గుప్తనిధుల వేటలో అన్నాచెల్లెళ్ల మృతి | brother and sister died in secret treasury searching | Sakshi
Sakshi News home page

గుప్తనిధుల వేటలో అన్నాచెల్లెళ్ల మృతి

Published Fri, Dec 27 2013 3:31 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM

brother and sister died in secret treasury searching

 వి. బొంతిరాళ్ల (డోన్‌టౌన్)/శంషాబాద్: రూరల్: ఆ యువతికి భక్తిభావమెక్కువ.. జ్యోతిష్యం కూడా తెలుసు. ఆమె అన్న ఓ ల్యాబ్ టెక్నీషియన్. వీరిద్దరికీ ఉన్నట్టుండి ఓ పెద్ద ఆశ కలిగింది. జీవితంలో ఒకేసారి ధనవంతులమైపోదామనుకున్నారు. తలుపుతట్టిన అవకాశాన్ని వదులుకోకుండా గుప్తనిధుల ముఠాతో చేతులు కలిపారు. మూఢనమ్మకాలపై ఉన్న విశ్వాసంతో తమ జీవితాలనే బలి పెట్టారు. నిధుల వేటలో మృత్యు ఒడికి చేరుకున్నారు. వివరాలు.. రంగారెడ్డి జిల్లా పాల్మాకుల గ్రామానికి చెందిన బుర్ర నర్సింహ, నాగమ్మ దంపతులకు కుమారుడు నాగరాజు(25), నలుగురు కుమార్తెలు ఉన్నారు. నాగరాజు డిగ్రీ పూర్తి చేసి నగరంలోని కింగ్‌కోఠి కామినేని ఆస్పత్రిలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు.

 ఇతడి పెద్ద చెల్లి రమాదేవి(21) పదో తరగతి వరకు చదువుకుంది. ఈమె మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం నందిగాంలో ఉన్న సన్‌చైన్ ప్లాస్టిక్ కంపెనీలో  రోజూ కూలీగా పని చేస్త్తోంది. రమాదేవి జ్యోతిష్యం కూడా చెబుతుండేది. ఈక్రమంలో ఆమె పలువురికి పరిచయం అయింది. కర్నూలు జిల్లా డోన్, హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన గుప్తనిధుల ముఠా సభ్యులు రమాదేవి గురించి విన్నారు. హైదరాబాద్ అంబర్‌పేటకు చెందిన కరాటే మాస్టర్ రాధాకృష్ణ వద్ద శిక్షణ తీసుకొని నాగరాజు బ్లాక్ బెల్ట్ సాధించాడు. ఈక్రమంలో వీరిద్దరూ సన్నిహితులయ్యారు. తమ ప్రాంతంలో కోట్ల రూపాయలు విలువ చేసే గుప్త నిధులు ఉన్నాయని, వాటి రహస్యం రమాదేవితో చెప్పించాలని కొందరు నాగరాజును పట్టుబట్టారు. దొరికే నిధిలో ఒకవంతు భాగాన్ని ఇస్తామని చెప్పడంతో ధనవంతులం అవుతామని అన్నాచెల్లెళ్లు అంగీకరించారు.

బుధవారం మధ్యాహ్నం పాల్మాకుల నుంచి ప్రెస్ స్టిక్కర్ ఉన్న కారులో వీరు డోన్‌కు వచ్చారు. కర్నూలు నుంచి జేసీబీని తెచ్చిన ముఠా సభ్యులు వీరిని వెంటబెట్టుకొని బుధవారం అర్ధరాత్రి బొంతిరాళ్ల గ్రామ శివార్లలోని కంది పొలాల్లోకి వెళ్లారు. తమతో తెచ్చుకున్న సామగ్రితో పూజలు చేసి జేసీబీతో నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. శబ్దం రావడంతో సమీప పొలాల్లోని రైతులు ఘటనా స్థలానికి టార్చిలైట్లతో చేరుకొని వారిని చుట్టుముట్టారు. కేకలు వేస్తూ జేసీబీపై రాళ్లురువ్వారు. దీంతో హడలెత్తిపోయిన ముఠాసభ్యులు పరారయ్యేందుకు పరుగులు తీశారు. డ్రైవర్ భయంతో ఇష్టానుసారంగా జేసీబీని తిప్పాడు. దీంతో గట్టుకింద నక్కిఉన్న నాగరాజు, రమాదేవిలకు జేసీబీ తగిలి గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. సుమారు గంటన్నర పాటు గందరగోళం నెలకొంది. అక్కడే నక్కి ఉన్న కరాటే మాస్టర్ రాధాకృష్ణను గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు.

 పోలీసుల అదుపులో ముఠా...?
 హైదరాబాద్‌కు చెందిన సుభాష్‌రెడ్డి, నాగేశ్వరరెడ్డి, రాధాక్రిష్ణన్, లక్ష్మారెడ్డి, డోన్‌కు చెందిన ఆంజనేయులుగౌడ్, కోయిలకొండ రాజు, నందికొట్కూరుకు చెందిన విజయుడు, ఓర్వకల్లుకు చెందిన జేసీబీ డ్రైవర్ రవికుమార్, రుద్రవరానికి చెందిన కారు డ్రైవర్ సుంకన్న, కొలిమిగుండ్లకు చెందిన హుస్సేన్‌లు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.
 డైరీలో ఏముంది..?
 మృతి చెందిన రమాదేవి, నాగరాజుల డైరీలో ఏముందన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. మృతుల వద్ద ఉన్న నగదుతో పాటు, డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డైరీలో గుప్తనిధుల తవ్వకాలకు సంబంధించిన విషయాలు ఉన్నాయని స్థానికులు భావిస్తున్నారు. కాగా నాగరాజు, రమాదేవి హత్యకు గురయ్యారని మృతుల బంధువుల ఆరోపిస్తున్నారు.    
 పాల్మాకులలో విషాదం..
 అన్నాచెల్లెళ్ల మృతితో పాల్మాకులలో విషాదం అలుముకుంది. ఈ నెల 25న క్రిస్మస్ పండగ రోజు సెలవు దినం కావడంతో అన్నాచెల్లెల్లు ఇంటి వద్ద ఉన్నారు. మధ్యాహ్నం నాగరాజు సెల్‌కు ఫోన్ వచ్చింది. కాసేపటికే అన్నాచెలెళ్లు ఇద్దరు ఇంట్లోంచి బయలు దేరారు. కృష్ణ సారు రోడ్డు మీద ఉన్నాడంటా.. మమ్మల్ని రమ్మన్నాడంటూ చెప్పి వెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement