పై తరగతులకు పటిష్టమైన అడుగులు | Bridge course for school children | Sakshi
Sakshi News home page

పై తరగతులకు పటిష్టమైన అడుగులు

Published Wed, Feb 26 2020 5:16 AM | Last Updated on Wed, Feb 26 2020 8:01 AM

Bridge course for school children - Sakshi

సాక్షి, అమరావతి: ఒక తరగతి నుంచి మరో తరగతిలోకి వెళ్లే విద్యార్థుల్లో అవసరమైన ప్రమాణాలు, నైపుణ్యాలుంటేనే పై క్లాసుల్లోని పాఠ్యాంశాలను సులభంగా నేర్చుకోగలుగుతారు. కింది తరగతుల్లోని అంశాల్లో అవగాహన పెంచుకుని ఉంటే పై తరగతుల్లోని అంశాలు సులభంగా ఆకళింపు చేసుకోగల్గుతారు. కానీ, ఇప్పటివరకు విద్యార్థులకు సరిపడ హాజరు ఉంటే చాలు.. పై తరగతుల్లోకి పంపించేస్తున్నారు. దీనివల్ల తరగతులు పెరుగుతున్నా విద్యార్థుల్లో ప్రమాణాలు పెరగడంలేదు. ఈ నేపథ్యంలో.. విద్యార్థుల్లోని సామర్థ్యాలు ఏ మేరకు ఉన్నాయో ముందే పరిశీలించి లోపాలుంటే వాటిని సరిచేసి పై తరగతులకు పంపించేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని చేపడుతోంది.

మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 23 వరకు శిక్షణ
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న 17,70,341 మంది విద్యార్థులకు బ్రిడ్జి కోర్సు కింద ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 23 వరకు ఈ కోర్సు ఉంటుంది. విద్యార్థుల్లో ప్రస్తుత తరగతుల్లోని అంశాలను అవగాహన చేసుకోవడంలో ఏమైనా లోపాలుంటే వాటిని సవరిస్తారు. అలాగే, ఆ తరగతుల్లోని పాఠ్యాంశాలపైనా క్షుణ్ణమైన అవగాహన కలిగి ఉండేలా తీర్చిదిద్దుతారు. ముఖ్యంగా తెలుగు, ఇంగ్లిష్, గణితం, పర్యావరణ అంశాలపై బోధన ఉంటుంది. సాధారణ తరగతుల మాదిరి కాకుండా ఆటపాటల ద్వారా పిల్లలకు ఆసక్తికరమైన రీతిలో ఈ 30 రోజులపాటు బోధన చేపడతారు.

ఏ రోజున ఏ కార్యక్రమం చేపట్టాలో సవివరమైన ప్రణాళికను పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు విడుదల చేశారు. 14 థీములలో శిక్షణ అంశాలను రూపొందించారు. ఒక్కో థీమును రెండు రోజులపాటు బోధిస్తారు. పాటలు, కథలు, ఆటలు వంటి కార్యక్రమాల ద్వారా ఆయా అంశాలను నేర్పిస్తారు. ఈ కార్యక్రమంలో 94,805 మంది టీచర్లను భాగస్వాములుగా చేస్తున్నారు. ఈ కోర్సుకు సంబంధించి పిల్లలకు, స్కూళ్లకు ప్రత్యేకంగా టీఎల్‌ఎం (టీచింగ్, లెర్నింగ్‌ మెథడాలజీ) కిట్లను సరఫరా చేస్తున్నారు. విద్యార్థుల కిట్‌కు రూ.200 చొప్పున, స్కూల్‌ కిట్‌కు రూ.1,500 చొప్పున వ్యయం చేస్తున్నారు. ఆడియో వీడియో బోధనకు వీలుగా విద్యార్థులకు టీవీలు, డీవీడీలు, ఇంటర్నెట్‌ సదుపాయాలను కూడా కల్పిస్తున్నారు. 

లక్ష్యాలు ఇవీ..
- భాషకు సంబంధించి అక్షరాలపై స్పష్టత, వినడం, మాట్లాడడం, చదవడం, రాయడంపై దృష్టి పెడతారు.
- గణితం, పర్యావరణ విద్యలో అంకెలు సంబంధిత అంశాలలో విద్యార్థులకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరిస్తారు.
ఆనందాన్ని పంచే కార్యక్రమాలతో కూడిన బోధన ద్వారా విద్యార్థులకు ఆయా అంశాలను నేర్పిస్తారు.
- వినడం, మాట్లాడడం తదితర అంశాల్లో ఆడియో విజువల్‌ పద్ధతులను అనుసరిస్తారు.
- తొలిరోజు ఆయా తరగతుల్లోని పిల్లల స్థాయిలను తెలుసుకుంటారు.
- తదుపరి మార్చి 17 నుంచి ఏప్రిల్‌ 21 వరకు పిల్లలతో వివిధ కార్యక్రమాలు చేపడతారు.
- ఏప్రిల్‌ 22న పిల్లల్లో కొత్తగా పెరిగిన సామర్థ్యాలను గుర్తిస్తారు.
ఏప్రిల్‌ 23 చివరి రోజున తల్లిదండ్రులు, టీచర్ల సమావేశాలు నిర్వహించి తగిన సూచనలు అందిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement