గజ్వేల్, న్యూస్‌లైన్: మరికొద్ది సేపట్లో బాజాభజంత్రీలు మోగాల్సిన ఆ పెళ్లి మండపంలో.. ఒక్కసారిగా విచారం అలుముకుంది. తాళి కట్టాల్సిన వరుడు మొహం చాటేశాడు. వధువు బంధువులు వరుడి తల్లిని నిలదీయగా ఎక్కడికి వెళ్లాడో తెలియదని చేతులెత్తేసింది. దీంతో ఉద్రిక్తత నెలకొంది. సాయంత్రం వరకు వరుడి కోసం ఎదురుచూసినా ఎంతకీ రాకపోవడంతో చివరకు వివాహాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో వధువు బంధువులు విచారంలో మునిగిపోయారు. ఈ సంఘటన గజ్వేల్‌లో ఆదివారం చోటుచేసుకుంది.
గజ్వేల్ నియోజకవర్గంలోని ఓ గ్రామానికి చెందిన యువతికి సికింద్రాబాద్ ఆర్‌కే పురానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అరుణ కుమారుడు విజయ్‌రెడ్డితో పెళ్లి కుదిరింది. ఇతను హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేఎండబ్ల్యూ సాఫ్ట్‌వేర్ కంపెనీలో హెచ్‌ఆర్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. వివాహాన్ని పురస్కరించుకుని వధువు తల్లిదండ్రులు అతనికి భారీగానే కట్నకానుకలను సమర్పించుకున్నారు. ఆదివారం స్థానికంగా ఉన్న ఓ ఫంక్షన్ హాలులో మధ్యాహ్నం వివాహం జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఆనవాయితీ ప్రకారం ఆదివారం తెల్లవారుజామున వరుడిని తీసుకురావడానికి వధువు తరపు బంధువులు ఆర్‌కే పురానికి వెళ్లారు.
కానీ అక్కడ ఒక్కసారిగా సీను మారింది. ఏం జరిగిందో తెలియదు కానీ వరుడు అప్పటికే ఆ ఇంట్లోంచి పరారయ్యాడు. దీంతో వారు ఏం చేయాలో తెలియక వరుడి తల్లి అరుణ, సోదరి స్వప్నతో మరో అమ్మాయి, కొందరు బంధువులను తీసుకొని ఇక్కడికి వచ్చారు. వారంతా పెళ్లి సమయానికి విజయ్‌రెడ్డి వస్తాడని నమ్మబలికారు. తాళి కట్టే సమయానికైనా విజయ్‌రెడ్డి రావచ్చనే ఆశతో ఇక్కడ ఏర్పాట్లు పూర్తి చేశారు. మండపాన్ని తీర్చిదిద్దడమే కాకుండా భోజనాలకు కూడా ఏర్పాట్లు చేశారు. సాయంత్రం వరకు కూడా వరుడి జాడ లేదు. ఫోన్ చేసినా కలవలేదు. అతని తల్లిని, బంధువులను నిలదీస్తే తమకేం తెలియదని చేతులెత్తేశారు.
వారిపై వధువు తరపు బంధువులు తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా వరుడి తరపు బంధువులపై దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన కల్యాణ మండపం వద్దకు చేరుకుని వారిని శాంతింపజేశారు. మొత్తానికి పెళ్లి ఆగిపోవడంతో వధువు తల్లిదండ్రులు, బంధువులు విచారంలో మునిగిపోయారు. గజ్వేల్ ఎస్‌ఐ ఆంజనేయులును వివరణ కోరగా వధువు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
చెదిరిన ‘పెళ్లి కళ’
Published Sun, Feb 9 2014 11:44 PM | Last Updated on Sat, Sep 2 2017 3:31 AM
Advertisement
Advertisement