రుణాలు కడితే సరి.. లేదంటే చర్యలే మరి
ప్రభుత్వం రేపోమాపో రుణాలు మాఫీ చేస్తుందని కోటి ఆశలతో ఎదురుచూస్తున్న రైతులు, డ్వాక్రా మహిళలకు నిరాశే ఎదురవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు డ్వాక్రా, పంట రుణాలు రద్దు చేస్తామని పైకి చెబుతున్నా.. వీలైనంత త్వరగా వసూలు చేసుకోవాలని బ్యాంకులకు ఆదేశాలు రావడంతో బ్యాంకర్లు వసూళ్ల కోసం రోడ్డెక్కుతున్నారు. నిన్నయిన్నటి వరకూ రైతులు, డ్వాక్రా మహిళలకు నోటీసులు ఇస్తూ.. వారి సెల్‌ఫోన్లకు ఎస్‌ఎంఎస్‌లు పంపుతూ వచ్చిన బ్యాంక్ అధికారులు తాజాగా తక్షణమే రుణాలు చెల్లించాలంటూ ఎక్కడికక్కడ బోర్డులు పెడుతున్నారు.
అక్కడితో ఆగకుండా ఊరూరా ఆటోల్లో ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. తాళ్లపూడి మండలం ప్రక్కిలంక స్టేట్ బ్యాంకులో వ్యవసాయ అవసరాల నిమిత్తం తీసుకున్న రుణాలను, బంగారు ఆభరణాలపై తీసుకున్న, మహిళలు తీసుకున్న డ్వాక్రా రుణాలను గడువులోగా చెల్లించి ఆర్‌బీఐ సూచనల ప్రకారం ప్రకారం వడ్డీ, రాయితీలు వినియోగించుకోవాలని చెబుతున్నారు. లేదంటే చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారని హెచ్చరిస్తున్నారు. దీంతో రైతులు, డ్వాక్రా మహిళల్లో ఆందోళన మొదలైంది. ఏంచేయాలో పాలుపోవడం లేదని వారంతా వాపోతున్నారు.
తాళ్లపూడి