్ ద్వారా పరీక్ష రాసి ఎంఎస్ చేయడానికి లండన్‌లోని మాంచెస్టర్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సాల్ఫోర్డ్లో సీటు సాధించింది. పేదరికం కారణంగా విద్యార్థిని అడుగు ముందుకు వేయలేకపోయింది. ఈ విషయాన్ని కొందరు మిత్రులు సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రకాష్‌రాజ్ స్పందించారు. చందన చదువుకు అయ్యే ఖర్చును భరించడానికి ముందుకొచ్చారు. విద్యార్థిని తన తల్లితో కలిసి హైదరాబాద్ వెళ్లి ప్రకాష్‌రాజ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
మహిళ సజీవ దహనం
సాక్షి, తాళ్లపూడి: మండలంలోని గజ్జరం గ్రామంలోని కాలనీ వద్ద సోమవారం జరిగిన అగ్నిప్రమాదంలో ఓ మహిళ సజీవ దహనం అయిన ఘటన చోటుచేసుకుంది. తాళ్లపూడి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చిక్కాల సోమాలమ్మ (32) ఉదయం 9.30 సమయంలో ఇంట్లో వంట చేస్తుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు ఎగసి పడ్డాయి. ఒంటికి నిప్పంటుకోవడంతో ఆమె మంటల్లో కాలిపోయినట్టు తెలిపారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యిందా లేక గ్యాస్ వల్ల ప్రమాదం జరిగిందా మరేదైనా కారణమా అనేది తేలాల్సి ఉంది. ఒక్కసారిగా మంటలు వ్యాపించి బంగాళా పెంకుటిల్లుకు మంటలు అంటుకోవడంతో చుట్టుపక్కల వారు మంటలను అదుపుచేయడానికి ప్రయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపుచేశారు. అయితే అప్పటికే సోమాలమ్మ పూర్తిగా కాలిపోవడంతో మృతిచెందడం జరిగింది. శరీరభాగాలు మొత్తం కాలిపోయాయి. సంఘటనా స్థలంలో బంధువుల రోదనలతో మారుమోగింది. మృతురాలి భర్త చిక్కాల శ్రీను లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మల్లిక తాళ్లపూడిలోని కళాశాలలో డీఈడీ చదువుతున్నారు. రెండో కుమార్తె తేజస్వి స్థానిక ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నారు. తాళ్లపూడి ఎస్సై కేవై దాస్ సంఘటనా స్థలంలో వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు తరలించారు. తహసీల్దార్ బి.దేవి, రెవెన్యూ సిబ్బంది వివరాలు సేకరించారు. -
చుక్కల్లో ఇటుక ధర
పశ్చిమగోదావరి ,తాళ్లపూడి : మట్టి ఇటుక ధరలు చుక్కలనంటాయి. దీంతో గృహ నిర్మాణ యజమానులు గగ్గోలు పెడుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం వెయ్యి ఇటుకలు రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు విక్రయిస్తున్నారు. రెండు నెలల క్రితం ఈ ధర రూ.5 వేలుగా ఉండేది. ఇటుకల బట్టీ యజమానులు రోజుకు రూ.100, రూ.200 చొప్పున పెంచుతూ పోతున్నారు. దీంతో ధర చుక్కలనంటింది. పెరిగిన ఇటుక ధరలతో నిర్మాణ రంగంపై అదనపు భారం పడుతుంది. మరోవైపు ముడి సరుకుల ధరలు పెరగడంతో బట్టీ యజమానులు పూర్తిస్థాయిలో ఇటుకను తయారు చేయడం లేదు. దీంతో క్రమేపీ ధర పెరిగింది. జిల్లాలో తాళ్లపూడి మండలంలో తయారయ్యే ఇటుకలకు ఇతర ప్రాంతాల్లో కూడా మంచి డిమాండ్ ఉంది. ఇక్కడి నుంచి జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు, ఇతర జిల్లాలకు, హైదరాబాద్‌కు నిత్యం ఇటుకలను ఎగుమతి చేస్తున్నారు. ఈ ప్రాంతంలో తయారయ్యే ఇటుకలు నల్లరేగడి, జిగురుమట్టితో తయారు చేస్తుంటారు. పచ్చి ఇటుక ఎండలో ఆరిన తరువాత బట్టీపై పేర్చి వంటచెరకు, బొగ్గు, ఊకతో కాలుస్తారు. అందువల్ల ఇవి మరింత ధృడంగా తయారవుతాయి. జిల్లాలో 400 పైగా బట్టీలు జిల్లాలో 400కు పైగా ఇటుకల తయారీ బట్టీలు ఉన్నాయి. ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి. బట్టీ యజమానులు శ్రీకాకుళం, విజయనగరం, ఒడిశా నుంచి కార్మికులను తీసుకువచ్చి వారి వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసి ఇటుకల తయారీని చేపడుతున్నారు. ఒక్కో బట్టీలో సుమారు 10 నుంచి 20 మంది ఉపాధి పొందుతున్నారు. బట్టీ యజమానులు ఒక్కో కుటుంబానికి అడ్వాన్సు కింద భారీగా ఇచ్చి వారికి ఇక్కడకు తీసుకువస్తున్నారు. ఇటీవల కాలంలో వంట చెరకు, ఊక, మట్టి ధరలు భారీగా పెరిగాయి. దీంతో ధరలు పెంచాల్సి వచ్చిందని బట్టీ యజమానులు చెబుతున్నారు. ధర పెరగడంతో కొన్ని బట్టీల యజమానులు నాసిరకంగా ఇటుకలు తయారు చేస్తున్నారని గృహనిర్మాణదారులు ఆరోపిస్తున్నారు. సిండికేట్‌గా మారిన యజమానులు ఏటా నవంబర్ నుంచి జూన్ వరకు ఇటుకను ముమ్మరంగా తీయడం జరుగుతుంది. ఈ సమయంలో ఇటుక ధరలు అందుబాటులోకి వచ్చేవి. అయితే ఈ ఏడాది మాత్రం ప్రారంభం నుంచి అ«ధిక ధరలకు అమ్ముతున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో గృహాలకు ఇబ్బడి ముబ్బడిగా అనుమతులు ఇవ్వడంతో పాటు గ్రామాల్లో పాత ఇళ్లను పడగొట్టి కొత్తగా గృహాలను నిర్మిస్తున్నారు. ఇదే అదునుగా బట్టీల యజమానులు సిండికేట్‌గా మారి ఇటుక ధరలు మరింత పెంచేశారు. ఫిబ్రవరి, మార్చిలో 1,000 ఇటుక పెద్ద సైజ్ రూ.5,000 నుంచి రూ.5,500 వరకు విక్రయించారు. ప్రస్తుతం సైజు, నాణ్యతను బట్టి రూ.7,500 పైగా విక్రయిస్తున్నారు. ఇటుక తయారీలో ఒక్కో విడతకు పెద్ద సైజువి అయితే 20 వేల నుంచి 30 వేల వరకు తయారు చేసి కాల్చుతారు. ఒక్కో బట్టి తయారీకి రూ.2.25 లక్షల వరకు ఖర్చవుతుంది. సిమెంట్ ఇటుకల వైపు మొగ్గు మట్టి ఇటుకల ధరలు పెరగడంతో చాలా మంది సిమెంట్ ఇటుకల వైపు మొగ్గు చూపుతున్నారు. నాలుగు మట్టి ఇటుకల స్థానంలో ఒక సిమెంట్ ఇటుక పెడితే సరిపోతుంది. కూలీల ఖర్చు కూడా తగ్గుతుందని నిర్మాణ దారులు చెబుతున్నారు. అదనపు భారం ఇటుక ధరలు అమాంతం పెరగడంతో నిర్మాణంపై భారం పడింది. గతంలో వెయ్యి ఇటుక రూ.4,500 నుంచి రూ. 5,000 ఉంటేది. ప్రస్తుతం రూ.7,500లకు చేరింది. పేద, మధ్యతరగతి ప్రజలు ఎలా కొనుగోలుచేయాలి. ఎలా ఇల్లు కట్టుకోవాలి.– పి.సత్యనారాయణ, వేగేశ్వరపురం -
ఆరేళ్ల బాలికపై యువకుడి అత్యాచారం
తాళ్లపూడి: పశ్చిమగోదావరి జిల్లా పెద్దేవం గ్రామంలో ఆరేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. తాళ్లపూడి ఎస్సై కె.అశోక్‌కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దేవం గ్రామానికి చెందిన 3వ తరగతి చదువుతున్న ఆరేళ్ల బాలికపై ఇంట్లో ఎవరూ లేని సమయంలో మంగళవారం మధ్యాహ్నం ఎం.ఉదయ్‌కిరణ్ (20) అత్యాచారం చేశాడు. యువకుడిది బుట్టాయగూడెం కాగా అమ్మమ్మ గారింట్లో పెద్దేవం వచ్చి ఉంటున్నాడు. బాలిక ఇంటి సమీపంలోనే ఉదయ్‌కిరణ్ ఉంటున్నాడు. బాలిక తల్లి బయటకు వెళ్లిన సమయంలో బాలిక ఒంటరిగా ఉండడం చూసి ఈ దారుణానికి ఒడి గట్టాడు. తల్లి ఇంటికి వచ్చే సరికి బాలిక ఏడుస్తూ విషయం చెప్పింది. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. కొవ్వూరు డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రాణాలైనా ఇస్తాం..భూములివ్వం
తాళ్లపూడి: గోదావరి నదిపై నిర్మించనున్న చింతలపూడి ఎత్తిపోతల పథకానికి భూసేకరణ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన సర్వే పనులను రైతులు అడ్డుకోవడంతో తాళ్లపూడి మండలంలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సర్వే పనులను రైతులు అడ్డుకుంటారని ముందే ఊహించిన రెవెన్యూ అధికారులు పోలీసుల బందోబస్తుతో వచ్చారు. రైతులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా.. అధికారులు నేరుగా పోచవరం, రాగోలపల్లి, తాడిపూడి గ్రామాలకు చెందిన భూములను సర్వే చేయడం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న రైతులు సర్వే పనులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మూడు గంటలపాటు రైతులకు పోలీసులకు మధ్య తోపులాటలు, వాగ్వాదాలు జరిగాయి. ఎట్టకేలకు పోలీసులు సర్వే పనులను అడ్డుకుంటున్న రైతులను ఈడ్చుకుంటూ వెళ్లి జీపుల్లో పడేశారు. ఈ సందర్భంగా ఒకరిద్దరు రైతులు పురుగు మందు తాగుతామని డబ్బాలను చేతపట్టుకోవడంతో వెంటనే పోలీసులు వాటిని లాగేశారు. ప్రాణాలైనా ఇస్తాం కాని, భూములు మాత్రం ఇచ్చేదిలేదని రైతులు నినాదాలు చేశారు. చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భాగంగా పైప్‌లైన్ నిర్మాణం ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందు కోసం పోచవరం పంచాయతీలో 25 ఎకరాలు, తాడిపూడి పంచాయతీలో 29 ఎకరాలు సర్వే చేయాలని రెవెన్యూ అధికారులు నిర్ణయించారు. అయితే దీనిని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందువల్ల రైతులకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా సబ్ డివిజన్ పరిధిలోని ఐదుగురు సీఐలు, 10 మంది ఎస్సైలు, 100 మంది వరకు ఏఎస్సైలు, కానిస్టేబుళ్ల బందోబస్తుతో రెవెన్యూ అధికారులు, సర్వే బృందం పంట పొలాల్లోకి చేరుకుని సర్వే పనులు చేపట్టారు. విషయం తెలుసుకున్న భూములు కోల్పోతున్న రైతులు సర్వే ప్రాంతానికి పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈ సందర్భంగా రైతులు కాకర్ల వెంకటేశ్వరరావు, కాకర్ల మురళి,, బుల్లి సత్తులు, సతీష్, దుగ్గిరాల సత్యనారాయణ, గుల్లపూడి శివ, అనపర్తి సుబ్రమణ్యం తదితరులు మాట్లాడుతూ పోచవరం గ్రామంలో ఉన్న తాము చిన్న, సన్నకారు రైతులమని, గతంలో తాడిపూడి ఎత్తిపోతల పథకానికి భూములు కోల్పోయి ఉన్నామని, మరలా ఇప్పుడు చింతలపూడి ఎత్తిపోతల పథకంలో మిగిలి ఉన్న కాస్త భూమిని కూడా కోల్పోతున్నామని అవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కనీసం రైతుల అభిప్రాయాలను తెలుసుకోకుండా, పరిహారం విషయం అసలు తేల్చకుండా భూములు లాక్కోవడం పట్ల మండి పడ్డారు. చేలల్లో వరి, చెరకు తోటలు ఉన్నాయన్నారు. వరి చేలు కోత దశకు చేరుకున్నాయని తెలిపారు. భూములు ఇవ్వమని తేల్చిచెప్పారు. రైతులు ఎంతగా చెపుతున్నా పోలీసులు వినకుండా 23 మంది రైతులను (వీరిలో 8 మంది మహిళా రైతులు) అరెస్టు చేసి కొవ్వూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం పోలీసుల బందోబస్తుతో భూముల సర్వే కొనసాగించారు. ఈ సందర్భంగా కొవ్వూరు సీఐ శరత్‌రాజ్‌కుమార్ మాట్లాడుతూ భూముల సర్వే నిమిత్తం ఆర్డీఓ పోలీసుల రక్షణ కల్పించాలని కోరారన్నారు. ఇన్చార్జి తహసీల్దార్ నాగలక్ష్మమ్మ, డిప్యూటీ ఇన్స్పెక్టర్ సర్వేయర్ కె జాన్‌ప్రభాకర్, సర్వేయర్ జె కోటేశ్వరరావు సర్వే బృందంతో కలిసి భూములు సర్వే చేసి రాళ్లు వేశారు. రైతులకు మద్దతుగా తరలి వచ్చిన నాయకులు... చింతపూడి ఎత్తిపోతల పథకానికి భూములు ఇవ్వబోమని అంటున్న రైతులకు మద్దతుగా మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ కుంటముక్కల కేశవ నారాయణ, మండల యువజన విభాగం అధ్యక్షుడు వంబోలు పోసిబాబు, ఇతర నాయకులు అక్కడకు చేరుకుని తమ సంఘీభావం తెలిపారు. మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులతో పోలీసులు, అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. రైతులకు ఎక్కడైనా అన్యాయం, అవమానం జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి తీసుకువెళతానన్నారు. -
జీఎస్టీపై భయం వీడండి
తాళ్లపూడి: వ్యాపారుల్లో జీఎస్టీపై ఉన్న భయం వీడాలని, కొత్త చట్టంపై అవగాహన ముఖ్యమని వాణిజ్యపన్నుల శాఖ జిల్లా జాయంట్ కమిషనర్ టి.రాజశేఖర్ సూచించారు. వినియోగదారుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని ప్రక్కిలంకలో జీఎస్టీపై అవగాహన సదస్సు నిర్వహించారు. జీఎస్టీపై వ్యాపారులు, విద్యార్థుల సందేహలను జేసీ రాజశేఖర్ నివృత్తి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జీఎస్టీ రావడంతో కొందరు వ్యాపారాలను మానుకోవాలా అనుకుంటున్నారని ఇది సరికాదన్నారు. జీఎస్టీలో 5 శాతం నుంచి 12, 18, 28 శాతం వరకు పన్ను ఉందన్నారు. కొత్త విధానానికి వ్యాపారులు అలవాటు పడాలని సూచించారు. 17 రకాల పన్నులను కలిపి జీఎస్టీగా మార్చారన్నారు. వినియోగదారులకు తప్పనిసరిగా బిల్లు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. జిల్లా కార్యరద్శి ఎంఏ అన్సారీ, సీటీఓ కె.వెంకటేశ్వరరావు, మండల రైస్‌మిల్లర్స్ అధ్యక్షుడు సింహద్రి జనార్దనరావు, వినియోగదారుల పరిరక్షణ సమితి సభ్యులు అప్పన రాజా, కె.మోహన్, కూచిభట్ల ప్రసాద్, పరస రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వంటవాళ్లు, బ్యాండ్ మేళాన్ని బ్యాంక్‌కు తీసుకురండి
తాళ్లపూడి : రెండు రోజుల్లో కూతురి పెళ్లి.. పిలుపులు, పనులతో క్షణం ఊపిరి లేని వేళ.. ఆ దంపతులు బ్యాంకు వద్ద పడిగాపులు పడ్డారు. నగదు ఇప్పించాలని మేనేజర్ కాళ్లావేళ్లాపడ్డారు. అయినా ఆ మేనేజర్ కనికరించలేదు. పైగా ’పెళ్లి ఉన్నా.. నగదు ఇవ్వడం కుదరదు.. ఎవరెవరికీ చెల్లింపులు చేయాలో వారందరినీ తీసుకురండి’ అంటూ ఎగతాళిగా మాట్లాడారు. ఏం చేయాలో పాలుపోక ఆ తల్లిదండ్రులు తీవ్ర మనోవేదన అనుభవిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడికి చెందిన చక్కా నాగేశ్వరరావు, మహాలక్ష్మి దంపతుల కుమార్తె తేజస్వికి డిసెంబర్ 3న వివాహ ముహూర్తం నిశ్చయించారు. దీనికోసం మూడునెలల క్రితమే రూ.4 లక్షలు సమకూర్చుకుని ప్రక్కిలంక స్టేట్‌బ్యాంకులో డిపాజిట్ చేశారు. నగదు తీసుకోవడానికి ఆ దంపతులు వారం రోజులుగా బ్యాంకు చుట్టూ తిరుగుతున్నారు. ఉదయం వస్తే సాయంత్రం, సాయంత్రం వేస్తే రేపు రావాలంటూ ఆ బ్యాంకు బ్రాంచి మేనేజర్ రంగబాబు వారిని తిపుపతున్నారు. గట్టిగా అడిగితే ’పెళ్లయినా నగదు ఇవ్వడం కుదరదు. అయినా ఎవరెవరికి చెల్లించాలి? వంటవాళ్లు, కల్యాణమండపం, బ్యాండ్‌మేళం వారిని బ్యాంకుకు తీసుకురండి’ అంటూ వేళాకోళంగా మాట్లాడుతున్నారు. కేంద్రప్రభుత్వం పెళ్లిళ్లకు రూ.2.50 లక్షలు తీసుకునే వెసులుబాటు కల్పించినా మేనేజర్ ఇలా వ్యవహరించడంపై ఆ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెళ్లికి రెండు రోజులు కూడా సమయం లేదని, ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవడం లేదని మదనపడుతున్నారు. దీనిపై స్టేట్‌బ్యాంకు బ్రాంచి మేనేజర్ రంగబాబును వివరణ కోరగా, పెళ్లిళ్లకు నగదు ఇవ్వాలని తమకు ఆదేశాలు రాలేదని సమాధానం ఇచ్చారు. -
వాడు మాకెందుకు..?
మావోయిస్ట్ కిరణ్ తల్లిదండ్రులు తాళ్లపూడి: ఏవోబీలో జరిగిన ఎన్కౌంటర్లో తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామానికి చెందిన మావోయిస్ట్ గెడ్డం సువర్ణరాజు (కిరణ్) హతమయ్యాడన్న వార్త ఈ ప్రాంతంలో కలకలం రేపింది. కిరణ్ అతని తల్లిదండ్రులను విడిచి పెట్టి పదేళ్ల క్రితమే మావోయిస్ట్ ఉద్యమంలో చేరగా, అప్పటినుంచి ఒక్కసారి కూడా గ్రామానికి రాలేదని చెబుతున్నారు. అప్పటి నుంచి ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో తెలియదని కిరణ్ తండ్రి బ్రహ్మానందం, తల్లి అన్నమ్మ చెబుతున్నారు. అతడు ఎన్కౌంటర్లో మరణించిన విషయం తమకు తెలియదని మంగళవారం కలిసిన స్థానిక విలేకరులకు చెప్పారు. ఇకపై అతడు తిరిగొస్తాడన్న ఆశ కూడా తమకు లేదన్నారు. కిరణ్ తండ్రి బ్రహ్మానందం వయసు 70 సంవత్సరాలు పైబడింది. అతడి ఆరోగ్యం సహకరించడం లేదు. భార్య అన్నమ్మ ఆయాగా పనిచేస్తూ కుంటుంబాన్ని పోషిస్తోంది. తమ పెద్ద కొడుకు నరసింహరాజు 2009లో అకారణంగా హత్యకు గురయ్యాడని, రెండో కొడుకు కిరణ్ తమను వదిలేసి వెళ్లిపోవడంతో బకడం కూడా కష్టంగా ఉందని బ్రహ్మానందం, అన్నమ్మ కన్నీటి పర్యంతమవుతున్నారు. బ్రహ్మానందం కడుపులో కణుతులు రాగా, ఆపరేషన్ చేయించుకోవడానికి ఆర్థిక స్థోమత లేక ఇబ్బంది పడుతున్నారు. కుమారుడు కిరణ్ విషయమై బ్రహ్మానందం మాట్లాడుతూ.. ‘వాడి మరణ వార్తకు సంబంధించి ఎటువంటి సమాచారం మాకు అందలేదు. మమ్మల్ని అనాథలుగా వదిలి వెళ్లిపోయిన వాడు మాకెందుకు’ అని ఆవేదన చెందారు. -
హామీల అమలులో ప్రభుత్వాల నిర్లక్ష్యం
–కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి విమర్శ తాళ్లపూడి: ప్రత్యేక హోదాపై ద్రోహం, హమీల అమలులో వంచన, పాలనలో అన్నింటా వైఫల్యాలు ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రెండేళ్ల పాలన సాగించిన తీరని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్చార్జి పనబాక లక్ష్మి విమర్శించారు. మండలంలోని పెద్దేవంలో బుధవారం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తత స్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా పార్టీలు ఇచ్చిన లేఖలు, టీడీపీ, బీజేపీ రెండేళ్ల పాలన లోపాలను తెలుపుతూ రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ఐదేళ్లు కాదు పదేళ్లు హోదా కావాలని డిమాండ్ చేసిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, 15 ఏళ్లు హోదా ఇవ్వాలని తిరుపతి ఎన్నికల సభలో చంద్రబాబు డిమాండ్ చేశారని, వీరంతా ప్రసుత్తం ప్రజలను మోసం చేశారన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహించిన ప్రజాబ్యాలెట్లో 99 శాతం మంది ప్రత్యేక హోదా కావాలన్నారని, 97 శాతం మంది ఎన్నికల హమీలను ప్రభుత్వం అమలు చేయడంలేదని తీర్పు ఇచ్చారన్నారు. మాజీ ఎమ్మెల్సీ గంగాభవానీ, డీసీసీ అధ్యక్షుడు ఎండీ రఫీఉల్లాబేగ్ మాట్లాడుతూ పింఛన్లు, ఇళ్లు, ఇలా అన్ని సంక్షేమ పథకాలకు జన్మభూమి కమిటీలు చెప్పిన వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నారన్నారు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పాకలపాటి సుభద్ర, పీసీసీ కార్యదర్శులు గెడ్డం సాయిబాబా, జ్యేష్ట సతీష్, తాళ్లపూడి, కొవ్వూరు, చాగల్లు మండలాల అధ్యక్షులు పోసిన రాజారావు, వెంపాటి సూర్యారావు, గండ్రోతు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. హోదాపై మాటమార్చిన నేతలు అచ్చన్నపాలెం (నల్లజర్ల): ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రమంత్రులు వెంకయ్య, అరుణ్‌జైట్లీ మాట మార్చారని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్చార్జ్ పనబాక లక్ష్మి అన్నారు. గోపాలపురం నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం బుధవారం అచ్చన్నపాలెంలో కన్వీనర్ ఖండవల్లి కష్ణవేణి అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర విభజన విషయంలో అన్ని పార్టీలు లేఖలు అనుకూలంగా ఇచ్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టడం సరికాదన్నారు. కంబాల గంగాభవానీ, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అమర్ జహభేగం, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పెద్దిరెడ్డి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
దళిత వ్యతిరేక జీఓకు నిరసనగా నేడు ధర్నా
తాళ్లపూడి(కె.గంగవరం) : వెంకటాయపాలెం దళితుల శిరోముండనం కేసు విచారణకు వస్తున్న సమయంలో రెండు రోజుల ముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓను నిరసిస్తూ రామచంద్రపురంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహిస్తున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పెట్టా శ్రీనివాసరావు ప్రకటించారు. ఆయన, పార్టీ నాయకులు పండు గోవిందరాజు, బత్తుల అప్పారావు, జనిపెల్ల సాయి, చిల్లే నాగేశ్వరరావు, సాదే నారాయణమూర్తి ఆదివారం తాళ్లపూడిలో విలేకరులతో మాట్లాడారు. 20 ఏళ్లుగా స్టేలతో నడిపించుకు వస్తున్న శిరోముండనం కేసు ఎట్టకేలకు విచారణకు రాగా ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యేకు కొమ్ముకాస్తు జీవోను విడుదల చేసిందని ఆరోపించారు. ఎటువంటి కారణమూ లేకుండా పీపీని తొలగించడం ప్రభుత్వం అనుసరిస్తున్న దళిత వ్యతిరేక విధానాలను సూచిస్తోందన్నారు. ప్రభుత్వ చర్యను నిరసిస్తు సోమవారం రామచంద్రపురంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద జరిగే ధర్నాకు నియోజకవర్గంలోని దళితులు, దళిత సంఘాల నేతలు తరలిరావాలని వారు పిలుపునిచ్చారు. -
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం గజ్జెరం గ్రామంలో బుధవారం బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డెంగీ లక్షణాలతో యువకుడి మృతి
తాళ్లపూడి : మండలంలోని అన్నదేవరపేటలో ఓ యువకుడు డెంగీ లక్షణాలతో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపారు. ఇందిరమ్మకాలనీకి చెందిన పర్తిపాటి శ్రీకాంత్ (19) కొద్ది రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. అతని రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య పడిపోవడంతో నీరసించాడు. దీంతో అతనిని రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. అక్కడి నుంచి కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ.. సోమవారం మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అక్కడ డెంగీ లక్షణాలతోనే మృతిచెందాడని వివరించారు. వైద్య సిబ్బంది వివరాలను సేకరించి వెళ్లారు. గ్రామానికి చెందిన అంబేడ్కర్ యువజన సంఘాల నాయకులు, వైఎస్సార్ సీపీ నాయకులు పిట్టా శ్రీనివాస్ , పోలుమాటి విజయ్ ,అజయ్ తదితరులు శ్రీకాంత్ మృతికి సంతాపం తెలిపారు. -
వేగేశ్వరపురంలో బయల్పడిన పురాతన నాణేలు
తాళ్లపూడి : మండలంలోని వేగేశ్వరపురం ఛాయా సోమేశ్వరస్వామి ఆలయంలో ధ్వజ స్తంభం క్రింది భాగంలో అతి పురాతనమైన బ్రిటీష్ కాలం నాటి నాణేలు బయట పడ్డాయి. ధ్వజస్తంభ ప్రతిషా్ఠపన పూజలకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఈ నాణేలు బయటపడగా జాగ్రత్తగా సేకరించారు. 1832 నుంచి 1910 మధ్య కాలానికి చెందిన వెండి, రాగి, ఇత్తడి నాణేలుగా వీటిని స్థానికులు గుర్తించారు. బ్రిటీష్ వారి హయాంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ముద్రించినవిగా తెలుస్తున్నాయి. కింగ్ జార్జి, క్వీన్ విక్టోరియా, ఎడ్వర్డ్ చిత్రాలు వీటిపై ముద్రించి ఉన్నాయి. నాణేలపై ఒన్ క్వార్టర్ రూపి, ఒన్ ఫోర్త్ రూపీ అని కూడా ముద్రించి ఉంది. వీటిని మళ్లీ ధ్వజస్తంభం కింద వేయనున్నట్టు నిర్వాహకులు చెప్పారు. -
అనుమానాస్పదస్థితిలో యువకుడి మృతి
తాళ్లపూడి (పశ్చిమ గోదావరి జిల్లా) : తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామంలో తాటిపాక రాజేష్(18) అనే యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. జెస్సీ అనే తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీరిద్దరూ కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నట్లు యువకుడి బంధువులు ఆరోపిస్తున్నారు. అమ్మాయి తరఫు బంధువులు గతంలో రాజేష్‌ను బెదిరించినట్లుగా తెలుస్తోంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పార్టీలతో సంబంధం లేకుండా రుణాలు
తాళ్లపూడి : పార్టీలతో సంబంధం లేకుండా కాపులందరికీ రుణాలను అందించి వారి సంక్షేమానికి కృషి చేస్తామని రాష్ట్ర కాపు కార్పొరేషన్ డెరైక్టర్ యర్రా నవీన్ అన్నారు. మండలంలోని తాడిపూడిలో శనివారం ఆయన కాపు సంఘం నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాపులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వారి నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాపు కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందేందుకు ఈనెల 20తో గడువు ముగుస్తుందన్నారు. రుణాలు తీసుకున్న అనంతరం వాటిని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతమవ్వాలని ఆయన సూచించారు. లబ్ధిదారుల ఎంపికకు జన్మభూమి కమిటీలతో సంబంధం లేకుండా కొత్తగా ముగ్గురు సభ్యులు, ఎంపీడీవోతో కలిసి కమిటీలు వేయనున్నట్టు తెలిపారు. సమావేశంలో నవీన్‌ను కాపు సంఘం నాయకులు ఘనంగా సత్కరించారు. మండల కాపు సంఘం అధ్యక్షుడు నామా సూర్యప్రకాశం, కాపు సంఘం నాయకులు ఎం.సూర్యచంద్రరావు, ఎం.శ్రీనివాసరావు, శీర్ల సూర్యచంద్రం, శీలం రామచంద్రరావు, వంబోలు పోసిబాబు పాల్గొన్నారు. -
గోదావరిలో మునిగి యువకుడు మృతి
తాళ్లపూడి (పశ్చిమగోదావరి జిల్లా) : పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం సమీపంలోని గోదావరి నదిలో మునిగి ఓ యువకుడు మృతిచెందాడు. గోపాలపురం గ్రామానికి చెందిన నలుగురు యువకులు శనివారం సాయంత్రం ఈతకు వెళ్లారు. అయితే గోదావరి నదిలో లోతుకు వెళ్లడంతో హేమచంద్ర(21) అనే యువకుడు మృత్యువాతపడ్డాడు. మిగిలిన ముగ్గురు యువకులు అతణ్ణి కాపాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. మృతుడు హేమచంద్ర ఐటీఐ చేశాడని అతని మిత్రులు తెలిపారు. -
దొంగ అరెస్ట్ : భారీగా నగదు స్వాధీనం
ఏలూరు: గత కొంత కాలంగా పలు చోరీలకు పాల్పడి పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న ఓ దొంగను పోలీసులు మంగళవారం అరెస్ట్ పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం కొవ్వూరు తాలుకా తాళ్లపూడి గ్రామంలో అతడిని అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 28 కాసులు బంగారంతోపాటు రూ. 5.70 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సదరు దొంగపై పలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రుణమాఫీ.. రైతులకు నో హ్యాపీ
తాళ్లపూడి : రుణమాఫీపై ఇప్పటికీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా పంటలకు పెట్టుబడి పెట్టేందుకు రుణాలు అందేదారి లేక నానాపాట్లు పడుతున్నారు. బ్యాంకుల్లో తీసుకున్న పాత రుణాలు మాఫీ అవుతాయో లేదో తెలియక అన్నదాతలు అయోమయంలో ఉన్నారు. కుటుంబానికి లక్షన్నర మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటనలు చేస్తున్నారు తప్ప క్షేత్రస్థాయిలో రుణాల మాఫీపై బ్యాంకులకు ఎటువంటి హామీ ఇవ్వడం లేదు. దీంతో బ్యాంకులు, సొసైటీలు రుణాలు చెల్లించాలంటూ రైతులకు నోటీసులు జారీ చేస్తూనే ఉన్నాయి. సొసైటీల నుంచి రైతులకు నోటీసులు వ్యవసాయ రుణాలు 2013-14 ఏడాదికి గడువు తేదీ జూన్ 30తో ముగిసింది. దీంతో బ్యాంకులు రైతులు తీసుకున్న రుణాలు రాబట్టేందుకు చర్యలు ప్రారంభించాయి. గడువు ముగియడంతో రైతులకు 13 శాతం వరకు అదనంగా వడ్డీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. పాత రుణం చెల్లించే వరకు కొత్త రుణాలు ఇవ్వలేమని ఇప్పటికే స్పష్టం చేశాయి. ప్రభుత్వం, ఆర్బీఐ నుంచి రుణాలు మాఫీ విషయంలో ఎటువంటి ఆదేశాలు తమకు రాలేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. తాళ్లపూడి మండలంలోని ప్రక్కిలంక ఎస్బీఐ అధికారులు బంగారంపై తీసుకున్న వ్యవసాయ రుణాలకు రైతులకు ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా రైతుల పంట రుణాలు, డ్వాక్రా రుణాలు వెంటనే చెల్లించాలని, లేకుంటే చర్యలు తప్పవని ఆటో ద్వారా గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తోంది. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఇప్పుడు సొసైటీలూ బ్యాంకుల దారిలోనే నడుస్తున్నాయి. అన్నదేవరపేట, మలకపల్లి సహకార సంఘాలు బంగారు రుణాలు తీసుకున్న రైతులకు నోటీసులు జారీ చేశాయి. అన్నదేవరపేట సొసైటీలో 2012-2014 వరకు బంగారంపై 500 మంది రైతులు రూ.1.50 కోట్లు రుణాలు తీసుకున్నారు. పంట రుణాలు 1,200 మంది రూ.6 కోట్లు వరకు తీసుకున్నారు. బంగారంపై రుణాలు తీసుకున్న వారిలో వంద మందికి నోటీసులు ఇచ్చారు. మలకపల్లి సొసైటీ నుంచి, ప్రక్కిలంక ఎస్బీఐ నుంచి 2011-12లో బంగారంపై 611 మంది రైతులకు రూ.4.11 కోట్లు, 2012-13లో 511 మందికి రూ.3.19 కోట్లు, 2012-13లో పంట రుణాలు కింద 431 మంది రూ.2.67 కోట్లు రుణాలుగా తీసుకున్నారు. బంగారంపై తీసుకున్న రుణాలకు నోటీసులు జారీ చేశారు. ఇతర సొసైటీలూ రైతులకు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం రుణమాఫీపై బ్యాంకులకు, సొసైటీలకు స్పష్టంగా ఆదేశాలివ్వాలని రైతులు కోరుతున్నారు. సొసైటీ నుంచి నోటీసు పంపించారు అన్నదేవరపేట సొసైటీలో రెండు దఫాలుగా బంగారంపై రూ.72 వేలు, రూ.19,200 పంట రుణం తీసుకున్నాను. రుణాలు చెల్లించాలని నోటీసు పంపించారు. ప్రభుత్వం రుణమాఫీపై స్పష్టత ఇవ్వకపోవడంతో రుణం చెల్లించాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. - నార్ని వెంకన్నబాబు, రైతు, అన్నదేవరపేట రుణం చెల్లించాలంటూ ఒత్తిడి ప్రక్కిలంక ఎస్బీఐలో రూ.20 వేలు కౌలు రైతు కార్డుపై రుణం తీసుకున్నాను. బ్యాంకు నుంచి నోటీసు వచ్చింది. ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నాం. బ్యాంకు నుంచి మాత్రం నోటీసులు ఇచ్చి రుణం చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారు. - లింగంపల్లి వీరవెంకటరావు, రైతు, అన్నదేవరపేట బ్యాంకుల నుంచి ఒత్తిడి రాకుండా చూడాలి రైతులు తీసుకున్న రుణాల విషయంలో బ్యాంకుల నుంచి ఒత్తిడి రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రుణమాఫీ అమలుకు సంబంధించి ప్రభుత్వం స్పష్టంగా బ్యాంకులకు, సొసైటీలకు మర్గదర్శకాలను విడుదల చేసి రుణ ఒత్తిడి లేకుండా చేయాలి. - కె.సూర్యనారాయణ, రైతు, అన్నదేవరపేట -
రుణాలు కడితే సరి.. లేదంటే చర్యలే మరి
ప్రభుత్వం రేపోమాపో రుణాలు మాఫీ చేస్తుందని కోటి ఆశలతో ఎదురుచూస్తున్న రైతులు, డ్వాక్రా మహిళలకు నిరాశే ఎదురవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు డ్వాక్రా, పంట రుణాలు రద్దు చేస్తామని పైకి చెబుతున్నా.. వీలైనంత త్వరగా వసూలు చేసుకోవాలని బ్యాంకులకు ఆదేశాలు రావడంతో బ్యాంకర్లు వసూళ్ల కోసం రోడ్డెక్కుతున్నారు. నిన్నయిన్నటి వరకూ రైతులు, డ్వాక్రా మహిళలకు నోటీసులు ఇస్తూ.. వారి సెల్ఫోన్లకు ఎస్ఎంఎస్లు పంపుతూ వచ్చిన బ్యాంక్ అధికారులు తాజాగా తక్షణమే రుణాలు చెల్లించాలంటూ ఎక్కడికక్కడ బోర్డులు పెడుతున్నారు. అక్కడితో ఆగకుండా ఊరూరా ఆటోల్లో ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. తాళ్లపూడి మండలం ప్రక్కిలంక స్టేట్ బ్యాంకులో వ్యవసాయ అవసరాల నిమిత్తం తీసుకున్న రుణాలను, బంగారు ఆభరణాలపై తీసుకున్న, మహిళలు తీసుకున్న డ్వాక్రా రుణాలను గడువులోగా చెల్లించి ఆర్బీఐ సూచనల ప్రకారం ప్రకారం వడ్డీ, రాయితీలు వినియోగించుకోవాలని చెబుతున్నారు. లేదంటే చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారని హెచ్చరిస్తున్నారు. దీంతో రైతులు, డ్వాక్రా మహిళల్లో ఆందోళన మొదలైంది. ఏంచేయాలో పాలుపోవడం లేదని వారంతా వాపోతున్నారు. తాళ్లపూడి -
లారీ - కారు ఢీ: ఇద్దరు మృతి
గుంటూరు జిల్లాలోని వినుకొండ మండలం విఠంరాజుపల్లి వద్ద ఈ రోజు తెల్లవారుజామున లారీ - కారు ఢీ కొన్నాయి. ఆ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిలో వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి 108కి సమాచారం అందించారు. ఆ వాహనంలో క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మరణించిన ఆ రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకుని గుంటురు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లాలోని తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం వద్ద స్కూల్ బస్సును లారీ ఢీ కొట్టింది. ఆ ఘటనలో పలువురు విద్యార్థులు గాయాలపాలైయ్యారు. దాంతో ఆ విద్యార్థులను అత్యవసర ప్రాధమిక చికిత్స నిమిత్తం కోవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఆ ఘటనపై నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.