వాడు మాకెందుకు..?
మావోయిస్ట్ కిరణ్ తల్లిదండ్రులు
తాళ్లపూడి: ఏవోబీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామానికి చెందిన మావోయిస్ట్ గెడ్డం సువర్ణరాజు (కిరణ్) హతమయ్యాడన్న వార్త ఈ ప్రాంతంలో కలకలం రేపింది. కిరణ్ అతని తల్లిదండ్రులను విడిచి పెట్టి పదేళ్ల క్రితమే మావోయిస్ట్ ఉద్యమంలో చేరగా, అప్పటినుంచి ఒక్కసారి కూడా గ్రామానికి రాలేదని చెబుతున్నారు. అప్పటి నుంచి ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో తెలియదని కిరణ్ తండ్రి బ్రహ్మానందం, తల్లి అన్నమ్మ చెబుతున్నారు. అతడు ఎన్‌కౌంటర్‌లో మరణించిన విషయం తమకు తెలియదని మంగళవారం కలిసిన స్థానిక విలేకరులకు చెప్పారు. ఇకపై అతడు తిరిగొస్తాడన్న ఆశ కూడా తమకు లేదన్నారు.
కిరణ్ తండ్రి బ్రహ్మానందం వయసు 70 సంవత్సరాలు పైబడింది. అతడి ఆరోగ్యం సహకరించడం లేదు. భార్య అన్నమ్మ ఆయాగా పనిచేస్తూ కుంటుంబాన్ని పోషిస్తోంది. తమ పెద్ద కొడుకు నరసింహరాజు 2009లో అకారణంగా హత్యకు గురయ్యాడని, రెండో కొడుకు కిరణ్ తమను వదిలేసి వెళ్లిపోవడంతో బకడం కూడా కష్టంగా ఉందని బ్రహ్మానందం, అన్నమ్మ కన్నీటి పర్యంతమవుతున్నారు. బ్రహ్మానందం కడుపులో కణుతులు రాగా, ఆపరేషన్ చేయించుకోవడానికి ఆర్థిక స్థోమత లేక ఇబ్బంది పడుతున్నారు. కుమారుడు కిరణ్ విషయమై బ్రహ్మానందం మాట్లాడుతూ.. ‘వాడి మరణ వార్తకు సంబంధించి ఎటువంటి సమాచారం మాకు అందలేదు. మమ్మల్ని అనాథలుగా వదిలి వెళ్లిపోయిన వాడు మాకెందుకు’ అని ఆవేదన చెందారు.