![The theft of telecom equipment is on the rise in the country](/styles/webp/s3/article_images/2024/06/9/thefft.jpg.webp?itok=c6UI6XMx)
దేశంలో పెరుగుతున్న టెలికాం పరికరాల దొంగతనాలు
ఆరు నెలల్లో 17 వేల రేడియో రిమోట్ యూనిట్ల చోరీ
టెలికాం కంపెనీలకు రూ.800 కోట్ల మేర నష్టాలు
చోరీలను అరికట్టాలని కేంద్రానికి సీఓఏఐ విజ్ఞప్తి
సాక్షి, అమరావతి: దేశంలో సెల్‌ఫోన్ సిగ్నల్ సమస్య పెరుగుతోంది. ఫోన్ చేస్తే మధ్యలోనే కాల్ డ్రాప్ అవుతోంది. ఒక్కోసారి సిగ్నల్ ఉన్నట్టే ఉంటుంది.. కానీ ఫోన్ మాత్రం కలవదు. ఇవన్నీ తమ వల్ల వచ్చిన సమస్యలు కావని.. సెల్ టవర్లపై దొంగలు చేతివాటం ప్రదర్శిస్తుండటంతో తలెత్తిన సమస్యలని నెట్‌వర్క్ ఇంజనీర్లు, టెలికాం సంస్థలు చెబుతున్నాయి.
గత 6 నెలల్లో దేశవ్యాప్తంగా 17 వేల రేడియో రిమోట్ యూనిట్లు(ఆర్‌ఆర్‌యూ) చోరీకి గురయ్యాయి. టెలి కమ్యూనికేషన్స్‌లో ట్రాన్స్ రిసీవర్‌గా ఆర్‌ఆర్‌యూ ఉపయోగపడుతుంది. ఇది ట్రాన్స్‌మిషన్ పనితీరును, మొబైల్ సిగ్నల్‌ల స్వీకరణను మిళితం చేస్తుంది. ఆర్‌ఆర్‌యూలు చోరీకి గురవుతుండటంతో సిగ్నల్ సమస్యలు పెరిగిపోతున్నాయని టెలికాం నిపుణులు చెబుతున్నారు.
ఈ తరహా దొంగతనాలతో దేశవ్యాప్తంగా టెలికాం కంపెనీలు రూ.800 కోట్ల మేర నష్టాలను చవిచూశాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. దొంగిలించిన ఆర్‌ఆర్ యూనిట్లును చైనా, బంగ్లాదేశ్ తదితర దేశాలకు అక్రమంగా రవాణా చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో సెల్యులార్ ఆపరేటర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ).. ఆర్‌ఆర్‌యూ దొంగతనాలను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది. దేశ డిజిటల్ భవిష్యత్‌కు ఉపయోగపడే కీలక మౌలిక సదుపాయాలను రక్షించడానికి కఠిన చర్యలు అవసరమని అభిప్రాయపడుతోంది.
ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువ..
గతేడాది అక్టోబర్ నుంచి ఈ తరహా దొంగతనాలు పెరిగాయి. గుజరాత్‌తో పాటు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్, హరియాణా, ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment