తాళ్లపూడి: గోదావరి నదిపై నిర్మించనున్న చింతలపూడి ఎత్తిపోతల పథకానికి భూసేకరణ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన సర్వే పనులను రైతులు అడ్డుకోవడంతో తాళ్లపూడి మండలంలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సర్వే పనులను రైతులు అడ్డుకుంటారని ముందే ఊహించిన రెవెన్యూ అధికారులు పోలీసుల బందోబస్తుతో వచ్చారు. రైతులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా.. అధికారులు నేరుగా పోచవరం, రాగోలపల్లి, తాడిపూడి గ్రామాలకు చెందిన భూములను సర్వే చేయడం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న రైతులు సర్వే పనులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మూడు గంటలపాటు రైతులకు పోలీసులకు మధ్య తోపులాటలు, వాగ్వాదాలు జరిగాయి. ఎట్టకేలకు పోలీసులు సర్వే పనులను అడ్డుకుంటున్న రైతులను ఈడ్చుకుంటూ వెళ్లి జీపుల్లో పడేశారు. ఈ సందర్భంగా ఒకరిద్దరు రైతులు పురుగు మందు తాగుతామని డబ్బాలను చేతపట్టుకోవడంతో వెంటనే పోలీసులు వాటిని లాగేశారు. ప్రాణాలైనా ఇస్తాం కాని, భూములు మాత్రం ఇచ్చేదిలేదని రైతులు నినాదాలు చేశారు.
చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భాగంగా పైప్‌లైన్ నిర్మాణం ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందు కోసం పోచవరం పంచాయతీలో 25 ఎకరాలు, తాడిపూడి పంచాయతీలో 29 ఎకరాలు సర్వే చేయాలని రెవెన్యూ అధికారులు నిర్ణయించారు. అయితే దీనిని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందువల్ల రైతులకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా సబ్ డివిజన్ పరిధిలోని ఐదుగురు సీఐలు, 10 మంది ఎస్సైలు, 100 మంది వరకు ఏఎస్సైలు, కానిస్టేబుళ్ల బందోబస్తుతో రెవెన్యూ అధికారులు, సర్వే బృందం పంట పొలాల్లోకి చేరుకుని సర్వే పనులు చేపట్టారు. విషయం తెలుసుకున్న భూములు కోల్పోతున్న రైతులు సర్వే ప్రాంతానికి పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈ సందర్భంగా రైతులు కాకర్ల వెంకటేశ్వరరావు, కాకర్ల మురళి,, బుల్లి సత్తులు, సతీష్, దుగ్గిరాల సత్యనారాయణ, గుల్లపూడి శివ, అనపర్తి సుబ్రమణ్యం తదితరులు మాట్లాడుతూ పోచవరం గ్రామంలో ఉన్న తాము చిన్న, సన్నకారు రైతులమని, గతంలో తాడిపూడి ఎత్తిపోతల పథకానికి భూములు కోల్పోయి ఉన్నామని, మరలా ఇప్పుడు చింతలపూడి ఎత్తిపోతల పథకంలో మిగిలి ఉన్న కాస్త భూమిని కూడా కోల్పోతున్నామని అవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం కనీసం రైతుల అభిప్రాయాలను తెలుసుకోకుండా, పరిహారం విషయం అసలు తేల్చకుండా భూములు లాక్కోవడం పట్ల మండి పడ్డారు. చేలల్లో వరి, చెరకు తోటలు ఉన్నాయన్నారు. వరి చేలు కోత దశకు చేరుకున్నాయని తెలిపారు. భూములు ఇవ్వమని తేల్చిచెప్పారు. రైతులు ఎంతగా చెపుతున్నా పోలీసులు వినకుండా 23 మంది రైతులను (వీరిలో 8 మంది మహిళా రైతులు) అరెస్టు చేసి కొవ్వూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం పోలీసుల బందోబస్తుతో భూముల సర్వే కొనసాగించారు. ఈ సందర్భంగా కొవ్వూరు సీఐ శరత్‌రాజ్‌కుమార్ మాట్లాడుతూ భూముల సర్వే నిమిత్తం ఆర్డీఓ పోలీసుల రక్షణ కల్పించాలని కోరారన్నారు. ఇన్‌చార్జి తహసీల్దార్ నాగలక్ష్మమ్మ, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ సర్వేయర్ కె జాన్‌ప్రభాకర్, సర్వేయర్ జె కోటేశ్వరరావు సర్వే బృందంతో కలిసి భూములు సర్వే చేసి రాళ్లు వేశారు.
రైతులకు మద్దతుగా తరలి వచ్చిన నాయకులు...
చింతపూడి ఎత్తిపోతల పథకానికి భూములు ఇవ్వబోమని అంటున్న రైతులకు మద్దతుగా మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ కుంటముక్కల కేశవ నారాయణ, మండల యువజన విభాగం అధ్యక్షుడు వంబోలు పోసిబాబు, ఇతర నాయకులు అక్కడకు చేరుకుని తమ సంఘీభావం తెలిపారు. మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులతో పోలీసులు, అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. రైతులకు ఎక్కడైనా అన్యాయం, అవమానం జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి తీసుకువెళతానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment