హతమార్చి.. ఆపై కాల్చేసి..!
► గుంటూరులో ఓ గుమస్తా దారుణహత్య
► కోటప్పకొండలో మృతదేహం కాల్చివేత
► యజమానితో విభేదాలే కారణమని వెల్లడి
► మోసం చేశాడని 2014లో వ్యాపారి ఫిర్యాదు
► అప్పటి నుంచి ఇద్దరి మధ్య వివాదం
► పోలీసుల అదుపులో వ్యాపారి శంకరరావు
పట్నంబజారు(గుంటూరు)/నరసరావుపేట రూరల్/ పొన్నూరు : వ్యాపార లావాదేవీల్లో వివాదాల నేపథ్యంలో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. గుంటూరు నగరంలో గురువారం అర్ధరాత్రి హత్యచేసి నరసరావుపేట సమీపంలోని కోటప్పకొండలో మృతదేహాన్ని కాల్చారు. పోలీసుల కథనం మేరకు...
గుంటూరు బ్రాడీపేటలో నివాసం ఉండే కొప్పురావూరి శంకరరావు మినుమల వ్యాపారం చేస్తుంటాడు. శంకరరావు వద్ద పొన్నూరుకు చెందిన శిఖాకొల్లి శ్రీనివాసరావు (40) నాలుగేళ్లు గుమస్తాగా పనిచేశాడు. ఈ క్రమంలో శ్రీనివాసరావు మినుములకు సంబంధించి పలువురు వ్యాపారులు ఇచ్చిన డబ్బులను వాడుకున్నాడు. దీనిపై శంకరరావు 2014 లో అరండల్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సుమారు రూ. 2 కోట్లకుపైగా తన డబ్బు వాడుకుని మోసం చేశాడని శంకరరావు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
అప్పటి నుంచి శంకరరావు, శ్రీనివాసరావుల మధ్య లావాదేవీల విషయంలో వివాదం నడుస్తూనే ఉంది. దీనిపై ఒకటికి పలు మార్లు శ్రీనివాసరావును శంకరరావు, అతని కుమారుడు సందీప్‌లు డబ్బులు అడిగినప్పటికీ అదిగో... ఇదిగో... అంటూ కాలం వెళ్లబుచ్చడంతోపాటు కనబడకుండా తిరుగుతున్నాడు. దీనిపై కక్ష పెంచుకున్న శంకరరావు, ఆయన కుమారుడు సందీప్, శ్రీనివాసరావును హతమార్చినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రధాన నిందితుడు శంకరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సందీప్‌తో పాటు హత్యలో పాల్గొన్న మరికొందరు పరారీలో ఉన్నారు.
శంకరరావు, సందీపే చంపారు -మృతుడి సోదరుడు సుబ్బారావు
దారుణ హత్యకు గురైన శ్రీనివాసరావు మృతదేహాన్ని కోటప్పకొండ నుంచి పెట్లూరివారిపాలెం వెళ్లే రహదారిలో కొండ పక్కన పెట్రోల్ పోసి దుండగులు శుక్రవారం తెల్లవారుజామున దహనం చేశారు. గుంటూరు వెస్ట్ డీఎస్పీ కేజీవీ సరిత, సీఐ శివప్రసాద్ దహనమైన మృతదేహాన్ని పరిశీలించారు. ఆర్థిక కారణాలే హత్యకు కారణమని డీఎస్పీ సరిత తెలిపారు. మృతదేహాన్ని మృతుడి సోదరుడు సుబ్బారావు గుర్తించాడు. 20 రోజుల నుంచి సోదరుడు కనిపించడం లేదని తెలిపారు. గురువారం రాత్రి తమ సోదరుడిని శంకరరావు, సందీప్‌తో పాటు మరో ముగ్గురు కలసి గుంటూరు అరండల్‌పేటలో హత్యచేసి కోటప్పకొండలో దహనం చేశారన్నారు.
మినుముల వ్యాపారంలో డబ్బుల విషయమై తమ సోదరుడు శ్రీనివాసరావు హత్యకు గురై ఉంటాడని మృతుడి సోదరి నాగమణి తెలిపారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ చెన్నైలో రెండేళ్ళ క్రిందట వరకు శంకరరావు అనే వ్యక్తితో మినుముల వ్యాపారం చేసేవాడని, అతన్ని మోసం చేశాడనే ఆరోపణల నేపథ్యంలోనే తన తమ్ముడు శ్రీనివాసరావుని హత్య చేశారని ఆమె అభిప్రాయడ్డారు. తన తల్లి పక్షవాతం వ్యాధితో బాధపడుతుందని తల్లికి తెలిస్తే తట్టుకోలేదన్న బాధతో తమ్ముడి మరణవార్త చెప్పలేదన్నారు.
పక్కా పథకం ప్రకారమే..!
పట్నంబజారు(గుంటూరు): పక్కా పథకం ప్రకారమే శ్రీనివాసరావును గుంటూరు అరండల్‌పేట 9వ లైనులోని శంకరరావు కార్యాలయంలో హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. శ్రీనివాసరావును హత్య చేసిన తరువాత మృతదేహాన్ని మూడో అంతస్తు నుంచి గోనెసంచిలో కిందకు తీసుకొచ్చే సమయంలో స్థానికంగా కొంత మంది విద్యార్థులు గమనించి డయల్ 100కు సమాచారం అందించారని పోలీసులు చెబుతున్నారు.
దీని ద్వారా పాత గొడవల నేపథ్యంలో శంకరరావు అతని కుమారుడు సందీప్‌లపై అనుమానం వచ్చిన పోలీసులు ఫోన్ ద్వారా వారితో మాట్లాడే ప్రయత్నం చేయడంతో సంబంధం లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం మరింత బలపడింది. దీనికితోడు శంకరరావు కార్యాలయంలో శ్రీనివాసరావుకు సంబంధించిన దుస్తుల బ్యాగు, సెల్‌ఫోన్లు పడి ఉండటంతో హత్యకు పాల్పడింది సందీప్ అని ధ్రువీకరించినట్లు తెలుస్తోంది. సందీప్ సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అతనిని నరసరావుపేట పరిసర ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నారని సమాచారం.