నేను తప్పన్నానా? సమాధానం చెప్పాలి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మరోసారి శాంతిభద్రతలపై రగడ జరిగింది. దాంతో అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొంది. శనివారం సభలో ప్రశ్నోత్తరాల సమయం అనంతరం శాంతిభద్రతలపై చర్చ పునఃప్రారంభమైంది. చర్చ ప్రారంభం కాగానే టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ తాను ఎలాంటి పరుష పదజాలం వాడలేదని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదే విషయంపై టీడీపీ సభ్యులు నిరసన తెలుపుతూ స్పీకర్ పోడియం వద్దకు దూసుకు వెళ్లి నినాదాలు చేశారు. దాంతో అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సభ్యులు తమ తమ స్థానాల్లో కూర్చోవాలని స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. సభ్యుడు మాట్లాడేందుకు నిలబడి ఉన్నారని, ఆయనకు అవకాశం ఇవ్వాలని కోరినా అధికార సభ్యులు ఏమాత్రం వినిపించుకోలేదు. దాంతో స్పీకర్ సభను పావుగంట వాయిదా వేశారు.