ఆ నోట్లు నేరుగా వెళ్లే అవకాశం లేదు
శేఖర్‌రెడ్డికి 2 వేల నోట్ల చేరికపై బ్యాంకు వర్గాల వివరణ
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోని ఏ చెస్ట్ శాఖ నుంచైనా కొత్త 2 వేల నోట్లు టీటీడీ మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డికి చేరి ఉండొచ్చని.. విశాఖ ‘స్కేప్’ నుంచి నేరుగా వెళ్లే అవకాశం లేదని బ్యాంక్ వర్గాలు పేర్కొంటున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం రూ.500, వెయ్యి నోట్ల రద్దుకు ముందు రోజు నవంబర్ 7న రిజర్వు బ్యాంక్ నుంచి విశాఖ స్కేప్‌కు కొత్త రూ.2 వేల నోట్లు వచ్చాయి. ఏపీ జిల్లాలకు ఈ నోట్లనే పంపిణీ చేయాలి. ఈ సొమ్మును ఆర్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ సమక్షంలో పంపిణీ చేస్తారు.
నవంబర్ 7న ఆర్బీఐ నుంచి వచ్చిన రూ.కొత్త 2 వేల నోట్లను కూడా ఆయన సమక్షంలోనే రాష్ట్రంలోని వివిధ జిల్లాల చెస్ట్ శాఖలకు వ్యాన్లు, లారీల్లో పంపిణీ చేసినట్టు స్టేట్ బ్యాంక్ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. రాష్ట్రంలోని ఏ చెస్ట్ శాఖ నుంచైనా ఈ సొమ్ము శేఖర్‌రెడ్డికి చేరి ఉండొచ్చని.. విశాఖ నుంచి నేరుగా వెళ్లే అవకాశం లేదని పేర్కొన్నాయి. మరోవైపు శేఖర్‌రెడ్డి అక్రమ నగదు నిల్వలపై ఆదాయపు పన్ను అధికారులు ఇప్పటివరకు విశాఖలోని స్కేప్ అధికారులను విచారించలేదని బ్యాంకు వర్గాలు తెలిపాయి.