వయనాడ్‌ విపత్తు: ఆ 300 మంది ఎక్కడ? | Wayanad landslide: GPS coordinates, aerial drone pictures used by rescuers to locate survivors | Sakshi
Sakshi News home page

Wayanad Landslides: ఆ 300 మంది ఎక్కడ?

Published Sat, Aug 3 2024 5:53 AM | Last Updated on Sat, Aug 3 2024 7:27 AM

Wayanad landslide: GPS coordinates, aerial drone pictures used by rescuers to locate survivors

శిథిలాల కింద చిక్కుకుంటే వారిని రక్షించేందుకు వ్యూహం సిద్ధం

వయనాడ్‌/కొల్లామ్‌: కేరళలో కొండచరియలు పడ్డాక కాపాడండంటూ ఆర్తనాదాలు చేసిన వారిని కాపాడిన సహాయక బృందాలు ఇప్పుడు కనిపించకుండా పోయిన వారిపై ప్రధానంగా దృష్టిపెట్టాయి. ప్రకృతి వినాశక విశాల ఘటనాప్రాంతాల్లో ఇంకా వస్తున్న సెల్‌ఫోన్‌ సిగ్నళ్ల సాయంతో మనుషుల జాడను గుర్తించే అత్యాధునిక పరికరాలను తెప్పిస్తున్నారు. 

సెల్‌ఫోన్‌ చివరి లొకేషన్‌ను అత్యంత ఖచ్చితత్వంతో చూపించే గూగుల్‌ జీపీఎస్‌ కోఆర్డినేట్స్, డ్రోన్‌ ఏరియల్‌ ఫొటోల సాయంతో శిథిలాలు, కూలిన చెట్లు, బండరాళ్ల మధ్యలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు విశ్వప్రయత్నం చేయనున్నారు. ముండక్కై, చూరల్మల, అత్తమల, నూల్పుజ కుగ్రామాల్లో మరణాల సంఖ్య తాజాగా 300 దాటింది. గుర్తు తెలియని మృతదేహాలకు సామూహిక దహనసంస్కారాలు చేస్తున్నారు.

బృందాలుగా ఏర్పడి బరిలోకి..
దాదాపు 300 మంది జాడ ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు చెప్పారు. కొండచరియలు పడి విస్తరించిన మొత్తం ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. శునకాలతోపాటు స్థానికులు, అటవీశాఖ సిబ్బంది మొత్తం 40 బృందాలుగా ఏర్పడి గాలింపు ముమ్మరంచేశారు. అత్తమల అరాన్‌మల, ముండక్కై, పుంచిరిమట్టం, వెల్లరిమల, జీవీహెచ్‌ఎస్‌ఎస్‌ వెల్లరిమల, నదీతీరం ఇలా కొండచరియల ప్రభావిత ప్రాంతాలను ఆరు జోన్లుగా విభజించారు.

 ఆర్మీ, ఎన్‌డీఆర్‌ఎఫ్, డీఎస్‌జీ, కోస్ట్‌గార్డ్, నేవీ, స్థానిక యంత్రాంగం, కేరళ పోలీసులు, స్థానికులు, అటవీ సిబ్బంది, గజ ఈతగాళ్లు సంయుక్తంగా ఈ సంక్లిష్టమైన రెస్క్యూ ఆపరేషన్‌ను మొదలుపెట్టారు. డ్రోన్‌ ఆధారిత అత్యాధునిక రాడార్‌ను ఢిల్లీ నుంచి తేనున్నారు. 190 అడుగుల బేలీ తాత్కాలిక వంతెన నిర్మాణం పూర్తవంతో భారీ యంత్రాలను తెచ్చేందుకు మార్గం సుగమమైంది.

కేంద్రం శ్రద్ధతో పట్టించుకోవాలి: రాహుల్‌
గురువారం ఘటనాస్థలిని పరిశీలించిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ శుక్రవారం సైతం పనులను పర్యవేక్షించారు. ‘‘ఇది పెను విషాదం. ఈ ఉదంతాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధతో పట్టించుకోవాలి. బాధిత కుటుంబాలకు వేరే ప్రాంతాల్లో శాశ్వత పునరావాసం కల్పించాలి’’ అన్నారు. వారికి కాంగ్రెస్‌ 100 ఇళ్లు కట్టిస్తుందన్నారు.

నిక్షేపంగా ఇల్లు,కుటుంబం
ఇంతటి విలయం మధ్య ఒక ఇల్లు నిక్షేపంగా ఉండటం రెస్క్యూ టీమ్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది. పడవెట్టు కున్ను ప్రాంతంలో భారీ కొండచరియలు పడినా అక్కడి ఒక ఇల్లు మాత్రం దెబ్బతినలేదు. అయితే చుట్టుప క్కల అంతా కొండచరి యలు పడిన భయానక దృశ్యాన్ని చూసిన ఆ ఇంట్లోని నలుగురు కుటుంబసభ్యులు ప్రాణభయంతో మంగళవారం నుంచి ఇంట్లోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఫలానా ప్రాంతంలో తమ వారి జాడ తెలీడం లేదని బంధువులు ఇచ్చిన సమాచారంతో ఘట నాస్థలికి చేరుకున్న హెలికాప్టర్‌ బృందం సురక్షిత ప్రాంతానికి తరలించిందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.

పరిమళించిన మానవత్వం
రూ.10 వేలు దానమిచ్చిన చిరు టీస్టాల్‌ యజమానురాలు
సర్వం కోల్పోయిన శిబిరాల్లో తలదాచుకుంటున్న వారికి చిన్నపాటి టీస్టాల్‌ యజమానురాలు సైతం తనవంతు సాయంచేసి దానగుణాన్ని చాటారు. రోడ్డు పక్కన టీ అమ్ముకునే వృద్ధ మహిళ సుబేదా కేరళ విలయ బాధితులకు తనవంతుగా రూ.10,000 ఇచ్చారు. ఈమె దానగుణం చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. ‘‘ బ్యాంక్‌ రుణం కట్టేందుకే ఈ డబ్బు దాచా. టీవీలో విషాదవార్త విని మనసు చలించింది. 

నెలవారీ కిస్తీ(ఈఎంఐ) తర్వాత కడదాం.. ముందు వీళ్లను ఆదుకుందాం అని భర్త సైతం నాకు మద్దతు పలికారు. ఆరోగ్యం సహకరించక వయనాడ్‌దాకా వెళ్లి స్వయంగా ఇచ్చే ఓపికలేక కలెక్టరేట్‌కు వెళ్లి ముఖ్యమంత్రి విపత్తు సహాయనిధిలో జమచేశా’ అని సుబేదా చెప్పారు. వరద బాధితుల సహాయార్ధం గతంలోనూ ఈమె తన నాలుగు మేకలను అమ్మేసి వచ్చిన నగదును విరాళంగా ఇచ్చారు.

మేజర్‌ సీతకు సలామ్‌
కఠిన, విపత్కర, తీవ్ర ప్రతి కూల పరిస్థితుల్లో మహిళలు పనిచేయడం కష్టమనే భావనను ఒక్క ఫొటోతో చెదరగొట్టిన ఆర్మీ మేజర్‌ సీత అశోక్‌ శెల్కేకు అందరూ మెచ్చుకుంటున్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న నది మీదుగా 190 అడుగుల బేలీ వంతెనను నిర్మించాల్సిన బాధ్యతను మద్రాస్‌ ఇంజనీర్‌ గ్రూప్, సెంటర్‌ తలకెత్తుకుంది. 

మేజర్‌ సీత సారథ్యంలోని జవాన్ల బృందం రేయింబవళ్లూ పనిచేసి 31 గంటల్లోపు వంతెనను నిర్మించింది. వంతెన నిర్మాణ పనుల్లో నిమగ్నమైన మేజర్‌ సీత ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ‘ భారత సైన్యం తరఫున ఇక్కడికొచ్చి సాయ పడు తున్నందుకు నాక్కూడా గర్వంగా ఉంది. నన్ను నమ్మి ఇంతటి బాధ్యతలు అప్పగించిన ఉన్నతాధి కారులకు, సాయç ³డిన స్థానికులకు నా కృతజ్ఞతలు’ అని సీత అన్నారు. సీత సొంతూరు మహారాష్ట్ర లోని అహ్మద్‌నగర్‌ దగ్గర్లోని గడిల్‌గావ్‌.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement