సాక్షి, అమరావతి : రాష్ట్ర ఆదాయం తగ్గుదలపై శాసన మండలిలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వివరణ ఇచ్చారు. ప్రతిపక్ష టీడీపీ చెప్పినట్లు రాష్ట్ర ఆదాయం 40 శాతం తగ్గలేదని.. కేవలం 8 శాతం మాత్రమే తగ్గిందని ఓ ప్రకటన విడుదల చేశారు. ఆదాయం తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయన్నారు. ఆర్థిక సంక్షోభం కారణంగా రాష్ట్ర ఆదాయమేకాదు.. దేశ ఆదాయం కూడా తగ్గిందని బుగ్గన అన్నారు. ‘ఏ ప్రభుత్వమైనా ఐదారు కోట్లు బిల్లులు చెల్లించకుండా వెళ్ళడం పరిపాటే.. కానీ గత ప్రభుత్వం ఏకంగా 40 వేల కోట్లకుపైగా బిల్లులు చెల్లించలేదు. ఆరు నెలల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన 20 వేల కోట్లు అప్పులు చెల్లించాం. 15 వ ఆర్ధిక సంఘం కింద నిధులను పెంచి ఇవ్వమని కేంద్రాన్ని అడుతున్నాం. గత సంవత్సరం జూలై, నుంచి డిసెంబర్ మధ్యలో చంద్రబాబు ప్రభుత్వం 24 రోజులు ఓడీలో ఉంది. కానీ ఈ ప్రభుత్వం జూలై నుంచి డిసెంబర్ మధ్యలో రెండు రోజులు మాత్రమే ఓడీలో ఉంది’ అని అన్నారు.
అవినీతి రహిత పాలన కోసం చర్యలు: కన్నబాబు
ఏసీబీ డీజీగా ఠాగూర్ పనిచేసిన సమయంలో అధికారులను ఉద్దేశ్యపూర్వకంగా వేధించారని తమకు ఫిర్యాదులు అందాయని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ‘ఈ వ్యవహారంపై ఉన్నత స్ధాయి కమిటీని ప్రభుత్వం నియమించింది. ఠాకూర్ హైద్రాబాద్‌లో ఇళ్ళు, పార్కు కబ్జా చేశారని ఆరోపణలు వచ్చాయి. ఏసీబీతో ఉద్దేశ్యపూర్వకంగా దాడులు చేయించారా లేక ఇతర కోణాల్లో చేశారా అన్న ఆరోపణలపై కూడా విచారిస్తున్నాం. అవినీతి రహిత పాలన కోసం సీఎం వైఎస్ జగన్ చర్యలు తీసుకుంటున్నారు’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment