తమ్ముళ్ల తగవు
Published Wed, Sep 17 2014 2:42 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM
సాక్షి, కడప :
ప్రతిపక్ష నేత ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలి. అందరూ ఐక్యంగా ముందుకెళ్లాలి. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇది ఇటీవల ప్రతి సమావేశంలోనూ టీడీపీ అధినేత చంద్రబాబు చెబుతున్న మాటలు. అయితే జిల్లాలో వాస్తవ పరిస్థితి ఇందు కు భిన్నంగా ఉంది. టీడీపీ శ్రేణులు వర్గ విభేదాలతో రగిలిపోతున్నారు. జిల్లా రాజకీయాలను ఒకరిద్దరు నేతలే శాసిస్తుండటం ఒక స్థాయి నేతలకు మింగుడు పడటం లేదు. ఆధిపత్య పోరులో ఒక్కొక్కరు ఒక్కో గ్రూపును నియోజకవర్గాల్లో పెంచి పోషిస్తుండటంతో గ్రూపు రాజకీయాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల బద్వేలులో నిర్వహించిన ఆ పార్టీ సమావేశంలో ఇద్దరు నియోజకవర్గ నేతల వర్గీయులు బహిరంగ యుద్ధానికి దిగారు. ఆ సంఘటన మరువక ముందే కడపలో జరిగిన విసృ్తత స్థాయి సమీక్షా సమావేశం కూడా రచ్చ రచ్చగా మారింది. పార్టీలోని కీలక నేతలు నియోజకవర్గాల పరిధిలోని నాయకుల విషయంలో ఏకపక్ష ధోరణిలో ఉండటమే ఇందుకు కారణమని పలువురు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో తమ్ముళ్లు పండుగ చేసుకుంటుండగా, జిల్లాలో నేతల మధ్య సయోధ్య లేకపోవడంతో రోజురోజుకు పార్టీ పరిస్థితి తీసికట్టుగా మారుతోంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో తొమ్మిది స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దీంతో కనీసం పార్టీ క్యాడర్‌లో ఉత్సాహం నింపేందుకు చంద్రబాబు రాజంపేటకు చెందిన మేడా మల్లికార్జునరెడ్డికి విప్‌తోపాటు ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డికి శానమండలి డిప్యూటీ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. అయినా ఫలితం కనిపించలేదు. కడపకు చెందిన పలువురు నేతలు జిల్లా అధ్యక్షుడిపైనే చంద్రబాబుకు ఫిర్యా దు చేసేందుకు సిద్ధమవుతుండటం గమనార్హం.
కడపలో ఎవరికి వారే!
కడపలో పార్టీ పరిస్థితి మరీ అధ్వానంగా తయారైందని పార్టీ కార్యకర్తలే చెబుతున్నారు. ఇక్కడ ఎవరికి వారు పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ప్రెస్‌మీట్లు, ఆందోళనలు వేర్వేరుగా చేసుకుంటూనే ముందుకు వెళుతున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారిని కనీసం పలుకరించే వారు కూడా లేరని పలువురు టీడీపీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ్ముళ్ల మధ్య తగువు లాటలతో పార్టీ ప్రతిష్ట బజారున పడుతోందని కార్యకర్తలు మథనపడుతున్నారు.
Advertisement