హైదరాబాద్ : సభ్య సమాజం సిగ్గుపడేలా సొంత చెల్లెలిపై లైంగిక దాడికి యత్నించిన కీచక సోదరుడిని మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఎస్ఐ రవి కథనం ప్రకారం... ఇందిరా నెహ్రూ నగర్కు చెందిన నర్సింగ్ (30) బైక్ మెకానిక్. అతను తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటుండగా... ఇంటి పక్కనే చెల్లెలి కుటుంబం కూడా నివాసం ఉంటోంది. కాగా ఏడాది నుంచి చెల్లెలు ఉంటున్న ఇంటి స్థలం విషయంలో అన్నాచెల్లెలి మధ్య గొడవ జరుగుతోంది.
ఈ సందర్భంగా పలుమార్లు చెల్లెలు అని చూడకుండా అసభ్యంగా ప్రవర్తించటమే కాకుండా సొంత బావను ఇంట్లో నుంచి బయటకెళ్లగొట్టాడు. గత నెల 29న చెల్లెలు ఒక్కటే ఇంట్లో ఉండగా టీవీ సౌండ్ పెంచి ఆమెపై నర్సింగ్ లైంగిక దాడికి యత్నించటంతో ఆమె ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నర్సింగ్పై నిర్భయచట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.