వంటవాళ్లు, బ్యాండ్ మేళాన్ని బ్యాంక్‌కు తీసుకురండి | currency strrugles | Sakshi
Sakshi News home page

వంటవాళ్లు, బ్యాండ్ మేళాన్ని బ్యాంక్‌కు తీసుకురండి

Published Thu, Dec 1 2016 1:38 AM | Last Updated on Mon, Sep 4 2017 9:32 PM

వంటవాళ్లు, బ్యాండ్ మేళాన్ని బ్యాంక్‌కు తీసుకురండి

వంటవాళ్లు, బ్యాండ్ మేళాన్ని బ్యాంక్‌కు తీసుకురండి

తాళ్లపూడి : రెండు రోజుల్లో కూతురి పెళ్లి.. పిలుపులు, పనులతో క్షణం ఊపిరి లేని వేళ.. ఆ దంపతులు బ్యాంకు వద్ద పడిగాపులు పడ్డారు. నగదు ఇప్పించాలని మేనేజర్‌ కాళ్లావేళ్లాపడ్డారు. అయినా ఆ మేనేజర్‌ కనికరించలేదు. పైగా ’పెళ్లి ఉన్నా.. నగదు ఇవ్వడం కుదరదు.. ఎవరెవరికీ చెల్లింపులు చేయాలో వారందరినీ తీసుకురండి’ అంటూ ఎగతాళిగా మాట్లాడారు. ఏం చేయాలో పాలుపోక ఆ తల్లిదండ్రులు తీవ్ర మనోవేదన అనుభవిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడికి చెందిన చక్కా నాగేశ్వరరావు, మహాలక్ష్మి దంపతుల కుమార్తె తేజస్వికి డిసెంబర్‌ 3న వివాహ ముహూర్తం నిశ్చయించారు. దీనికోసం మూడునెలల క్రితమే రూ.4 లక్షలు సమకూర్చుకుని ప్రక్కిలంక స్టేట్‌బ్యాంకులో డిపాజిట్‌ చేశారు.

నగదు తీసుకోవడానికి ఆ దంపతులు వారం రోజులుగా బ్యాంకు చుట్టూ తిరుగుతున్నారు. ఉదయం వస్తే సాయంత్రం, సాయంత్రం వేస్తే రేపు రావాలంటూ ఆ బ్యాంకు బ్రాంచి మేనేజర్‌ రంగబాబు వారిని తిపుపతున్నారు. గట్టిగా అడిగితే ’పెళ్లయినా నగదు ఇవ్వడం కుదరదు. అయినా ఎవరెవరికి చెల్లించాలి? వంటవాళ్లు, కల్యాణమండపం, బ్యాండ్‌మేళం వారిని బ్యాంకుకు తీసుకురండి’ అంటూ వేళాకోళంగా మాట్లాడుతున్నారు. కేంద్రప్రభుత్వం పెళ్లిళ్లకు రూ.2.50 లక్షలు తీసుకునే వెసులుబాటు కల్పించినా మేనేజర్‌ ఇలా వ్యవహరించడంపై ఆ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెళ్లికి రెండు రోజులు కూడా సమయం లేదని, ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవడం లేదని మదనపడుతున్నారు. దీనిపై స్టేట్‌బ్యాంకు బ్రాంచి మేనేజర్‌ రంగబాబును వివరణ కోరగా, పెళ్లిళ్లకు నగదు ఇవ్వాలని తమకు ఆదేశాలు రాలేదని సమాధానం ఇచ్చారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement