Cellphone Signal
-
వయనాడ్ విపత్తు: ఆ 300 మంది ఎక్కడ?
వయనాడ్/కొల్లామ్: కేరళలో కొండచరియలు పడ్డాక కాపాడండంటూ ఆర్తనాదాలు చేసిన వారిని కాపాడిన సహాయక బృందాలు ఇప్పుడు కనిపించకుండా పోయిన వారిపై ప్రధానంగా దృష్టిపెట్టాయి. ప్రకృతి వినాశక విశాల ఘటనాప్రాంతాల్లో ఇంకా వస్తున్న సెల్‌ఫోన్ సిగ్నళ్ల సాయంతో మనుషుల జాడను గుర్తించే అత్యాధునిక పరికరాలను తెప్పిస్తున్నారు. సెల్‌ఫోన్ చివరి లొకేషన్‌ను అత్యంత ఖచ్చితత్వంతో చూపించే గూగుల్ జీపీఎస్ కోఆర్డినేట్స్, డ్రోన్ ఏరియల్ ఫొటోల సాయంతో శిథిలాలు, కూలిన చెట్లు, బండరాళ్ల మధ్యలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు విశ్వప్రయత్నం చేయనున్నారు. ముండక్కై, చూరల్మల, అత్తమల, నూల్పుజ కుగ్రామాల్లో మరణాల సంఖ్య తాజాగా 300 దాటింది. గుర్తు తెలియని మృతదేహాలకు సామూహిక దహనసంస్కారాలు చేస్తున్నారు.బృందాలుగా ఏర్పడి బరిలోకి..దాదాపు 300 మంది జాడ ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు చెప్పారు. కొండచరియలు పడి విస్తరించిన మొత్తం ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. శునకాలతోపాటు స్థానికులు, అటవీశాఖ సిబ్బంది మొత్తం 40 బృందాలుగా ఏర్పడి గాలింపు ముమ్మరంచేశారు. అత్తమల అరాన్‌మల, ముండక్కై, పుంచిరిమట్టం, వెల్లరిమల, జీవీహెచ్ఎస్ఎస్ వెల్లరిమల, నదీతీరం ఇలా కొండచరియల ప్రభావిత ప్రాంతాలను ఆరు జోన్లుగా విభజించారు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, డీఎస్జీ, కోస్ట్‌గార్డ్, నేవీ, స్థానిక యంత్రాంగం, కేరళ పోలీసులు, స్థానికులు, అటవీ సిబ్బంది, గజ ఈతగాళ్లు సంయుక్తంగా ఈ సంక్లిష్టమైన రెస్క్యూ ఆపరేషన్‌ను మొదలుపెట్టారు. డ్రోన్ ఆధారిత అత్యాధునిక రాడార్‌ను ఢిల్లీ నుంచి తేనున్నారు. 190 అడుగుల బేలీ తాత్కాలిక వంతెన నిర్మాణం పూర్తవంతో భారీ యంత్రాలను తెచ్చేందుకు మార్గం సుగమమైంది.కేంద్రం శ్రద్ధతో పట్టించుకోవాలి: రాహుల్గురువారం ఘటనాస్థలిని పరిశీలించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం సైతం పనులను పర్యవేక్షించారు. ‘‘ఇది పెను విషాదం. ఈ ఉదంతాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధతో పట్టించుకోవాలి. బాధిత కుటుంబాలకు వేరే ప్రాంతాల్లో శాశ్వత పునరావాసం కల్పించాలి’’ అన్నారు. వారికి కాంగ్రెస్ 100 ఇళ్లు కట్టిస్తుందన్నారు.నిక్షేపంగా ఇల్లు,కుటుంబంఇంతటి విలయం మధ్య ఒక ఇల్లు నిక్షేపంగా ఉండటం రెస్క్యూ టీమ్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది. పడవెట్టు కున్ను ప్రాంతంలో భారీ కొండచరియలు పడినా అక్కడి ఒక ఇల్లు మాత్రం దెబ్బతినలేదు. అయితే చుట్టుప క్కల అంతా కొండచరి యలు పడిన భయానక దృశ్యాన్ని చూసిన ఆ ఇంట్లోని నలుగురు కుటుంబసభ్యులు ప్రాణభయంతో మంగళవారం నుంచి ఇంట్లోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఫలానా ప్రాంతంలో తమ వారి జాడ తెలీడం లేదని బంధువులు ఇచ్చిన సమాచారంతో ఘట నాస్థలికి చేరుకున్న హెలికాప్టర్ బృందం సురక్షిత ప్రాంతానికి తరలించిందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.పరిమళించిన మానవత్వంరూ.10 వేలు దానమిచ్చిన చిరు టీస్టాల్ యజమానురాలుసర్వం కోల్పోయిన శిబిరాల్లో తలదాచుకుంటున్న వారికి చిన్నపాటి టీస్టాల్ యజమానురాలు సైతం తనవంతు సాయంచేసి దానగుణాన్ని చాటారు. రోడ్డు పక్కన టీ అమ్ముకునే వృద్ధ మహిళ సుబేదా కేరళ విలయ బాధితులకు తనవంతుగా రూ.10,000 ఇచ్చారు. ఈమె దానగుణం చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. ‘‘ బ్యాంక్ రుణం కట్టేందుకే ఈ డబ్బు దాచా. టీవీలో విషాదవార్త విని మనసు చలించింది. నెలవారీ కిస్తీ(ఈఎంఐ) తర్వాత కడదాం.. ముందు వీళ్లను ఆదుకుందాం అని భర్త సైతం నాకు మద్దతు పలికారు. ఆరోగ్యం సహకరించక వయనాడ్‌దాకా వెళ్లి స్వయంగా ఇచ్చే ఓపికలేక కలెక్టరేట్‌కు వెళ్లి ముఖ్యమంత్రి విపత్తు సహాయనిధిలో జమచేశా’ అని సుబేదా చెప్పారు. వరద బాధితుల సహాయార్ధం గతంలోనూ ఈమె తన నాలుగు మేకలను అమ్మేసి వచ్చిన నగదును విరాళంగా ఇచ్చారు.మేజర్ సీతకు సలామ్కఠిన, విపత్కర, తీవ్ర ప్రతి కూల పరిస్థితుల్లో మహిళలు పనిచేయడం కష్టమనే భావనను ఒక్క ఫొటోతో చెదరగొట్టిన ఆర్మీ మేజర్ సీత అశోక్ శెల్కేకు అందరూ మెచ్చుకుంటున్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న నది మీదుగా 190 అడుగుల బేలీ వంతెనను నిర్మించాల్సిన బాధ్యతను మద్రాస్ ఇంజనీర్ గ్రూప్, సెంటర్ తలకెత్తుకుంది. మేజర్ సీత సారథ్యంలోని జవాన్ల బృందం రేయింబవళ్లూ పనిచేసి 31 గంటల్లోపు వంతెనను నిర్మించింది. వంతెన నిర్మాణ పనుల్లో నిమగ్నమైన మేజర్ సీత ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ‘ భారత సైన్యం తరఫున ఇక్కడికొచ్చి సాయ పడు తున్నందుకు నాక్కూడా గర్వంగా ఉంది. నన్ను నమ్మి ఇంతటి బాధ్యతలు అప్పగించిన ఉన్నతాధి కారులకు, సాయç ³డిన స్థానికులకు నా కృతజ్ఞతలు’ అని సీత అన్నారు. సీత సొంతూరు మహారాష్ట్ర లోని అహ్మద్‌నగర్ దగ్గర్లోని గడిల్‌గావ్. -
‘సిగ్నల్’ చోరీ
సాక్షి, అమరావతి: దేశంలో సెల్‌ఫోన్ సిగ్నల్ సమస్య పెరుగుతోంది. ఫోన్ చేస్తే మధ్యలోనే కాల్ డ్రాప్ అవుతోంది. ఒక్కోసారి సిగ్నల్ ఉన్నట్టే ఉంటుంది.. కానీ ఫోన్ మాత్రం కలవదు. ఇవన్నీ తమ వల్ల వచ్చిన సమస్యలు కావని.. సెల్ టవర్లపై దొంగలు చేతివాటం ప్రదర్శిస్తుండటంతో తలెత్తిన సమస్యలని నెట్వర్క్ ఇంజనీర్లు, టెలికాం సంస్థలు చెబుతున్నాయి. గత 6 నెలల్లో దేశవ్యాప్తంగా 17 వేల రేడియో రిమోట్ యూనిట్లు(ఆర్ఆర్యూ) చోరీకి గురయ్యాయి. టెలి కమ్యూనికేషన్స్‌లో ట్రాన్స్ రిసీవర్‌గా ఆర్ఆర్యూ ఉపయోగపడుతుంది. ఇది ట్రాన్స్మిషన్ పనితీరును, మొబైల్ సిగ్నల్ల స్వీకరణను మిళితం చేస్తుంది. ఆర్‌ఆర్‌యూలు చోరీకి గురవుతుండటంతో సిగ్నల్ సమస్యలు పెరిగిపోతున్నాయని టెలికాం నిపుణులు చెబుతున్నారు. ఈ తరహా దొంగతనాలతో దేశవ్యాప్తంగా టెలికాం కంపెనీలు రూ.800 కోట్ల మేర నష్టాలను చవిచూశాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. దొంగిలించిన ఆర్ఆర్ యూనిట్లును చైనా, బంగ్లాదేశ్ తదితర దేశాలకు అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సెల్యులార్ ఆపరేటర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ).. ఆర్ఆర్యూ దొంగతనాలను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది. దేశ డిజిటల్ భవిష్యత్‌కు ఉపయోగపడే కీలక మౌలిక సదుపాయాలను రక్షించడానికి కఠిన చర్యలు అవసరమని అభిప్రాయపడుతోంది.ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువ.. గతేడాది అక్టోబర్ నుంచి ఈ తరహా దొంగతనాలు పెరిగాయి. గుజరాత్‌తో పాటు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్, హరియాణా, ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. -
మహారాష్ట్రలో దొరికిన ట్రిపుల్ ఐటీ విద్యార్థి
భైంసా: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ సెకండియర్ చదువుతున్న విద్యార్థి బన్నీ మంగళవారం మహారాష్ట్రలో దొరికాడు. గురువారం వర్సిటీ నుంచి ఔట్ పాసు తీసుకుని వెళ్లిన బన్నీ ఇంటికి వెళ్లలేదు. స్నేహితులకు కూడా చెప్పకుండా సెల్ స్విచాఫ్ చేయడంతో ఆందోళన చెందిన కుటుంబీకులు బాసర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న బాసర ఎస్ఐ మహేశ్ రైల్వేస్టేషన్‌లోని సీసీ పుటేజీలు పరిశీలించగా గురువారం ఉదయం 10.40 గంటల ప్రాంతంలో మహారాష్ట్ర వైపు వెళ్లే రైలు ఎక్కినట్లు గుర్తించారు. బన్నీ సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా మహారాష్ట్రలో ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు.దీంతో మహారాష్ట్ర వెళ్లిన పోలీసులు.. పర్బనీ జిల్లా పూర్ణ ప్రాంతంలో అతడు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం కుటుంబ సభ్యులను వెంట తీసుకెళ్లి బన్నీని అక్కడే వారికి అప్పగించారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని బాసర పోలీసులు తెలిపారు. -
స్మార్ట్ టన్నెల్.. సెల్ సిగ్నల్ దొరక్క ప్రాణం పోయింది!
స్మార్ట్ ఫైర్ మేనేజ్ మెంట్, డిజిటల్ సీసీటీవీ కెమెరా సెటప్.. టోటల్‌గా మోడ్రన్ టెక్నాలజీ సెటప్‌ను సంతరించుకున్న టన్నెల్ అది. కానీ, సమయానికి సెల్‌ఫోన్ సిగ్నల్ దొరకలేదు. ఫలితంగా ఒక నిండు ప్రాణం పోయింది. ఢిల్లీ ప్రగతి మైదాన్ టన్నెల్ వద్ద బుధవారం ఓ టీనేజర్ ప్రాణం పోయింది. ఓ బైకర్ ప్రమాదానికి గురికాగా, అతన్ని రక్షించేందుకు అక్కడున్నవాళ్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కారణం.. సెల్‌ఫోన్ సిగ్నల్ దొరక్క ఆంబులెన్స్ చాలా ఆలస్యంగా రావడం. రాజన్ రాయ్(19) అనే కుర్రాడు.. ప్రగతి మైదాన్ టన్నెల్లో వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. బైక్ నుంచి పడిపోయి.. హెల్మెట్ సైతం పగిలిపోయి తలకు బలమైన గాయమైంది. అది చూసి కొందరు వాహనదారులు ఆగి.. ఎమర్జెన్సీ సర్వీసుకు కాల్ చేయబోయారు. కానీ, టన్నెల్లో సిగ్నల్స్ లేకపోవడంతో అది కుదరలేదు. ఈ లోపు కొందరు బయటకు వెళ్లి.. అక్కడి నుంచి ఫోన్ చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్లో ఆంబులెన్స్ రాక ఆలస్యమైంది. లేడీ హర్డింగే ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు ట్రీట్మెంట్ మొదలుపెట్టగానే అతను కన్నుమూశాడు. కాస్త ముందు వచ్చి ఉంటే అతని ప్రాణాలు దక్కేవని తెలిపారు వైద్యులు. అయితే.. టన్నెల్ లోపల సిగ్నల్స్ అందకపోవడంతో ఎమర్జెన్సీ సర్వీసుకు కాల్ కలవలేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు. సకాలంలో చికిత్స అంది తమ కొడుకు తమకు దక్కేవాడని రాజన్ తల్లిదండ్రులు వాపోతున్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని వారు తెలిపారు. ట్రాన్సిట్ కారిడార్ ప్రాజెక్ట్ లో భాగంగా ప్రభుత్వం గతేడాది ఈ టన్నెల్‌ను ప్రారంభించింది. Disclaimer Note: ఈ వీడియో మిమ్మల్ని కలవరపర్చొచ్చు! A biker was killed in a road mishap at Pragati Maidan tunnel in Delhi. #CCTV #cctvfootage #pragatimaidan #Delhi #India #viral #viralvideo #viral2023 #ViralVideos #Accidents pic.twitter.com/TcBJrwhGwr — Anjali Choudhury (@AnjaliC16408461) May 25, 2023 -
నటి చౌరాసియాపై దాడి.. మిస్టరీ వీడింది..
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు జీహెచ్ఎంసీ వాక్‌వేలో సినీ నటిపై దుండగుడి దాడి మిస్టరీని పోలీసులు ఛేదించారు. గత ఆదివారం రాత్రి 8.40 గంటల సమయంలో కేబీఆర్ పార్కు వాక్‌వేలో సినీ నటి షాలు చౌరాసియా వాకింగ్ చేస్తుండగా దుండగుడు ఆమెపై దాడి చేసి..లైంగికి దాడికి యత్నించి సెల్‌ఫోన్ తస్కరించి పరారైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఘటన జరిగిన అయిదు రోజుల్లోనే ఛేదించారు. నిందితుడు తెలుగు చలన చిత్రపరిశ్రమలో లైట్‌మెన్‌గా పని చేస్తున్న కె.బాబు (30)గా గుర్తించి శుక్రవారం మధ్యాహ్నం బంజారాహిల్స్ రోడ్ నం.2లోని ఇందిరానగర్‌లో అదుపులోకి తీసుకున్నారు. చోరీ చేసిన సెల్‌ఫోనే నిందితుడిని పట్టించడం గమనార్హం. ఆదివారం రాత్రి వాకింగ్ చేస్తున్న షాలూ చౌరాసియాపై నిందితుడు దాడి చేసి తీవ్రంగా కొట్టి రూ. 10 వేలు డిమాండ్ చేశాడు. ఆమె తన దగ్గర డబ్బులు లేవని పేటీఎం చేస్తానని చెప్పినా వినిపించుకోలేదు. బండరాయి పక్కన కిందకు తోసేసి ఆమెను తీవ్ర ఇబ్బందికి గురి చేశాడు. ఒక సందర్భంలో బండరాయిని ముఖంపై బాది హత్య చేసేందుకు కూడా యత్నించాడు. శక్తిని కూడదీసుకున్న బాధిత నటి తన మోచేతితో దుండుగుడిపై దాడి చేసి ఫెన్సింగ్ దూకి బయటికి పరుగులు తీసింది. తీవ్రంగా శ్రమించిన పోలీసులు ఈ ఘటనను సవాల్‌గా తీసుకున్న వెస్ట్ జోన్, నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్, బంజారాహిల్స్ పోలీసులు బృందాలుగా ఏర్పడి అటు సీసీ కెమెరాలతో పాటు ఇటు సెల్‌ఫోన్ సిగ్నల్స్‌ను జల్లెడ పట్టాయి. ఆదివారం రాత్రి 11.40 గంటల ప్రాంతంలో నిందితుడు ఇందిరానగర్ ప్రాంతంలో సెల్ ఫోన్ స్విచ్చాఫ్ చేసినట్లుగా గుర్తించిన నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆ ఒక్క ఆధారంతో సాంకేతికతను ఉపయోగించి నిందితుడిని పట్టుకున్నారు. కృష్ణానగర్, ఇందిరానగర్ మధ్యలో గది అద్దెకు తీసుకొని ఉంటున్న కె.బాబు సినీ పరిశ్రమలో లైట్‌మెన్‌గా పని చేస్తున్నట్లుగా తేలింది. నిందితుడు ఆ రోజు వేసుకున్న షర్ట్, ప్యాంట్ కలర్ ఆధారంగా ఊహా చిత్రాన్ని తయారు చేసిన నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురు, శుక్రవారాల్లో ఇందిరానగర్, కృష్ణానగర్ ప్రాంతాల్లో సినీ కార్మికులు ఉండే ప్రాంతాలను జల్లెడపట్టారు. ఎట్టకేలకు ఆరోజు నిందితుడు వేసుకున్న షర్ట్‌ను గుర్తించిన సహచరులు పోలీసులకు తగిన ఆధారాలు అందజేశారు. దీంతో పోలీసులు నిందితుడి గదిలో ఉండగానే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సెల్‌ఫోన్ దొరకడంతో అతడే నిందితుడని నిర్ధారించారు. రెక్కీ చేసి.. పోలీసులు దర్యాప్తులో సంచలన విషయాలు నిందితుడు వెల్లడించినట్లుగా తేలింది. ఘటన జరిగిన నాటికి నాలుగు రోజుల ముందు నుంచే నిందితుడు ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహించినట్లు తేలింది. ఆ రోజూ సీసీ కెమెరాలు లేనిచోట, చీకటి ఉన్న ప్రాంతాన్ని గుర్తించి ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక అత్యాచార యత్నానికి పాల్పడినట్లుగా తెలిపాడు. దొంగతనానికి రాలేదని, అత్యాచారం చేయడానికే వచ్చినట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో నిందితుడు వెల్లడించినట్లు తెలిసింది. మొత్తానికి నిందితుడు పట్టుబడటంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. -
హతమార్చి.. ఆపై కాల్చేసి..!
► గుంటూరులో ఓ గుమస్తా దారుణహత్య ► కోటప్పకొండలో మృతదేహం కాల్చివేత ► యజమానితో విభేదాలే కారణమని వెల్లడి ► మోసం చేశాడని 2014లో వ్యాపారి ఫిర్యాదు ► అప్పటి నుంచి ఇద్దరి మధ్య వివాదం ► పోలీసుల అదుపులో వ్యాపారి శంకరరావు పట్నంబజారు(గుంటూరు)/నరసరావుపేట రూరల్/ పొన్నూరు : వ్యాపార లావాదేవీల్లో వివాదాల నేపథ్యంలో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. గుంటూరు నగరంలో గురువారం అర్ధరాత్రి హత్యచేసి నరసరావుపేట సమీపంలోని కోటప్పకొండలో మృతదేహాన్ని కాల్చారు. పోలీసుల కథనం మేరకు... గుంటూరు బ్రాడీపేటలో నివాసం ఉండే కొప్పురావూరి శంకరరావు మినుమల వ్యాపారం చేస్తుంటాడు. శంకరరావు వద్ద పొన్నూరుకు చెందిన శిఖాకొల్లి శ్రీనివాసరావు (40) నాలుగేళ్లు గుమస్తాగా పనిచేశాడు. ఈ క్రమంలో శ్రీనివాసరావు మినుములకు సంబంధించి పలువురు వ్యాపారులు ఇచ్చిన డబ్బులను వాడుకున్నాడు. దీనిపై శంకరరావు 2014 లో అరండల్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సుమారు రూ. 2 కోట్లకుపైగా తన డబ్బు వాడుకుని మోసం చేశాడని శంకరరావు ఫిర్యాదులో పేర్కొన్నాడు. అప్పటి నుంచి శంకరరావు, శ్రీనివాసరావుల మధ్య లావాదేవీల విషయంలో వివాదం నడుస్తూనే ఉంది. దీనిపై ఒకటికి పలు మార్లు శ్రీనివాసరావును శంకరరావు, అతని కుమారుడు సందీప్‌లు డబ్బులు అడిగినప్పటికీ అదిగో... ఇదిగో... అంటూ కాలం వెళ్లబుచ్చడంతోపాటు కనబడకుండా తిరుగుతున్నాడు. దీనిపై కక్ష పెంచుకున్న శంకరరావు, ఆయన కుమారుడు సందీప్, శ్రీనివాసరావును హతమార్చినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రధాన నిందితుడు శంకరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సందీప్‌తో పాటు హత్యలో పాల్గొన్న మరికొందరు పరారీలో ఉన్నారు. శంకరరావు, సందీపే చంపారు -మృతుడి సోదరుడు సుబ్బారావు దారుణ హత్యకు గురైన శ్రీనివాసరావు మృతదేహాన్ని కోటప్పకొండ నుంచి పెట్లూరివారిపాలెం వెళ్లే రహదారిలో కొండ పక్కన పెట్రోల్ పోసి దుండగులు శుక్రవారం తెల్లవారుజామున దహనం చేశారు. గుంటూరు వెస్ట్ డీఎస్పీ కేజీవీ సరిత, సీఐ శివప్రసాద్ దహనమైన మృతదేహాన్ని పరిశీలించారు. ఆర్థిక కారణాలే హత్యకు కారణమని డీఎస్పీ సరిత తెలిపారు. మృతదేహాన్ని మృతుడి సోదరుడు సుబ్బారావు గుర్తించాడు. 20 రోజుల నుంచి సోదరుడు కనిపించడం లేదని తెలిపారు. గురువారం రాత్రి తమ సోదరుడిని శంకరరావు, సందీప్‌తో పాటు మరో ముగ్గురు కలసి గుంటూరు అరండల్‌పేటలో హత్యచేసి కోటప్పకొండలో దహనం చేశారన్నారు. మినుముల వ్యాపారంలో డబ్బుల విషయమై తమ సోదరుడు శ్రీనివాసరావు హత్యకు గురై ఉంటాడని మృతుడి సోదరి నాగమణి తెలిపారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ చెన్నైలో రెండేళ్ళ క్రిందట వరకు శంకరరావు అనే వ్యక్తితో మినుముల వ్యాపారం చేసేవాడని, అతన్ని మోసం చేశాడనే ఆరోపణల నేపథ్యంలోనే తన తమ్ముడు శ్రీనివాసరావుని హత్య చేశారని ఆమె అభిప్రాయడ్డారు. తన తల్లి పక్షవాతం వ్యాధితో బాధపడుతుందని తల్లికి తెలిస్తే తట్టుకోలేదన్న బాధతో తమ్ముడి మరణవార్త చెప్పలేదన్నారు. పక్కా పథకం ప్రకారమే..! పట్నంబజారు(గుంటూరు): పక్కా పథకం ప్రకారమే శ్రీనివాసరావును గుంటూరు అరండల్‌పేట 9వ లైనులోని శంకరరావు కార్యాలయంలో హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. శ్రీనివాసరావును హత్య చేసిన తరువాత మృతదేహాన్ని మూడో అంతస్తు నుంచి గోనెసంచిలో కిందకు తీసుకొచ్చే సమయంలో స్థానికంగా కొంత మంది విద్యార్థులు గమనించి డయల్ 100కు సమాచారం అందించారని పోలీసులు చెబుతున్నారు. దీని ద్వారా పాత గొడవల నేపథ్యంలో శంకరరావు అతని కుమారుడు సందీప్‌లపై అనుమానం వచ్చిన పోలీసులు ఫోన్ ద్వారా వారితో మాట్లాడే ప్రయత్నం చేయడంతో సంబంధం లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం మరింత బలపడింది. దీనికితోడు శంకరరావు కార్యాలయంలో శ్రీనివాసరావుకు సంబంధించిన దుస్తుల బ్యాగు, సెల్ఫోన్లు పడి ఉండటంతో హత్యకు పాల్పడింది సందీప్ అని ధ్రువీకరించినట్లు తెలుస్తోంది. సందీప్ సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అతనిని నరసరావుపేట పరిసర ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నారని సమాచారం.